Bhatti Vikramarka: 'దేవుడి సాక్షింగా డిప్యూటీ సీఎం భట్టికి అవమానం' - సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్, బీఎస్పీ డిమాండ్
Telangana News: ఎస్సీ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు యాదాద్రి ఆలయంలో అవమానం జరిగిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆయన్ను కింద కూర్చోబెట్టారని సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
Brs And Bsp Demand For CM Apology on Deputy Cm Bhatti Sitting Down: యాదాద్రి లక్ష్మీ నరసింహుని సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టికి విక్రమార్కకు (Bhatti Vikramarka) అవమానం జరిగిందని బీఆర్ఎస్, బీఎస్పీ నేతలు విమర్శిస్తున్నారు. రెడ్డి నాయకుల దగ్గర ఓ ఎస్సీ బిడ్డను కింద కూర్చోబెట్టారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతులు సహా పలువురు మంత్రులు సోమవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా సీఎం దంపతులు తొలి పూజలో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. స్వామి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం సీఎం దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సమయంలో ఇతర మంత్రులు స్టూల్స్ పై కూర్చోగా భట్టి విక్రమార్క కింద కూర్చోవడంపై ప్రతిపక్ష నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసిన బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం జరిగిందని అన్నారు. దళితులకు అవమానాలు లేని పోరాటం కోసమే బీఎస్పీ పోరాటం చేస్తుందన్నారు.
దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం….!
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 11, 2024
ఈ అవమానాలు లేని భారతం కోసమే బీయస్పీ పోరాటం.
@Bhatti_Mallu pic.twitter.com/zpSZZuBmEE
బాల్క సుమన్ విమర్శలు
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'రెడ్డి నాయకుల దగ్గర ఓ ఎస్సీ బిడ్డను క్రింద కూర్చోబెట్టారు. రేవంత్ రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను క్రింద కూర్చోబెట్టారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి.... ఎక్కడ చెప్పుకోవాలి... ఎవరికి చెప్పుకోవాలి.? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన భట్టినే అవమానించారు. యావత్ దళిత జాతిని ఈరోజు అవమానించారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బట్టి విక్రమార్క ఫోటో పక్కన పెడుతున్నారు. ప్రభుత్వ యాడ్స్ లో భట్టి ఫోటోను పక్కన పెట్టారు. ఎస్సీలకు డిప్యూటీ సీఎం, మంత్రి పదవి ఇచ్చి పెద్దపీట వేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. దళితులు, బీసీ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులను వాళ్ల కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుంటున్న నయా దేశ్ ముఖ్ సీఎం రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలి. విసూనురి రామచంద్రారెడ్డి, ఎర్రపహడ్ ప్రతాప్ రెడ్డి లాంటి వాడు రేవంత్ రెడ్డి. భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ స్పందించాలి. ఎస్సీ అయిన మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. భట్టికి జరిగిన అవమానంపై స్పందించాలి. దీనిపై సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి. ఇలాంటివి భవిష్యత్ లో జరగకుండా చూడాలి.' అని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
అటు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఈ ఘటనపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా మంత్రిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అవమానించారని విచారం వ్యక్తం చేశారు. సీఎం దీనిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.