Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?
December 1st Week Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇందులో వన్‌ప్లస్ నుంచి రెడ్‌మీ ఫోన్ల వరకు ఉన్నాయి.
New Smartphone: 2023లో చివరి నెల అయిన డిసెంబర్ ప్రారంభమైంది. ఈ నెలలో చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కొత్త ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే వారంలోనే ఏకంగా ఐదు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
టెక్నో స్పార్క్ గో 2024 (Tecno Spark Go 2024)
టెక్నో స్పార్క్ గో 2024 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 3వ తేదీన భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది ఐఫోన్ ప్రో సిరీరస్ తరహా డిజైన్‌తో రానుంది. పెద్ద డిస్‌ప్లే, శక్తివంతమైన కెమెరా సిస్టమ్‌ను అందించే చవకైన స్మార్ట్‌ఫోన్. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా పని చేయగలదు.
వన్‌ప్లస్ 12 (OnePlus 12)
వన్‌ప్లస్ తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 12 డిసెంబర్ 5వ తేదీన చైనాలో విడుదల కానుంది. భారతదేశ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ లాంచ్ జరగనుంది. వీబో, ఇతర ప్రధాన చైనీస్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది.
రెడ్‌మి 13సీ (Redmi 13C Series)
రెడ్‌మీ 13సీ, రెడ్‌మీ 13సీ 5జీ స్మార్ట్ ఫోన్‌లను డిసెంబర్ 6వ తేదీన భారతదేశంలో లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది. ఈ రెండు డివైస్‌లు డిసెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెడ్‌మి 13సీ ఇప్పటికే కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంది. అయితే రెడ్‌మీ 13సీ 5జీ గ్లోబల్ లాంచ్ కానుంది. చిప్‌సెట్ మినహా రెండు పరికరాలు ఒకే విధమైన డిజైన్, హార్డ్‌వేర్‌తో రానున్నాయి. రెడ్‌మీ 13సీలో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించనున్నారు. అయితే రెడ్‌మీ 13సీ 5జీ మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్‌పై పని చేయనుంది.
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ (Infinix Smart 8 HD)
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో డిసెంబర్ 8వ తేదీన లాంచ్ కానుంది. ఇది భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుందని భావిస్తున్నారు. పంచ్ హోల్ డిస్‌ప్లే, ఫ్లాట్ అంచులు, మెటల్ ఫ్రేమ్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. డిస్‌ప్లే సైజు 6.6 అంగుళాలు కాగా, హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఇందులో ఉంది. ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌పై పూర్తిగా ఒక రోజు ఉపయోగించవచ్చు.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 40 సిరీస్ (Infinix Hot 40 Series)
ఇన్‌ఫీనిక్స్ హాట్ 40 సిరీస్‌లో ఇన్‌ఫీనిక్స్ హాట్ 40, ఇన్‌ఫీనిక్స్ హాట్ 40 ప్రో, ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి. డిసెంబర్ 9వ తేదీన నైజీరియాలో ఇవి లాంచ్ కానున్నాయని సమాచారం. ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ ఇటీవల సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉండనున్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply