Instagram: ఇన్‌స్టాగ్రామ్‌కు ఊహించని షాక్, రూ.3500 కోట్లు జరిమానా విధించిన ప్రభుత్వం
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ కు ఐర్లాండ్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను భారీ మొత్తంలో జరిమానా విధించింది.
దేశ చట్టాలను ఉల్లంఘించేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఐర్లాండ్ ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. టీనేజర్ల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన కేసులో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ Instagramపై అక్కడి ప్రభుత్వం భారీ మొత్తంలో జరిమానా విధించింది. 405 మిలియన్ యూరోలు.. భారత కరెన్సీలో సుమారు రూ.3,500 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ వెల్లడించింది. ఐరిష్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని గత వారమే తీసుకుంది. ఆ వివరాలను ఇటీవలే మీడియాకు వెల్లడించింది. అయితే, దీనిపై ఇన్‌స్టాగ్రామ్ కూడా స్పందించింది. ఈ జరిమానాపై మెటా కంపెనీ అప్పీల్ దాఖలు చేసింది. డేటా దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను సైతం పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
రెండో అతి పెద్ద జరిమానా
డేటా దుర్వినియోగం కేసుకు విచారణ 2020లో మొదలయ్యింది. ఈ విచారణలో ఇన్ స్టాగ్రామ్ 13 నుంచి 17 ఏళ్ల వయసున్న యువతకు సంబంధించిన ఈ మెయిల్, ఫోన్ నంబర్ సహా పలు విషయాలను బయటపెట్టింది. పిల్లల ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ చిరునామాలకు సంబంధించి డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించిందని డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఆరోపించింది. వ్యక్తిగత సమాచారాన్ని బయటకు చెప్పడం ఐరిష్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఈ నేపథ్యంలో ఆ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద 405 మిలియన్ల యూరోల జరిమానాను విధించింది. వాస్తవానికి గతేడాది అమెజాన్ సంస్థ సైతం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంది. విచారణ అనంతరం ఆ సంస్థపై లగ్జెంబర్గ్ ప్రభుత్వం 746 మిలియన్ యూరోల జరిమానా విధించింది. ఆ తర్వాత అతి పెద్ద జరిమానా ఇదే కావడం విశేషం.
జరిమానాపై మెటా అప్పీల్
ఈ భారీ జరిమానాపై అప్పీల్ చేయాలని ఇన్ స్టా గ్రామ్ భావిస్తున్నట్లు మెటా కంపెనీ వెల్లడించింది. ఇన్ స్టా గ్రామ్ గత ఏడాది తన సెట్టింగ్‌లను అప్ డేట్ చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా టీనేజర్ల వ్యక్తిగత డేటా సురక్షితంగా, ప్రైవేట్ గా ఉంచడానికి కొత్త ఫీచర్లను లాంచ్ చేసినట్టు మెటా ప్రకటించింది. ఈ జరిమానాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు.. వాచ్ డాగ్ తీర్పును జాగ్రత్తగా సమీక్షిస్తున్నట్లు తెలిపింది. వాచ్ డాగ్ లో మెటా యాజమాన్యంలోని కంపెనీలపై ఇతర విచారణలు ఉన్నాయి. ప్రజల డేటాను దుర్వినియోగం చేసినందుకు గాను.. వాట్సాప్‌కు 225 మిలియన్ యూరోల జరిమానా విధించింది. డబ్లిన్‌లో యూరోపియన్ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఐరిష్ వాచ్‌డాగ్ పలు యుఎస్ టెక్ కంపెనీలకు లీడ్ రెగ్యులేటర్‌గా వ్యవహరిస్తున్నాయి. మరి, మెటా సంస్థ ఈ కేసును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఎందుకంటే అంత భారీ మొత్తాన్ని జరిమానాగా చెల్లించడమంటే మాటలు కాదు.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!