Breaking News Live Telugu Updates: తెలంగాణలో జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రం దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం సోమవారం (జనవరి 30) ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. బుధవారం (ఫిబ్రవరి 1) ఉదయం శ్రీలంకలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 30 మధ్యాహ్నానికి శ్రీలంక ట్రింకోమలైకు 610 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్ కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం రేపు సాయంత్రం వరకు పశ్చిమ దిశగా పయనించి.. ఆ తర్వాత దక్షిణ నైరుతి వైపు దిశ మార్చుకుని ఫిబ్రవరి ఒకటో తేదీన శ్రీలంకలో తీరం దాటనుందని అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం తదితర ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగరవేశారు. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఈ రోజు అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
‘‘తిరుపతి జిల్లాతో పాటుగా తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఈస్టర్లీస్ గాలుల మొదటి వర్షాలు ప్రారంభం అయ్యాయి. ఇది చిన్న చిన్న వర్షాలుగా కొద్దిసేపు ఉంటుందే కానీ భారీగా ఉండవు. తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లోకి మరో 3-4 గంటలలో విస్తరించి, ఆ తర్వాత మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లోకి విస్తరించనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
‘‘సరిగ్గా ఇప్పుడు బంగాళాఖాతంలో మాడన్ జూలియన్ ఆసిలేషన్ (దీని వలన వర్షాలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి) ప్రభావం ఉంది. ఆ మాడన్ జూలియన్ ఆసిలేషన్ వలన దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ గాలులు కూడ బలంగా ఉంది. అంటే కింద ఎక్కడో ఉన్న అల్పపీడనం శ్రీలంక వైపుగా రానుంది. దీని వలన మనకు ప్రభావం అంతగా ఉండదు కానీ తేలికపాటి వర్షాలు, ముసురు వర్షాలు ఈ వచ్చే సోమవారం నాడు (జనవరి 30) మనం చూడగలం. దక్షిణాది జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలో తేలికపాటి వర్షాలుంటాయి. ఒకటి, రెండు చోట్ల మాత్రమే కొంచం సేపు గట్టిగా వర్షాలుంటాయి.
ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్లల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు ఉండవు. దీంతో ఎండాకాలానికి వాతావరణం సిద్దమవ్వనుంది. వెదర్ మాడల్స్ అంచనాల ప్రకారం ఈ సారి ఎండలు కాస్త ఎక్కువగా ఉండనున్నాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. నేటి నుంచి రాష్ట్రమంతా చలి సాధారణంగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఎక్కడా ఎల్లో అలర్ట్ లు జారీ చేయలేదు. కానీ రేపటి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లుండి వాటితో పాటు మధ్య తెలంగాణ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల పొగమంచు అధికంగా ఉంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 30.6 డిగ్రీలు, 15.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.
తెలంగాణలో జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలు ఖరారు..
గ్రూప్1 మెయిన్స్ పరీక్షా తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12వరకు గ్రూప్-1 మెయిన్స్ ఉంటాయని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
నా ఫోన్ ట్యాప్ చేశారు, ప్రాణ హాని ఉందని ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు
అధికార వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పార్టలోనూ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ సైతం తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తనకు ప్రాణ హాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. సీబీఐ విచారణకు హాజరు కాలేదన్నారు.
YV Subba Reddy: విశాఖలో ఖాళీగా ఉన్న ఆ బిల్డింగులు కార్యాలయాలుగా - వైవీ సుబ్బారెడ్డి
‘‘ఏప్రిల్ లోపలే పాలనా రాజధాని వైజాగ్ నుండి పని చేస్తుంది. అప్పటిలోగా న్యాయపరమైన అన్ని అడ్డంకులనూ అధిగమిస్తాం. భీమిలి రోడ్డులో చాలా ఐటీ బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి. అలాగే VMRD గెస్ట్ హౌస్ లూ అందుబాటులో ఉన్నాయి. వాటిలో సీఎం కార్యాలయం నివాసం ఏర్పాటు చేసే అవకాశం ఉంది’’ అని వైఎస్ఆర్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
Tirupati News: శ్రీవారి మాఢవీధుల్లో సీఎంవో వాహనం చక్కర్లు
తిరుమలలో మరోమారు భద్రత వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో వాహనాలు తిరగటం నిషేధించింది టీటీడీ. కానీ పీఎం, సీఎం స్థాయి ప్రోటోకాల్ వాహనాలు సైతం ఆలయ మాడవీధుల్లోకి ప్రవేశం లేదు. వైభవోత్సవ మండపం ముందుభాగంలో ఉన్న ప్రాంతంలోనే వాహనాలను నిలుపుదల చేయాలి. కానీ ఓ కారు డ్రైవర్ అత్యుత్సాహంతో కారును ఆలయ మాడవీధుల్లో పార్కింగ్ చేసాడు. అదే సమయంలో అక్కడ విజిలెన్స్ సిబ్బంది లేకపోవడంతో ఘటన చోటు చేసుకుంది. కారుపై సీఎంఓ అనే అక్షరాలు ఉన్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.
Minister KTR in Karimnagar: కేటీఆర్ కాన్వాయ్ కి అడ్డుగా వెళ్లిన విద్యార్థులు, కరీంనగర్ లో ఉద్రిక్తత
కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా గత నాలుగు రోజుల నుంచి ఎలాంటి ఘటనలు జరగకుండా పక్కా ప్రణాళికతో పోలీస్ యంత్రాంగమంతా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ ఇటు హుజురాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను, విద్యార్థి సంఘ నేతలను అరెస్టు చేశారు. అయినా మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకొని ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ కొంతమంది విద్యార్థులు పోలీసు వలయాన్ని ఛేదించుకొని వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.