Breaking News Live Telugu Updates: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన జాతీయ గీతాలాపన
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడింది. అంతకుముందు ఈ వాయుగుండం ఉత్తర ఛత్తీస్ గఢ్ దాని పరిసరాల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మధ్యప్రదేశ్ లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా..
తీవ్ర వాయుగుండం నిన్న బలహీనపడింది. దీని ప్రభావంతో మంగళవారం సైతం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచనున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నేడు సైతం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
వాయుగుండం బలహీనపడటంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు నుంచి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో నేడు, రేపు తేలికపాటి జల్లులు పడతాయని చెప్పారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు నిలకడగా ఉంది. వెండి ధరలో కూడా నేడు ఎలాంటి మార్పూ లేదు. కానీ, ప్లాటినం ధరలో మార్పు కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,150 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,530 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.64,800 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,800 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,150 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,530 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,800 గా ఉంది.
జమ్మూకాశ్మీర్ లో విషాదం - ఆర్మీ బస్సుబోల్తా పడి ఆరుగురు జవాన్లు మృతి
జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహల్ఘం వద్ద ఆర్మీ బస్సు బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 32 మంది జవాన్లకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Telangana High Court New Judges: తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తులుగా జస్టిస్ ఏనుగుల వెంకట వేణు గోపాల్, జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. నూతన న్యాయమూర్తులకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభినందనలు తెలిపారు.
Mass Singing of National Anthem: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన జాతీయ గీతాలాపన
తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు అబిడ్స్‌లోని జీపీవో కూడలిలో ఈ కార్యక్రమంలో పాల్గొనగా, హైదరాబాద్ నగరమంతా అన్ని కూడళ్లలో ఆ సమయానికి ట్రాఫిక్ ను నిలిపివేశారు. కేబుల్ బ్రిడ్జిపై కూడా పోలీసులు 10 నిమిషాల ముందే ట్రాఫిక్ ను నిలిపివేశారు. అన్ని జంక్షన్లలోనూ జాతీయ గీతం వినిపించేలా ప్రత్యేకంగా స్పీకర్లను పోలీసులు ఏర్పాటు చేశారు.
Bhupalpalli: తెగిపడ్డ విద్యుత్ తీగలు
భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం శాంతి నగర్‌లో పెను ప్రమాదం తప్పింది. కరెంట్ ఉండగానే 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమం వల్లే విద్యుత్ తీగలు తెగిపడ్డాయని గ్రామస్తులు ఆరోపించారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
Telangana News: 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన, ఎక్కడికక్కడ నిలిచిపోండి!
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన జరగనుంది. ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో సామూహిక గీతాలాపనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతాలాపన ప్రారంభమవుతుంది. సీఎం కేసీఆర్ అబిడ్స్ లోని సర్కిల్ లో పాల్గొననున్నారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నళ్లు పడనున్నాయి. సరిగ్గా 11.30 గంటలకు వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేసి కారు లేదా బైక్ నుంచి కిందికి దిగి అందరూ నిలబడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.