BRS Protests: నడిరోడ్లపై వంటావార్పు, గ్యాస్ బండ ధర పెంపుపై బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు
మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి కూడా ఘట్‌కేసర్ లో ధర్నా చేశారు. బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై తెలంగాణ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి నేతలు గ్యాస్ బండలతో నిరసనలు చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీ నేతలు గ్యాస్ బండలతో నిరసనల్లో పాల్గొన్నారు. మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి కూడా ఘట్‌కేసర్ లో ధర్నా చేశారు. బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు అన్నారు. నిండా ముంచిన బీజేపీని ముంచాలని ప్రజలు చూస్తున్నారని విమర్శించారు. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి జేబులు ఖాళీ చేస్తున్నారని అన్నారు.
గత యూపీఏ హయాంలో గ్యాస్‌పై ప్రభుత్వం రూ.2.14 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చేదని గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ పూర్తిగా ఎత్తివేసిందని విమర్శించారు. గతంలో గ్యాస్ ధర రూ.400 ఉంటేనే బీజేపీ గగ్గోలు పెట్టిందని గుర్తు చేశారు. మరి ఇప్పుడు రూ.1,100 దాటినా, ఆ పార్టీ నాయకులు ఎందుకు బయటికి రావడం లేదని ప్రశ్నించారు.
నిజామాబాద్‌లో వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నా
పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు బీఆరెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
‘‘మళ్ళీ ఆడబిడ్డలు కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై ధరలు పెంచటం సిగ్గు చేటు. నరేంద్ర మోదీ ప్రధాని అయినపుడు గ్యాస్ బండ రూ.410 ఉండే. ఆయన ప్రధాని అయ్యాక 13 సార్లు సిలిండర్ ధరలు పెంచారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 2014 మన్మోహన్ సింగ్ రూ.50 పెంచితే బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ నాడు తప్పుబట్టింది. ఇప్పుడు అదే స్మృతి ఇరానీ, మోదీ రూ.750 పెంచారు. మరి దీనికి ఏం సమాధానం చెబుతారు స్మృతి ఇరానీ అని ప్రశ్నించారు మంత్రి వేముల.
‘‘దేశంలో ఉన్న 30 కోట్ల ఆడ బిడ్డలకు ఇబ్బందిగా మారింది. కేవలం రూ.35 వేల కోట్లు సబ్సిడీ ఇస్తే.. గ్యాస్ ధరలు పెరగవు. సిలిండర్ ధర రూ.450 మాత్రమే ఉంటుంది. నీ స్నేహితుడు ఆదానికి రూ.35 వేల కోట్ల రూపాయలు మాఫీ చేశావు. ఇవాళ ప్రశ్నిస్తే సిబిఐ కేసులు వేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తామని అంటున్నారు బీజేపీ నాయకులు. ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. నెలకు పెట్రోల్ మీద ఒక వ్యక్తి కి 1500 భారం పడుతుంది. వంట గ్యాస్ మీద 750 రూపాయలు ఒక వ్యక్తి మీద దోచేస్తున్నారు. 20 రూపాయల సబ్బు 40 రూపాయలు అవుతున్నాయి’’ అని అన్నారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.