(Source: ECI/ABP News/ABP Majha)
Bandi Sanjay Kumar: తీవ్రవాదంతో కశ్మీర్ - ఎంఐఎం వల్ల పాతబస్తీ ఎంతగా నష్టపోయాయో: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
BJP Telangana Chief Bandi Sanjay: ఒవైసీలకి భయపడి పాతబస్తీకి మంజూరైన మెట్రో రైలు మార్గాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆపారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
Telangana BJP Ugadi 2022 Celebrations: ఉగాది అంటే నక్షత్రాల నడక, కాలగమనంలో సృష్టి ప్రారంభించిన రోజును ఉగాదిగా మనం చెప్పుకుంటామని... తెలుగు వారందరికీ గొప్ప పండుగ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. శిశిర ఋతువు అంటే ఆకురాలు రాలే కాలం. ఆ తరువాత వచ్చేది ఈ వసంత రుతువు. అంటే చెట్లు చిగురించే కాలం. ఒక్కమాటలో చెప్పాలంటే... కాలం కలిసి రానప్పుడు శిశిరం వలె ఆకులు రాల్చుకొని మోడు వారినా.. మళ్లీ శక్తిని పుంజుకుని చైతన్యవంతమై చిగురించడం నేర్చుకోవాలని మనకు ప్రకృతి ఇచ్చే గొప్ప సందేశమే ఈ ఉగాది పండుగ పరమార్థం అన్నారు.
అక్కడ కాశ్మీర్.. ఇక్కడ పాతబస్తీ..
తీవ్రవాదంవల్ల కశ్మీర్ మాదిరిగానే, ఎంఐఎం వల్ల పాతబస్తీ ఎంతగా నష్టపోయిందో మీ అందరికీ తెలుసు. ఒవైసీలకి భయపడి పాతబస్తీకి మంజూరైన మెట్రో రైలు మార్గాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఆపారని పేర్కొన్నారు. రోహింగ్యాలు, తీవ్రవాదుల అడ్డాగా మారి పాతబస్తీ ప్రజల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నియంత కేసీఆర్ పాలనలో పాతబస్తీతోపాటు తెలంగాణ ప్రజలు అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు, కరెంట్ ఛార్జీల పెంపుసహా అనేక రకాల పన్నులతో మోయలేని భారం మోస్తున్నారు. కుటుంబ- నియంత-అవినీతి పాలన కష్టాలు ప్రజలకు ఈ నూతన సంవత్సరంలో కష్టాలు తొలిగిపోవాలని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని కోరుకున్నారు.
‘ప్రకృతికీ, మనిషి జీవితానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని పండగల రూపంలో చూపెట్టిన మహోన్నత ధర్మం. నా భారతీయ హిందూ సనాతన ధర్మం. నా హిందూ ధర్మం ఎప్పుడూ ప్రకృతిని గౌరవిస్తూ, ప్రకృతితోనే మమేకమవుతూ మనిషి ఉన్నత జీవితానికి మార్గం చూపింది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మనకు అసలు సిసలైన పండుగ ఈరోజే. అసలు ఉగాది పచ్చడి అంటేనే తీపి, చేదుసహా షడ్రుచుల సమ్మేళనం. మనిషి జీవితంలోని ఈ చీకటి వెలుగుల సంగమమే ఉగాది సంకేతం. ప్రపంచంలో ఏ దేశానికి లేని అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం హిందూ సనానత ధర్మానికే సొంతం. ప్రకృతితో ముడివేసుకున్న బంధాన్ని పండగల రూపంలో అందించిన ఘనత నా భారతీయ హిందూ సనాతన ధర్మానిదే. ప్రపంచ దేశాలు ప్రకృతి శక్తిని గుర్తించని రోజుల్లోనే నా భారతీయ సనాతన ధర్మం ప్రకృతిని ఆరాధించడం ప్రారంభించిందని’ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకల సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఈ ఉగాది రోజునే సృష్టి ప్రారంభమైంది. బ్రహ్మ సృష్టికర్త అని మనందరికీ తెలుసు. వేదాలను దొంగలించిన సోమకున్ని వధించి ఆ విష్ణుభగవానుడు ప్రపంచానికి వేదాలనే జ్ఞానాన్ని ఇచ్చిన రోజే ఈ ఉగాది. హిందూ సంఘటన సారథి, దేశమే దేవాలయం అని నమ్మిన సాంస్కృతిక వారధి, అణువణువూ జాతిహితం కాంక్షించిన మహోన్నతుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ పుట్టింది ఈరోజే కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఉగాది పర్వదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.
