Breaking News Live: సీఎం జగన్ మాజీ సలహాదారు పీవీ రమేశ్ అరెస్టుకు ఏపీ పోలీసుల యత్నం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
గుజరాత్‌లో భారీగా మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నట్లుగా అదికారులు ప్రకటించారు. డిఫెన్స్, గుజరాత్ ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ డ్రగ్స్ మొత్తం పట్టుబడింది. అయితే, పాకిస్థాన్ పడవలో భారత ప్రాదేశిక జలాల్లోకి ఈ డ్రగ్స్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నట్లుగా వెల్లడించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెడుతోంది. సాయంత్రమైతే చాలు.. వణికిస్తోంది. మరోవైపు భాగ్యనగరంలోనూ చలి ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ మన్యంలోనూ చలి విపరీతంగా పెడుతుంది.
హైదరాబాద్ లో సాయంత్రమైతే.. ఇక దుప్పటి కప్పుకుని బయటకు వెళ్లాలా అనే రేంజ్ లో చలి ఉంది. శివారు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఒక్కోసారి ఆదిలాబాద్ తో పోల్చుకుంటే.. హైదరాబాద్‌లోనే రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్‌చెరు 8.4 డిగ్రీలు, రాజేంద్రనగర్ 9 డిగ్రీలు, హయత్ నగర్ 10 డిగ్రీలు, ఆదిలాబాద్ 10.6, మెదక్ 10.8, హనుమకొండ 13, హకీంపేట 13.5, రామగుండం 13.4, నిజామాబాద్ 14.1, నల్లొండ 15, భద్రాచలం 15.4, మహబూబ్‌నగర్ 17.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 29,643 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 121 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,479కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 228 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,59,728 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1597 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్ మరింత పెరుగుతోంది. ఇప్పటిదాకా ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో 20కి చేరాయి. వీరంతా టిమ్స్‌లో చికిత్స పొందుతుండగా.. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గుజరాత్‌లో కొత్తగా మరో 2 కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 145కు పెరిగింది. కర్ణాటకలో కొత్తగా 6 కేసులు నమోదుకాగా కేరళలో 4 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 8 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 12 కేసులు నమోదుకాగా అక్కడ మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది.
సీఎం జగన్ మాజీ సలహాదారు పీవీ రమేశ్ అరెస్టుకు ఏపీ పోలీసుల యత్నం
సీఎం జగన్ మాజీ సలహాదారు పీవీ రమేశ్ అరెస్టుకు ఏపీ పోలీసుల యత్నం మాజీ ఐఏఎస్ అధికారి, సీఎం జగన్ మాజీ సలహాదారు పీవీ రమేశ్ అరెస్టుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో పీవీ రమేశ్ ఇంటికి వెళ్లారు పోలీసులు. పీవీ రమేశ్ లేకపోవడంతో వెనుదిరిగారు. ఆయన కుటుంబ సభ్యులు పోలీసుల రాఖతో ఆందోళన చెందుతున్నారు.
ఇంటర్ బోర్డు ఎదుట NSUI ఆందోళన.. రెండు కార్లు, ఒక ఆటో ధ్వంసం
ఇంటర్ బోర్డ్ ఎదుట NSUI ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీ భవన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి కార్యకర్తలు వాహనాలను ధ్వంసం చేశారు. వీరి దాడిలో రెండు కార్లు, ఒక ఆటో ధ్వంసం అయ్యాయి.
పీఆర్సీపై మొదలైన సీఎం జగన్ సమీక్ష
పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్‌తో సమీక్ష మొదలైంది. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. పీఆర్సీపై ఈ సమావేశంలో కీలక సమావేశం తీసుకొనే అవకాశం ఉంది.
ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం సమీక్ష నేడు
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సమీక్ష నిర్వహించనుంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకూ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. 4 లక్షల 59 వేల మంది పరీక్ష రాయగా.. 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థుల భవితవ్యంపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇంటర్ విద్యార్థుల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ రవీంద్ర రావు
తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్సీ రవీంద్ర రావు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల తెలంగాణ ఎమ్మెల్సీ రవీంద్ర రావు మాట్లాడుతూ... ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో శ్రీవారికి మొక్కులు సమర్పించుకున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని., అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధించానని అన్నారు.