Telangana News: తెలంగాణలో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, భారీ వర్షాల్లో రెస్క్యూ ఆపరేషన్స్
Bandi Sanjay: అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయని, వివిధ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రజలు వరదలో చిక్కుకుపోయారని బండి సంజయ్ అమిత్ షాకు వివరించారు. ఆయన ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి.
NDRF in Telangana: భారీ వర్షాల వేళ తెలంగాణలో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఖమ్మం జిల్లా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి బండి సంజయ్ తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురవడంతోపాటు పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరాతండ గుట్టపైన 68 మంది, బిల్డింగులపైన 42 మంది చిక్కుకున్న విషయాన్ని బండి సంజయ్ అమిత్ షాకు వివరించారు.
తెలంగాణలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ ను అమిత్ షా ఆదేశించారు. చెన్నై, వైజాగ్, అసోం నుండి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అమిత్ షా తెలంగాణకు పంపారు. ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు బండి సంజయ్ సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జలదిగ్భందం
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని వెంకటాపురం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు వరద ఉధృతిలో చిక్కుకొగా.. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్, అధికారులు, పోలీసులు లారీ సహాయంతో ప్రయాణికులు సురక్షితంగా వాగు దాటారు.
ఈ గ్రామాలకు రాకపోకలు బంద్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీవర్షాల కారణంగా వెంకిర్యాల,గంగన్నగూడ, విశ్వనాథ్ పూర్ గ్రామాల వాగులు పొంగి పొర్లడం తో రోడ్లు కొట్టుకునిపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.