జీవితానికి సంకేతం ఉగాది పచ్చడి..
ఉగాది పచ్చడిలో తీపి, చేదు, పులుపు, ఒగరు, కారం, ఉప్పు రుచులు ఉన్నట్టుగానే, జీవితంలోనూ సుఖ దుఃఖాలు, కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు వస్తుంటాయి. ఈ ఏడాది కరోనా, యుద్దం, తీవ్రవాదం అనే మూడు అంశాలు మనతోపాటు ప్రపంచ ప్రజలందరినీ తీవ్రంగా ప్రభావితం చేశాయి. కరోనాతో గత రెండేళ్లుగా చిగురుటాకులా వణికిపోయిన ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలు అమోఘం. ఆత్మనిర్భర భారత్ తో దేశాన్ని ఆదుకున్నారు. ప్రపంచానికే కరోనా వ్యాక్సిన్ అందించారు. భారత్ విశ్వగురుగా చేసేందుకు నిరంతరం యత్నిస్తున్నారు. మోదీజి క్రషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అండగా నిలవాలని కోరుకుంటున్నా. కరోనాకు శాశ్వత పరిష్కారం లభించాలని బండి సంజయ్ ఆశించారు.
శ్రీలంకలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఆ దేశం తీవ్రమైన ఆర్దిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలు ఆకలికి అలమటిస్తున్నారు. తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్నరు. అంతులేని ఆకలి చావులు సంభవిస్తుండటం అందరినీ కలిచివేస్తోంది. అందుకే తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే. అణిచివేయాల్సిందే. కూకటి వేళ్లతో పెకిలించాల్సిందే. ఎందుకంటే తీవ్రవాదం పేదలకు అత్యంత నష్ట్టదాయకం. కొందరు కుహానా మేధావులు తీవ్రవాదాన్ని రెండు రాజకీయ పార్టీల మధ్య పోరుగానే... రెండు ప్రభుత్వాల మధ్య యుద్దంగానో... రెండు సిద్దాంతాల మధ్య వైరుధ్యంగానో చిత్రీకరిస్తున్నరు. ఇది ముమ్మాటికీ తప్పు అన్నారు.
భారత్ శాంతి మంత్రం..
వీటన్నింటికీ తారక మంత్రం ‘శాంతి’ మాత్రమే. శాంతితోనే అభివ్రుద్ధి సాధ్యం. ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ శాంతి మార్గమే అనుసరణీయం. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం జరుగుతున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ చెరో దేశం వైపు నిలబడి అగ్నికి ఆజ్యం పోస్తుంటే... శాంతి చర్చలే సమస్యకు పరిష్కారమంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ చూపిన మార్గమే నేడు ప్రపంచ దేశాలన్నింటికీ దిక్సూచిగా మారింది. తీవ్రవాదంతో ఏ పార్టీ కూడా రాజీ పడొద్దు. ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రవాదాన్ని సమర్ధించే పార్టీలన్నీ నా ద్రుష్టిలో దేశద్రోహ పార్టీలే. తీవ్రవాదం వల్ల కశ్మీర్ ప్రజలు ఎంతగా నష్టపోయారో, తీవ్రవాదులు ఎంతటి నరమేధానికి పాల్పడ్డారో కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా కశ్మీర్ ఫైల్స్. లౌకిక వాదం ముసుగులో ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లంతా దేశ ద్రోహులకు మద్దతిస్తున్నట్లే. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.