5G Sim Fraud: 4G టూ 5G అంటూ కొత్త మోసం! సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ - ఏమరుపాటుగా ఉంటే అంతే సంగతులు!
5G Sim Fraud In TS: 5G సర్వీసెస్ అందిస్తాం, 4G నుంచి 5Gకి మారండంటూ వస్తున్న మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒక్కసారి లింక్ క్లిక్ చేస్తే మీ ఖాతాలోని డబ్బంతా ఖాళీ అవుతుందని పోలీసులు చెబుతున్నారు.
5G Sim Fraud In TS: 5G సర్వీస్ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీన్ని అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో స్కాంలకు తెరతీస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటూ అమాయకపు ప్రజల నెత్తిన కుచ్చు టోపీలు పెడుతున్నారు. అయితే ఇలాంటి నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు ప్రస్తుతం 5G సేవల వినియోగం కోసం కస్టమర్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే 4G నుంచి 5Gకి మారండి, మీకు కావాల్సిన సేవలు మేము అందిస్తామంటూ కొంతమంది సైబర్ నేరగాళ్లు మెసేజ్ లు, లింకులు పంపిస్తున్నారు. అది తె-లియని అమాయకపు ప్రజలు... అది నిజమేననుకొని ఆ లింక్ పై క్లిక్ చేస్తున్నారు. దీంతో ఫొన్ ను హాక్ చేసిన సైబర్ నేరగాళ్లు అందులో ఉన్న డేటా అంతా తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ తెలుసుకొని, ఆ నంబర్ ను బ్లాక్ చేయించి సిమ్ స్వాద్ దందాకు పాల్పడి, అనంతరం అదే నంబర్ తో మరో నంబర్ ను తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం ఆ కొత్త నంబర్ ను బ్యాంకు అకౌంట్ కు యాడ్ చేసి అందులో ఉన్న డబ్బబును కొల్లగొడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
4G నుంచి 5G కి మారండి, ఉచితంగా 5G సేవలు అందిస్తాం అంటూ వచ్చే మెసేజ్ లపై అస్సలే స్పందించకూడదని సూచిస్తున్నారు. వివిధ రకాల ఛార్Gల పేరుతో అందనకాడికి దోచుకొని ఉడాయిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పలు రకాల సైబర్ మోసాలపై కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలే అందుబాటులోకి వచ్చిన 5G సేవలు..
భారత్ లో 5G సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 6వ ఎడిషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5G సర్వీసులను ప్రారంభించారు. రిలయన్స్ జియో, ఇతర టెలికాం కంపెనీలు 5G సేవల ప్రారంభించబోతున్నాయి. తాజాగా ఎంపిక చేసిన నగరాల్లో 5G సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించగా.. ఎయిర్ టెల్ ఇప్పటికే 5G సేవలు ప్రారంభించింది. భారత్ లో 5G సేవలు అందించే తొలి కంపెనీగా ఎయిర్ టెల్ నిలిచింది.
Airtel, Jio, BSNL, Vodafone Idea 5Gని ఎప్పుడు విడుదల చేస్తాయి?
రాబోయే ఆరు నెలల్లో భారతదేశంలోని 200 నగరాలకు 5G యాక్సెస్ లభిస్తుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అయితే, భారతి ఎయిర్ టెల్ ఇప్పటికే దాదాపు 8 నగరాల్లో 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు.. మార్చి 2024 నాటికి అందరికీ 5G సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తుంది. అటు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంటే ముందు భారతదేశంలోని ప్రతి మూలకు 5Gని తీసుకువస్తామని ప్రకటించింది.
జియో 5G డిసెంబర్ 2023 నాటికి అందరికీ చేరుతుందని RIL చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు, అంటే, వచ్చే ఏడాది చివరి నాటికి అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ టెలికాం ఆపరేటర్ 5Gని ఎప్పుడు విడుదల మొదలు పెడుతుంది అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా వెల్లడించడలేదు. గతంలో దీపావళి నాటికి 5G సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నెల ఆఖరి వరకు జియో 5G సేవలు మొదలయ్యే అవకాశం ఉంది. అటు వోడాఫోన్ ఐడియా త్వరలో 5Gని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థ కూడా కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. అటు ప్రభుత్వ నేతృత్వంలోని BSNL, టెలికాం సంస్థ.. 2 సంవత్సరాల్లో దేశంలోని 80 నుంచి 90 శాతం మందికి 5G అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నుంచి 5G సేవలను BSNL అందజేస్తుందని ఐటీ మంత్రి వెల్లడించారు.