BRS Meeting: ఖమ్మం బీఆర్ఎస్ సభకి ఏపీ నుంచీ భారీగా జనసమీకరణ! వీరికి బాధ్యతలు
ఏపీ నుంచి ప్రజలను సభకు తరలించే బాధ్యతను ఏపీ బీఆర్ఎస్ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిషోర్, పార్థ సారథి తదితరులు చూసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి మారిన తర్వాత బీఆర్ఎస్ గా మారిన తరువాత మొదటి సారిగా ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న బహిరంగ సభ బాగా ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. అక్కడ తలపెట్టిన సభ ద్వారా తెలంగాణ ప్రజలనే కాకుండా సాధ్యమైనంత వరకూ సమీప ప్రాంతాలైన ఏపీ ప్రజల్ని కూడా ప్రభావితం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. అందుకే సరిహద్దు జిల్లాలను సభ కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ భారీ ఎత్తున నిర్వహించే సభలో కేసీఆర్ చేసే ప్రసంగం గట్టి మెసేజ్ ఇస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ భారీ సభకు భారీ సంఖ్యలో జన సమీకరణ చేయడంలో నేతలు నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రంలో జనాన్ని తరలించే బాధ్యతను పలువురు మంత్రులకు అప్పగించగా.. ఏపీ నుంచి ప్రజలను సభకు తరలించే బాధ్యతను ఏపీ బీఆర్ఎస్ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిషోర్, పార్థ సారథి తదితరులు చూసుకుంటున్నారు. ఇందులో మంత్రి తలసాని శ్రీనివాస్, వి.శ్రీనివాస్ గౌడ్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి సుమారు ఐదు లక్షల మంది జనాన్ని సభకు తరలించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఏపీ నుంచి జనాన్ని తరలించడంతో పాటు అక్కడ పార్టీపై జనాల్లో ఉన్న ఆదరణను ఇప్పటికే ఆ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తో పాటు రావెల కిషోర్ బాబు, పార్థ సారథి తదితరులు కేసీఆర్ తో చర్చించారు. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ విడిచిపోయే యోచనలో ఉండడంతో ఆ ప్రభావం సభపై పడడం గురించి కూడా గతంలో నిర్వహించిన సమీక్షల్లో చర్చించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున బాధ్యతలను ఆ జిల్లా నేతలకే వదిలిపెట్టకుండా ఇతర మంత్రులకు కూడా కేసీఆర్ అప్పగించారు. సక్సెస్ చేసే బాధ్యత మంత్రి హరీశ్ రావుకు అప్పగించడంతో రెండు రోజులుగా ఆయన అక్కడే మకాం వేశారు.
ఏపీలో అక్కడక్కడా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు
సంక్రాంతి పండుగకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీలో ప్రధాన నగరాల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టారు. గుంటూరు, విజయవాడ, యానాం, కొత్తపేట, కడియం, కాకినాడ, ముమ్మిడివరంతో పాటు రద్దీ ప్రాంతాల్లో పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు, హోర్డింల్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫొటోలు కూడా ఉన్నాయి.
On the occasion of #sankranti festival, the #AndhraPradesh cheered up in a festive mood.The ranks of the #BRSParty are also celebrating across AP. Party fans and leaders are displaying their support to the BRS party by installing the flexis in many Cities of #AndraPradesh ۔ pic.twitter.com/cHX6vNZ3Zo
— Iqbal Hussain اقبال حسین (@iqbalbroadcast) January 14, 2023