Special Trains: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, అయోధ్య రాముని దర్శనానికి ప్రత్యేక రైళ్లు
Ayodhya Special Trains: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా బీజేపీ చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రజలకు అయోధ్య రాముడి దర్శనం కల్పించనుంది.
BJP Special Trains To Ayodhya: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా బీజేపీ (BJP) చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రజలకు అయోధ్య రాముడి (Ayodhya Ram Mandir) దర్శనం కల్పించనుంది. గత ఎన్నికల సమయంలో రామ్‌లల్లా (Ram Lalla) ప్రాణప్రతిష్ట తర్వాత తెలంగాణ భక్తులను అయోధ్య రామ మందిరానికి రైళ్లలో తీసుకువెళ్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ మేరకు మేరకు ప్రత్యేక ఆస్తా రైళ్ల షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక రైలు
రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 200 మందికి అయోధ్య రాముడి దర్శనం కల్పించేలా బీజేపీ చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక రైలులో మొత్తం 20 బోగీలు ఉంటాయని, ఒక్కో ట్రైన్‌లో 14 వందల మందికి ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయోధ్యకు వెళ్లి వచ్చేందుకు 5 రోజుల సమయం పడుతుంది. మొదటగా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ప్రయాణికులు వెళ్లే రైలు జనవరి 29 వ తేదీన బయలుదేరనుంది. జనవరి 30న వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ప్రయాణికుల రైలు అయోధ్యకు బయల్దేరనుంది.
ఏ రైలు ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే?
అలాగే జనవరి 31న హైదరాబాద్ ప్రయాణికుల రైలు, ఫిబ్రవరి 1న కరీంనగర్, ఫిబ్రవరి 2న మల్కాజ్‌గిరి, ఫిబ్రవరి 3న ఖమ్మం, ఫిబ్రవరి 5న చేవెళ్ల, ఫిబ్రవరి 6న పెద్దపల్లి, ఫిబ్రవరి 7 నిజామాబాద్, ఫిబ్రవరి 8న అదిలాబాద్, ఫిబ్రవరి 9న మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 10 మహబూబ్‌బాద్, ఫిబ్రవరి 11న మెదక్, ఫిబ్రవరి 12న భువనగిరి, ఫిబ్రవరి 13న నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 14న నల్లగొండ, ఫిబ్రవరి 15న జహీరాబాద్ ప్రయాణికుల రైళ్లు బయలుదేరుతాయి.
సికింద్రాబాద్, కాజీపేట నుంచి ప్రారంభం
సికింద్రాబాద్, నిజమాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, మెదక్ పార్లమెంట్ నియోజక వర్గాల ప్రయాణీకుల రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరతాయి. అలాగే నల్లగొండ, వరంగల్, మహబూబ్ బాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ప్రయాణికుల రైళ్లు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతాయని బీజేపీ నేతలు తెలిపారు.
భక్తులతో కిక్కిరిసిన అయోధ్య
అంగరంగవైభవంగా ప్రాణప్రతిష్ఠాపనా మహోత్సవం పూర్తైన తర్వాత ఈ రోజు నుంచి అయోధ్య బాలరాముడు సామాన్య భక్తులకు దర్శనమిస్తున్నారు. సోమవారం వీఐపీల రాకతో సామాన్యులను అయోధ్యలోకి అనుమతించని భద్రతా బలగాలు నిన్న రాత్రి నుంచి సామాన్య భక్తులకూ అవకాశమిచ్చాయి.
ప్రాణప్రతిష్ఠ పూర్తైన తర్వాత జరిగే ప్రభాత కాల దర్శనం కావటంతో భక్తులు వేల సంఖ్యలో అయోధ్య రాముడి ఆలయానికి చేరుకున్నారు. అర్థరాత్రి నుంచి ప్రధాన ద్వారం వద్ద వేలాదిగా రామ భక్తులు దర్శనం కోసం నిలబడ్డారు. స్వామివారి దర్శనానికి టికెట్లు లేకపోవటం..ఐదువందల ఏళ్ల తర్వాత రాముడికి గుడి కట్టి భక్తులకు దర్శన అవకాశం కల్పించటంతో తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఊహించని స్థాయిలో అయోధ్యకు భక్తులు చేరుకున్నారు.
వసతి సౌకర్యాలు గదులు ఏ మాత్రం సరిపోకపోడం లేదు. ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గాలంటే 40గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రామయ్య దర్శించుకునేందుకు భక్తులు సహకరించాలని, కాస్త సంమయమనం ప్రదర్శించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.