Cyber Crime : సైబర్ నేరాల కట్టడికి కొత్త టెక్నిక్.. ఎలా సేవ్ కావాలో కాలర్ ట్యూన్ చెప్తుందట
Cyber Crime : దేశంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు టెలికాం కంపెనీలు కొత్త ప్రయత్నం చేస్తున్నాయి. సైబర్ నేరాలను ఎలా నివారించాలో కాలర్ ట్యూన్ తెలియజేస్తుంది.
Cyber Crime : దేశంలో టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రోజు రోజుకూ సైబర్ నేరాల సంఖ్య రెట్టింపవుతూనే ఉంది. ఈ నేరాలను అరికట్టేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజుకో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తుండడం గమనార్హం. ఇప్పుడు కేంద్రం మరో కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. సైబర్ నేరాల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ఓ కొత్త చొరవను ప్రారంభించింది. మొన్నటి వరకు కరోనా గురించి జాగ్రత్తలు చెబుతూ అమితాబ్ బచ్చన్ ప్రజలను అప్రమత్తం చేసే వాళ్లు ఇప్పుడు మరో కొత్త గొంతు సైబర్ నేరాలపై అవగాహన కల్పించనుంది.
హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) టెలికమ్యూనికేషన్స్ విభాగానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు టెలికాం కంపెనీలు కాలర్-ట్యూన్, ప్రీ-కాలర్ ట్యూన్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కాలర్ ట్యూన్‌లలో, సైబర్ నేరాలను నివారించే మార్గాలను ప్రజలకు తెలియజేస్తుంది. ఈ కాలర్ ట్యూన్ ప్రతిరోజూ 8 నుంచి 10 సార్లు ప్లే అవుతుంది.
ఈ ప్రచారం దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలిసేందుకు టైం పడుతుంది. అందుకే దీన్ని 3 నెలల పాటు కొనసాగించనున్నారు. ఇందులో కాలర్ ట్యూన్ ద్వారా వివిధ మెసేజ్ లను సైబర్ నేరాల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తారు. పోలీసు అధికారి లేదా న్యాయమూర్తి పేరుతో ఎవరైనా మోసం చేస్తే ఏం చేయాలో ఇందులో చెప్తారు. మరోపక్క దేశంలో గత కొన్ని నెలలుగా దేశంలో డిజిటల్ అరెస్ట్ వంటి కేసులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. అందులో మోసగాళ్లు, నకిలీ అధికారులుగా నటిస్తూ ప్రజలకు ఫోన్ చేసి కష్టపడి సంపాదించిన సొమ్మును కాజేస్తున్నారు. ఇది కాకుండా, KYC అప్డేట్స్, కొత్త ఆఫర్లు వంటి మొదలైన సాకులతో ప్రజలను సైబర్ సంక్షోభానికి బలిపశువులను చేస్తున్నారు.
ఈ నేరాలను అరికట్టాలని ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ప్రతిసారీ మోసగాళ్ళు ప్రజలను ట్రాప్ చేయడానికి కొత్త కొత్త పద్ధతులను రూపొందిస్తున్నారు. ఇటీవల ఇటువంటి సందర్భాలలో ఉపయోగించే 6 లక్షలకు పైగా సిమ్ కార్డులను ప్రభుత్వం బ్లాక్ చేసింది. సైబర్ నేరాలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా నవంబర్ 15, 2024 వరకు 6.69 లక్షల సిమ్ కార్డులు, 1,32,000 IMEI నంబర్‌లను 'బ్లాక్' చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ 9.94 లక్షల ఫిర్యాదుల పరిష్కారం ద్వారా రూ. 3,431 కోట్లకు పైగా ఆదా చేయడంలో సహాయపడిందని కూడా తెలియజేసింది.
డిజిటల్ అరెస్ట్ అంటే..
డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ క్రైమ్ కు సంబంధించిన కొత్త తరహా మోసం. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ తదితర సంస్థల అధికారుల పేరుతో ప్రజలకు ఫోన్ చేసి, తప్పుడు కేసులు పెట్టి, బెదిరించి, ఆపై డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌తో సహా అనేక మార్గాల ద్వారా వారి నుంచి డబ్బును వసూలు చేస్తారు. అలా మోసగాళ్లు బాధితుల నుంచి లక్షలు, కోట్లలో డబ్బులు దండుకుంటారు.
Also Read : Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!