ACB Attacks : ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాల్లో కీలక మలుపు - ఎస్పీ సందీప్ రావు ఆస్తుల పత్రాలు లభ్యం
Telangana News : ఏసీపీ ఉమాహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ దాడుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్పీ గోనె సందీప్ రావుకు సంబంధిచిన డాక్యుమెంట్లు కూడా లభించినట్లుగా తెలుస్తోంది.
![ACB Attacks : ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాల్లో కీలక మలుపు - ఎస్పీ సందీప్ రావు ఆస్తుల పత్రాలు లభ్యం ACB raids at the house of ACP Umaheswara Rao leads special Attention ACB Attacks : ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాల్లో కీలక మలుపు - ఎస్పీ సందీప్ రావు ఆస్తుల పత్రాలు లభ్యం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/c6b6c540b9174f516d1991ecaccbefa81716294227924228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana ACB Raids : సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఆయన కూతురు ఇంట్లో ఏసీబీ నిర్వహిస్తున్న సోదాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా.. ఎస్పీ గోనె సందీప్ రావుకు చెందిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఈ డాక్యుమెంట్లను ఏసీబీ
అధికారులు సీజ్ చేశారు. సందీప్ రావు డీసీపీగా పని చేస్తున్నారు. ఆయన ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.
ప్రీ లాంచ్ పేరుతో వందల కోట్లు మోసం చేసిన సాహితి ఇన్ ఫ్రా రియల్ ఎస్టేట్ మోసం కేసును ఏసీపీ ఉమామహేశ్వరరావు విచారణ చేస్తున్నాయి. అయితే కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో ఉమామహేశ్వరరావుపై అనేక ఆరోపణలు ఉండటంతో ఏసీబీ అధికారులు రెయిడ్ చేశారు. అశోక్‌నగర్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసు కేబిన్ సహా 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ ఈ దాడులు చేశారు. ఏసీపీ సన్నిహితులు, బంధువులు ఇళ్లలోనూ దాడులు చేస్తోంది ఏసీబీ. గతంలో ఆయన ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి.
ఉమామహేశ్వరరావు ఇంట్లో ఇంకా ఏమేమి దొరికాయన్నదానిపై ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇంకా సోదాలు సాగుతున్నాయి. ఆయన దర్యాప్తు చేసిన కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం..ఉద్దేశపూర్వకంగా నిందితుల్ని వదిలి పెట్టడం వంటివి చేశారన్న ఆరోపణలు బలంగా ఉండటంతో వాటన్నింటినీ వెలికి తీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున నగదు దొరికిందని ప్రచారం జరుగుతోంది.కనీసం రూ. యాభై లక్షల రూపాయల నగదు తో పాటు పెద్ద ఎత్తున ఆస్తుల డాక్యుమెంట్లు కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
సందీప్ రావు విషయంలోనూ ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. ఆయన ఆస్తి పత్రాలు ఉమామహేశ్వరరావు దగ్గర ఎందుకు ఉన్నాయో విచారణ జరిపే అవకాశం ఉంది. సందీప్ రావుపైన కూడా డిపార్టుమెంట్ లో అనేక ఆరోపణలు ఉండటంతో ఆయనపైనా దాడులు నిర్వహించి.. సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏసీబీ యాక్టివ్ గా పని చేస్తోంది. హెచ్ఎండీఏ అధికారిగా పని చేసిన బాలకృష్ణను పట్టుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ మాఫియా గురించి అనేక వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏసీపీని అరెస్టు చేయడం.. ఆయన కూడా రియల్ ఎస్టేట్ మోసానికి చెందిన కేసును విచారణ జరుపుతూండటంతో... కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)