Telangana News : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం - ఢిల్లీలో కలకలం
ఢిల్లీ తెలంగాణ భవన్‌లో శేజల్ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేసింది ఈ మహిళే.
Telangana News : తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ ఆత్మహత్యాయత్నం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆమె విషం తాగారు. దీంతో వెంటనే స్పందించిన తోటివారు శేజల్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. అయితే.. దుర్గం చిన్నయ్య తనను మానసికంగా , లైంగికంగా వేధిస్తున్నారని బోడపాటి శేజల్ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై జాతీయ మానవ హక్కుల కమీషన్, జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజు నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను మోసం చేశాడని, తన వద్దకు అమ్మాయిలను పంపించాలని, కోర్కెలు తీర్చాలని బెదిరిస్తున్నాడని శేజల్ కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి తమను అరెస్టు చేయించాడని అంటన్నారు. బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటుకు సహకరించినందుకుగానూ తన వాళ్లకు వాటా కోరడమే గాకుండా తన కోర్కెలు తీర్చాలని వేధించడంతో బ్రోకర్ల ద్వారా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్‌కే అమ్మాయిలను పంపించినట్టు శేజల్ దంపతులు గతంలో ారోపించారు. దీనికి సంబంధించి చిన్నయ్య 91606 13141 ఫోన్ నంబర్ నుంచి అమ్మాయిలను ‘ట్యాబ్లెట్’ అంటూ కోడ్ లాంగ్వేజ్‌లో లో చేసిన వాట్సాప్ చాటింగ్ గా పేర్కొంటూ కొన్ని స్క్రీన్ షాట్లు, అమ్మాయిల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హైదరాబాద్‌లో నివాసం ఉండే ఆదినారాయణ గత ఏడాది ఆగస్టులో బెల్లంపల్లిలో ఆరిజిన్ డెయిరీ ప్రారంభించారు. కన్నాల శివారులో నేషనల్ హైవే 363 పక్కన బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్మాణానికి ఎమ్మెల్యే చిన్నయ్య భూమిపూజ చేశారు. యూనిట్ కోసం రెండెకరాల అసైన్డ్ భూమినీ చిన్నయ్యే ఇప్పించాడని ప్రచారం జరిగింది. బర్రెల యూనిట్లు ఇస్తామని ఆదినారాయణ, శేజల్ తమ నుంచి రూ.3.50 లక్షల చొప్పున వసూలు చేసి మోసగించారని పలువురు పాడి రైతులు జనవరిలో నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదినారాయణ, శేజల్‌ను ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు రి తరలించారు. బెయిల్‌పై రిలీజైన వారు ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆరోపణలు చేస్తూ వాట్సాప్ చాటింగ్ లిస్ట్ బయటపెట్టారు. డబ్బులు అడిగితే ఇవ్వనందుకే తమపై అక్రమ కేసులు పెట్టించాడని ఆరోపించారు. తనను వేధింపులకు గురిచేశాడంటూ శేజల్ సోమవారం ఓ ఆడియో రికార్డ్ కూడా రిలీజ్ చేశారు.
అప్పట్నుంచి తనకు న్యాయంచేయాలని శేజర్ పలు చోట్ల ఆందోళనలు చేశారు. తాజాగా మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాత్రం సబ్సిడీపై గేదెల యూనిట్లు ఇస్తామని చెప్పి బెల్లంపల్లి ప్రాంతంలో చాలామంది రైతుల దగ్గర రూ.3.50 లక్షల చొప్పున వసూలు చేశారు. యూనిట్లు ఇవ్వకుండా రైతులను మోసగించారు. బాధిత రైతులు నన్ను సంప్రదించడంతో డెయిరీ నిర్వాహకులను పోలీసులకు పట్టిచ్చానని చెబుతున్నారు. వారితో తనకెలాంటి సంబంధాలు లేవంటున్నారు.