Sheep Distribution Scam: గొర్రెల పంపిణీ స్కాంలో ట్విస్ట్, నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ
Telangana: తెలంగాణలో సంచలనం రేపుతున్న గొర్రెల పంపిణీ స్కాంలో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా నలుగురు ప్రభుత్వ అధికారులను అదుపులోకి తీసుకుంది.
ACB Arrest: తెలంగాణలో గత కొద్దికాలంగా సంచలనం రేపుతున్న గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో గురువారం నలుగురు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. మేడ్చల్ పశుసంవర్దక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య, కామారెడ్డి వెటర్నరీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్‌లను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్లు గొర్రెల పంపిణీలో రూ.2.10 కోట్లు కొట్టేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. గొర్రెల కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ప్రైవేట్ వ్యక్తుల పేరుతో బినామీ అకౌంట్లను ఓపెన్ చేసి నిధులు మళ్లించారు. అరెస్ట్ అయిన నిందితులు పశుసంవర్దక శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో ఈ కేసులో మరికొంతమందిని ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సర్కార్ విడతల వారీగా లబ్ధిదారులకు సబ్సిడీ కింద గొర్రెలను పంపిణీ చేసింది. అయితే ఈ పథకంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలపై గచ్చిబౌలిలో కేసు నమోదైంది. గుంటూరు జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును గచ్చిబౌలి పోలీసులు ఏసీబీకి బదిలీ చేశారు. ఈ కేసుపై గత కొంతకాలంగా ఏసీబీ దర్యాప్తు చేపడుతుండగా.. తాజాగా మరింత స్పీడ్ పెంచింది. పథకం అమల్లో గోల్‌మాల్ జరిగిందని, నిధులను పక్కదారి పట్టించినట్లు ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు, కాంట్రాక్టర్లను విచారిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అరెస్ట్ చేసేందుకు ఏసీబీ సిద్దమవుతోంది.
నిందితులను అదుపులోకి తీసుకున్ని ఏసీబీ అధికారులు మరింత కూపీ లాగుతున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేపడుతున్న ఏసీబీ.. రికార్డులను పరిశీలించడంతో పాటు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తోంది. బినామీ పేర్లతో కొంతమంది నిధులు మళ్లించిన దానిపై ఆధారాలను కూడా సేకరించారు. పశుసంవర్దక శాఖ ఉన్నతాధికారులతో పాటు కాంట్రాక్టర్ల పాత్రపైనే ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ ఇటీవల కాగ్ కూడా సంచలన రిపోర్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఏసీబీ దర్యాప్తును మరింత స్పీడ్ చేసింది. దీంతో రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.
గొర్రెల పంపిణీలో రూ.17 కోట్ల మేర అక్రమాలు జరిగాయని కాగ్ నివేదికలో పొందుపర్చింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అక్రమాలు జరిగాయని తెలిపింది. ఏపీ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకురాగా.. కాంట్రాక్టర్లు ఇచ్చిన రవాణా ఖర్చుల రికార్డుల్లో అంకెల మార్పిడిని కాగ్ గుర్తించింది. అయితే కాగ్ రిపోర్డుపై పశుసంవర్దక అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు, రవాణాదారులు చేసిన తప్పి దాలను తమపై రుద్దవద్దని అంటున్నారు. రవాణాదారులు ఇచ్చిన వాహన నంబర్ల ఆధారంగా తమను బాధ్యతలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని, అక్రమాల్లో తమను బాధ్యులు చేయడం సరైనది కాదని కోరుతున్నారు.