Breaking News Live Updates: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ఏపీ, తెలంగాణ, యానాంలతో పాటు ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. అల్ప పీడనం ప్రభావంతో ఏపీలో మే 6 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో మే 7వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో మే 4 తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తరువాత 24 గంటల్లోనే బలహీన పడుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మే 2 నుంచి మే 4 వరకు అసోం, మేఘాలయాలో ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో మే 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తాంధ్రలో వర్షాలు..
ఎండలతో అల్లాడిపోతున్న ఉత్తర కోస్తాంధ్ర ప్రజలకు వర్షాలతో కాస్త ఉపశమనం కలుగుతోంది. అయితే పలు జిల్లాల్లో కేవలం ఒకట్రెండు చోట్ల మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేటి నుంచి మరో మూడు రోజుల వరకు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు అత్యధికంగా నందిగామలో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 41.8 డిగ్రీలు అమరావతిలో 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం నేడు పొడిగా మారుతుంది. ఉత్తర కోస్తాంధ్రతో పోల్చితే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వర్షాలు చాలా తక్కువగా కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాయలసీమలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. కర్నూలులో 43.4 డిగ్రీలు, తిరుపతిలో 43.2 డిగ్రీలు, నంద్యాలలో 42.6, కడపలో 42.2 డిగ్రీలు, అనంతపురంలో 41.5 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి కేంద్రం తెలిపింది.
తెలంగాణలోనూ వర్షాలు..
దక్షిణ అండమాన్‌లో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా తెలంగాణలో మే 7 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఒకట్రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 41 వరకు నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు ఉండనుందని శాఖ తెలిపింది.
KA Paul House Arrest: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
KA Paul Attack : ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కేఏ పాల్ పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేకేశాడు. తనపై జరిగిన దాడిపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడానికి బయలుదేరుతుండగా ఆయనను హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద హౌస్ అరెస్ట్ చేశారు.
సిద్ధిపేట జక్కాపూర్ వద్ద కేఏ పాల్ పై జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డాటం వివాదాస్పదంగా మారింది. స్థానిక టీఆర్ఎస్ నేతలే కేఏ పాల్ పై దాడికి దిగారని ప్రజాశాంతి పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
Kakinadaలో మతసామరస్యం - రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ చేసిన భోగిగణపతిపీఠం
రంజాన్ పర్వదినం సందర్భంగా కాకినాడలో మతసామరస్యం వెల్లివిరిసింది. కాకినాడ ఈద్గామైదానం వద్ద భోగిగణపతిపీఠం మజ్జిగ పంపిణీ నిర్వహించింది. ప్రార్థనలు చేయడానికి వచ్చిన ముస్లిం సోదరులకు మజ్జిక పంపిణీ చేసి పీఠం సభ్యులు మతసామరస్యం చాటడం పట్ల ముస్లిం మతగురువులు హర్షంవ్యక్తం చేశారు. ఈద్గా మైదానానికి పలువురు హిందూ ముస్లింలు ఒకే వాహనాల్లో తరలివెళ్లారు.
కాకినాడ ఈద్గా మైదానం వద్ద రంజాన్ ప్రార్థనలకు వచ్చిన వెయ్యి మంది ముస్లిం పౌరులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్వయంభు శ్రీభోగి గణపతిపీఠం నిర్వహించింది. తద్వారా మత సామరస్యతకు ప్రతీకగా నిలిచారు. రంజాన్ సందర్భంగా ఈద్గా లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువు రజాక్ తో పాటు నగరానికి చెందిన పలు ప్రార్థనా గురువులు ప్రముఖులను కలిసిన సందర్భంగా పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మతసామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధ సోదరులందరూ భారతీయ ప్రగతికి ప్రతీకగా ప్రతి పండుగల్లో కలిసి మెలిసి భాయీ భాయీ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుందామని, శాంతియుతంగా ఉందామని రజాక్ పిలుపునిచ్చారు. కరోనా కష్ట కాలంలో కులం మతం అనే భేదం లేకుండా సేవలు చేసుకున్నామని గుర్తు చేశారు.
Alluri District News: అల్లూరి జిల్లాలో విషాదం - కరెంట్ షాక్‌తో భార్యాభర్తలు మృతి
Alluri District News: అల్లూరి జిల్లా అరకులోయ కరెంట్ క్వార్టర్స్ లో విషాదం జరిగింది. కరెంట్ షాక్ తో భార్యాభర్తలు మృతిచెందారు. సర్వీస్ వైర్ పై భర్త బట్టలు ఆరబెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఆయనను కాపాడే ప్రయత్నం చేయగా భార్యకు సైతం షాక్ కొట్టింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భార్యాభర్తలను గమనించి 108 కి స్థానికులు కాల్ చేశారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడం, ఎక్కువ సమయం విద్యుత్ షాక్‌లో ఉండటంతో ఘటనా స్థలంలో భార్యాభర్తల మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
Simhachalam Chandanotsavam: సింహాద్రి ఉత్సవాల్లో జేబు దొంగల బీభత్సం
విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా జరుగుతున్న జేబు దొంగలు బీభత్సం చేస్తున్నారు. ఈ చందనోత్సవంలో స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా మహిళ బ్యాగ్ కట్ చేసి బంగారు నగలను దొంగిలించారు. బంగారు నగలు పోగొట్టుకున్న మహిళ తూర్పుగోదావరికి చెందిన ఓ పోలీసు అధికారి భార్యగా గుర్తించారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు తెలపడంతో నిందితుల కోసం వారు వెతుకుతున్నారు.
Bhadradri Kothagudem: భద్రాద్రి జిల్లాలో దారుణం, మహిళపై యువకుడు గొడ్డలితో దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో దారుణం జరిగింది. నవతన్ అనే యువకుడు భూక్య శ్రీదేవి అనే మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా మహిళపై అతికిరాతకంగా గొడ్డలితో యువకుడు దాడికి పాల్పడ్డాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.