Bandi Sanjay : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రేసులో ఉండదు - బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు !
Telangana News : బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల రేసులో ఉండదని బండి సంజయ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్వేతపత్రాల పేరుతో డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు.
Lok Sabha election race: బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని.. అసెంబ్లీకే తెలంగాణ ప్రజలు వద్దనుకుంటే ఇక పార్లమెంట్ కు ఎందుకు ఓటేస్తారని తెలంగాణ బీజేపీ ముఖ్య నేత బండి సంజయ్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీదారు కానేకాదన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలోనే వద్దంటే ఇక లోక్‌సభకు ఓటేస్తారా ?
బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఎంపీ ఎన్నికలంటేనే మోదీ ఎన్నికలనే భావన ప్రజల్లో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం ఖాయం. బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించినా కేసీఆర్ కొడుకుకు అహంకారం తగ్గలేదు. ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భ్రమలో ఉంటూ మాట్లాడుతున్నాడు. శ్వేత పత్రం, స్వేద పత్రం అంటు అక్షరాలు మార్చి ఒకరికొకరు పత్రాలు రిలీజ్ చేసుకుంటున్నారని మండిపడ్డారు.
50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టిస్తే అప్పులు ఎందుకు ?
బీఆర్ఎస్ ప్రభుత్వ 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టిస్తే తెలంగాణలో 6.75 లక్షల కోట్ల అప్పులు ఎట్లా చేశారు?. భూములెందుకు అమ్ముకున్నడు?, జీతాలెందుకు ఇవ్వలేపోయిండు?. బహుశా కేసీఆర్ కుటుంబమే తెలంగాణను అడ్డుపెట్టుకుని 50 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నట్లున్నరని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేసిందెవరు?, వైకుంఠధామాలు సహా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే. జాతీయ రహదారుల నిధులన్నీ కేంద్రానివే. చివరకు పంచాయతీలకు ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి.. సర్పంచులకు బిల్లు ఇవ్వకుండా దివాళా తీయించారని కేటీఆర్‌పై మండిపడ్డారు.
ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ చప్పాలి ?
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 6 లక్షల 75 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగి ఉంది. జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఉంది. అయినా 6 గ్యారంటీలంటూ కాంగ్రెస్ హామీలిచ్చింది. అసలు అప్పులను ఎట్లా తీరుస్తారని ప్రశ్నించారు. 6 గ్యారంటీల అమలుకు నిధులెక్కడి నుండి తీసుకొస్తారు?, మీ ప్రణాళిక ఏమిటి?, సంపదను ఏ విధంగా సృష్టిస్తారు?, అప్పుల ఊబిలో చిక్కుకున్న తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో ప్రజలకు వివరించాలి?. ఈ విషయంలో ప్రజల్లో అనేక సందేహాలున్నాయి?. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.