Telangana MIM Politics : ఇక మా ఆట మాదే - మజ్లిస్ బలంగా ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న అసదుద్దీన్ !
తెలంగాణలో ఎంఐఎం బలంగా ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని అసదుద్దీన్ ప్రకటించారు. ఎవర్ని అవట్ చేయాలన్నది తాము ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామన్నారు.
Telangana MIM Politics : తెలంగాణలో ఎవరు గెలిచినా మజ్లిస్ పార్టీకి మాత్రం ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాయమని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఈ సారి మాత్రం ఏడు కాదు ఆ సంఖ్యను ఇంకా పెంచుకోవాలని మజ్లిస్ అధినేత నిర్ణయించుకున్నారు. ఇంత కాలం బీఆర్ఎస్ పార్టీతో రహస్య అవగాహన ప్రకారం.. పాతబస్తీలోని ఏడెనిమిది స్థానాల్లో మాత్రమే పోటీ చేసవారు. ఇక ముందు బలం ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని అంటున్నారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బోదన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కు.. ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు మజ్లిస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో పరామర్శకు మజ్లిస్ నిజామాబాద్ వచ్చారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్‌తో సహకారం విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌తో పొత్తు మాటే ఉండదన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు విషయం తర్వాత ఆలోచిస్తామని.. ముందు మా క్రికెట్ బ్యాటింగ్ మేము ఆడతాము.. మా స్కోర్ మేము చూసుకుంటాం.. ఆపై ఎవరిని అవుట్ చేయాలి అనేది ఆలోచిస్తామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అధికారం ఎప్పుడూ ఎవ్వరికి శ్వాశతం కాదని.. పవర్ మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరి స్తున్నారని…. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో వాలని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. బోధన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పై హత్యా యత్నం చేశారని మా ఎంఐఎంనేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు.
బోధన్ నియోజకవర్గంలో జరుగుతున్న అంతా ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఎంఐఎం ఎక్కడ పోటీ చేస్తుందో పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. ఇండియాలో ఏ ఎన్నికలు అయినా కష్టపడాలన్నారు. తెలంగాణలో ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు పోటీ చేస్తాం అనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఎంఐఎం పార్టీ బలపడటం కోసం ముందుగా పని చేస్తామన్నారు.ఆ పై ఏ పార్టీకి మద్దతు ఏ పార్టీతో ముందుకు వెళ్లాలనేది ఆలోచిస్తామని పేర్కొన్నారు.
పాట్నా ప్రతిపక్షాల మీటింగ్‌కు తనకు ఆహ్వానం లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. 2024 లో మోడీని ఓడించేందుకు మేము వ్యక్తిగ తంగా శాయశక్తులా ప్రయత్నం చేస్తామని తెలిపారు. తెలంగాణలో మేము కూడా ప్రత్యామ్నాయమే అని చెప్పారు.తెలంగాణలో గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ , కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ తాము తెలంగాణలో యాభై స్థానాల్లో పోటీ చేస్తామనిప్రకటించారు. ఇప్పుడు అసదుద్దీన్ కూడా అదే తరహాలో ప్రకటనలుచేస్తూండటం ఆసక్తికరంగా మారింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial