News
News
X

Breaking News Live Telugu Updates: సిక్కింలో ఘోర రోడ్డుప్రమాదం, 16 మంది సైనికులు మృతి 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
సిక్కింలో ఘోర రోడ్డుప్రమాదం, 16 మంది సైనికులు మృతి 

సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మీ ట్రక్కు చాటెన్‌ నుంచి తంగు తిరిగి వెళ్తుండగా జెమా ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది సైనికులు మృతిచెందారు.  మృతుల్లో ముగ్గురు జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్లు, 13 మంది సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. మరో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.  

Madanpalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము, పరుగులు పెట్టిన రోగులు, వైద్యులు

మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం రేపింది. ఆసుపత్రలో మహిళలకు చికిత్స అందించే ఆరో నెంబర్ విభాగంలోకి నాగుపాము చొరబడడంతో రోగులు, వైద్యులు భయంతో పరుగులు తీశారు. దాదాపు రెండు గంటల పాటు రోగులు, సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్ధితి నెలకొంది. అయితే స్ధానికులు హల్పింగ్ మైండ్స్ స్నేక్స్ రిస్క్ టీం కి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్ధలంకు చేరుకున్న హెల్పింగ్ మైండ్స్ సభ్యుడు అబూబకరత సిద్దిక్ వార్డులో దూరిన నాగుపామును కనిపెట్టి నాగుపామును చాకచక్యంగా పట్టుకుని పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

బొమ్మిడాయిలు తీసుకొచ్చి ఇస్తే వార్తలు రాసేవారు నా గురించి మాట్లాడతారా? - పత్రికా విలేకరులపై మాజీ మంత్రి అనిల్ వ్యాఖ్యలు

ఆదివారం, ఆదివారం బొమ్మిడాయిల పులుసు తీసుకొచ్చి ఇస్తే చాలు, తనపై వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, అలాంటి వారికి, వారి వెనక ఉన్న వారికి తాను భయపడేది లేదని అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు సిటీలో అభివృద్ధి కుంటుపడిందని రాస్తున్నారని, అలాంటి వారు తన వెంట్రుక కూడా పీకలేరన్నారు. తన వెనక సీఎం జగన్ ఉన్నారని చెప్పారు. పదేళ్లుగా కుమ్ముతున్నారు, పొడుస్తున్నారు అయినా భయపడేది లేదన్నారు అనిల్. తాను తలవంచేది లేదని చెప్పారు. ఒకరోజు బతికినా మగోడిలాగా బతకండని సలహా ఇచ్చారు. ప్యాకేజీలు తీసుకుని వార్తలు రాసేవారికి తాను భయపడబోనన్నారు. ఏం పీక్కుంటారో పీక్కోండని అన్నారు అనిల్. ఇటీవల అయ్యప్ప మాలలో ఉన్న అనిల్ ప్రతిపక్షాలని కానీ, మీడియాని కానీ ఎక్కడా పల్లెత్తు మాట అనలేదు. తాజాగా మాల తీసేసిన తర్వాత ఇప్పుడు ఫుల్ డోస్ ఇచ్చేశారు.

 

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా,మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని సీఎం కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Kaikala Satyanarayana: 11 గంటల తర్వాత అభిమానుల సందర్శనకు అవకాశం

కైకాల సత్యనారాయణ పార్థీవ దేహాన్ని నేడు (డిసెంబరు 23) 11 గంటల తర్వాత సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఇంటి దగ్గర ఉంచుతారు. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ కన్నుమూత

ప్రఖ్యాత నటుడు, నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 87 సంవత్సరాలు. వయోభారం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన నేడు (డిసెంబరు 23) ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. తొలుత ఆరోగ్యం విషమించడంతో డాక్టర్లు ఆయన ఇంటి వైద్యం అందించారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో చనిపోయారు.

Background

నైరుతి బంగాళాఖాతం (తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకు­ని ఉన్న ప్రాంతం) లో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ఆంధ్రలో వర్షాలు కురవనున్నాయి. ఈ వాయు­గుండం పశ్చి­మ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమ­రిన్‌ ప్రాంతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావర­ణ విభాగం అధికారులు చెప్పారు. దీని ప్రభావం ఏపీపై మాత్రం దక్షిణ కోస్తాపైనే ఉంటుందని వివరించారు. 

ఏపీ మీదుగా వీస్తున్న ఈశాన్య, ఆగ్నే­య గాలులు వల్ల రాష్ట్రంలో పొగమంచు పెరుగుతుందని చెప్పారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా మరింత పడిపోతాయని చెప్పారు. వచ్చే రెండు రోజులు రాష్ట్రం­లో మిగతా చోట్ల పొడి వాతావరణ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉం­ద­ని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

‘‘బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరో రెండు మూడు రోజుల వరకు ఉత్తర - ఈశాన్య దిశగా, అలాగే ఉత్తర - వాయువ్య దిశగా కదలనుంది. దీని వలన ప్రభావంతో మరో మూడు రోజులు వరకు విపరీతమైన చలి కాలాన్ని చూసే అవకాశాన్ని ఈ వాయుగుండం ఇవ్వనుంది. అటు విశాఖ నగరం తీసుకున్నా, అటు విజయవాడ​, గోదావరి జిల్లాలు తీసుకున్నా, అటు రాయలసీమ తీసుకున్నా, చాలా చోట్లల్లో చలి తీవ్రత 14-17 డిగ్రీల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద­యం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది.

అరకు వ్యాలీలో సున్నాకు దగ్గరగా ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయి. అలాగే మారేడుమిల్లి ప్రాంతం, విజయనగరం జిల్లాలోని కొండ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మాత్రం కాస్త వెచ్చగా ఉండనుంది. ఎందుకంటే మనకు సముద్రం నుంచి తేమ గాలులు వస్తుంటాయి కాబట్టి. డిసెంబరు 25న ముందు చెప్పిన విధంగానే దక్షిణ కోస్తా భాగాలైన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు ప్రారంభించనుంది. దీని వలన మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉంటూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఈశాన్య దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.

చలి తీవ్రత ఇలా..
తూర్పు ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున.. వచ్చే రెండు రోజులు మధ్యాహ్నం పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ విభాగం వెల్లడించింది. తాజాగా సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మెదక్ జిల్లా టేక్మాల్ లో 13.4 డిగ్రీలు, కొమురం భీం జిల్లాలో 10.4, ఆదిలాబాద్ జిల్లాలో 10.8గా నమోదైంది. నిర్మల్ జిల్లాలో 11.7, మంచిర్యాల జిల్లాలో 12.7 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.