Shamshabad Airport: అయ్యప్ప భక్తుల టెన్షన్! కేంద్రమంత్రికి బండి సంజయ్ ఫోన్, మారిపోయిన సీన్
Ayyappa Devotees at Shamshabad Airport: శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురైంది.
హైదరాబాద్: శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియా అకస్మాత్తుగా సర్వీస్ రద్దు చేయడంతో శబరిమలకు వెళ్లాల్సిన 60 మందికి పైగా అయ్యప్ప భక్తులు శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. మధ్యాహ్నం వెళ్లాల్సిన విమానం రద్దు అయితే ఇప్పటివరకూ ప్రత్యామ్నాయం ఎందుకు చూపించలేదని ఎయిర్ ఇండియా యాజమాన్యాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. మరో విమానం ఎప్పుడొస్తుంది, ప్రత్నామ్నాయంగా ఏం ఏర్పాట్లు చేస్తున్నారో కూడా ఎయిర్ ఇండియా చెప్పక పోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళన చెందుతున్నారు.
అసలేం జరిగిందంటే..
కుత్బుల్లాపూర్ కు చెందిన 63 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకుగానూ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో టికెట్లు బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల తరువాత ఎయిర్ ఇండియా విమానం బయలుదేరాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో ఎయిరిండియా ఆ సర్వీసును రద్దు చేసింది. అయితే అందులో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మరో విమానంలో ఏర్పాట్లు చేయలేదు, ప్రత్యామ్నాయం ఏంటనేది సిబ్బంది చెప్పడం లేదు.
అయ్యప్ప భక్తుడు ఒకరు మాట్లాడుతూ.. ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరాం. ఎయిర్ ఇండియా ఐ51543 నెంబర్ సర్వీసులో టికెట్లు బుక్ చేసుకున్నారు. 2.45కు విమానం బయలుదేరాల్సి ఉంది. చెకింగ్ చేసి, విమానంలోకి వెళ్లిన తరువాత టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్పి అందర్నీ కిందకి దించివేశారు. రెండు గంటలపాటు స్వాములను అటుఇటూ తిప్పి ఇబ్బంది పెట్టారని చెప్పారు. సోమవారం దర్శనం చేసుకుని మంగళవారం శబరిమల నుంచి తిరుగు ప్రయాణానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నామని చెప్పారు. రెండు గంటలు గంటలు అని చెబుతున్నారు. రాత్రి తొమ్మిదిన్నర దాటినా తమకు పరిష్కారం చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ ఫ్లైట్ వస్తుంది అందులో బెంగళూరు వరకు మమ్మల్ని పంపిస్తామని చెప్పారు. అక్కడి నుంచి కొచ్చిన్ వరకు ఎప్పుడు డ్రాప్ చేస్తారో తమకు స్పష్టమైన సమాచారం లేదని ఓ భక్తుడు ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ద్వారానైనా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ చొరవ.. అయ్యప్ప స్వాములు రిలాక్స్!
తమ పరిస్థితి ఏంటో అర్థంకాని స్థితిలో వారికి ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు విచ్చిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కనిపించారు. బీజేపీ నేతను కలిసి అయ్యప్ప స్వాములు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మధ్యాహ్నం నుంచి 7 గంటలపాటు తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని బండి సంజయ్ కు వివరించారు. పరిస్థితి అర్థం చేసుకున్న బండి సంజయ్ వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు బండి సంజయ్. సోమవారం ఉదయానికల్లా కొచ్చిన్ చేరుకునేలా స్వాములకు ఏర్పాట్లు చేయాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రి సింధియా సానుకూలంగా స్పందించారు. వెంటనే ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమస్య చెప్పిన వెంటనే చొరవ తీసుకుని పరిష్కరించిన బండి సంజయ్ కి అయ్యప్ప భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.