Google Pixel Phone: ఇండియాలో పిక్సెల్ ఫోన్ల తయారీ, చైనా-అమెరికా ఉద్రిక్తల నేపథ్యంలో గూగుల్ ప్లాన్!
కోవిడ్-19 లాక్ డౌన్ తో గూగుల్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి చైనాలో పలు అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పిక్సెల్ ఫోన్ల ఉత్పత్తిని కొంత మేర భారత్ కు తరలించే ఆలోచన చేస్తుంది ఆల్ఫాబెట్ ఇంక్ (GOOGL.O).
COVID-19 లాక్ డౌన్‌ల కారణంగా చైనాలో తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. చైనా, అమెరికా మధ్యన మాటల యుద్ధం కొనసాగింది. అటు అమెరికాకు సంబంధించిన పలు కంపెనీల ప్రొడక్టులు తయారీకి సైతం ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ మాతృసంస్థ అయిన Alphabet Inc (GOOGL.O) కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
పిక్సెల్ ఫోన్లను తయారీకి బిడ్ల ఆహ్వానం
పిక్సెల్ ఫోన్‌ల కు సంబంధించి కొంత ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 1 మిలియన్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లను తయారు చేయడానికి భారతదేశంలోని తయారీదారుల నుంచి బిడ్‌లను ఆహ్వానించింది. ఇది పిక్సెల్ ఫోన్ల కోసం అంచనా వేసిన వార్షిక ఉత్పత్తిలో 10% నుంచి 20%కి సమానంగా తెలుస్తోంది.
ప్రణాళికను పరిశీలించిన సుందర్ పిచాయ్
ఈ ఏడాది ప్రారంభంలో ఆల్ఫాబెట్ ఇంక్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ భారతదేశంలో తయారు చేసే ప్రణాళికను పరిశీలించారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తాజాగా విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. ఈ ప్లాన్ కు అవసరమైన ఆమోదం లభిస్తే, భారతదేశ ఉత్పత్తి కార్యకలాపాలకు చైనా నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
భారత్ లో ఐఫోన్ 14 తయారీ
అటు ప్రపంచ టెక్ దిగ్గజం Apple Inc. ఇప్పటికే కాంట్రాక్ట్ తయారీ భాగస్వాములు Foxconn (2354.TW), Wistron ద్వారా భారతదేశంలో iPhone 13 వరకు కనీసం నాలుగు మోడళ్లను తయారు చేస్తోంది. ఆపిల్ ఆల్ఫాబెట్ కు సమీప స్మార్ట్ ఫోన్ పోటీదారు కావడం విశేషం. సెప్టెంబరు 7న ఆవిష్కరించబడిన తాజా మోడల్ ఐఫోన్ 14ను భారతదేశంలో కూడా తయారు చేయాలని ఆపిల్ కంపెనీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
COVID కేసుల పెరుగుదల కారణంగా ఈ సంవత్సరం ప్రారంభంలో చైనా ఇతర నగరాలతోపాటు కీలకమైన టెక్ హబ్ షాంఘైలో లాక్ డౌన్ విధించారు. ఈనేపథ్యంలో గ్లోబల్ సప్లై చైన్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటీవల, US చైనాకు కొన్ని హై ఎండ్ చిప్‌ల ఎగుమతులను నిషేధించింది. ఈ నేపథ్యంలో ఆసియా దేశంతో ఉద్రిక్తతలను పెంచింది. మొత్తంగా చైనాలో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించిన గూగుల్.. తన ఉత్పత్తి స్థావరాన్ని భారత్ కు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే వియత్నాంను ఆల్ఫాబెట్ ముఖ్య తయారీ స్థావరంగా పరిగణిస్తోంది. గూగుల్ ఇండియాలోనే ఉత్పత్తి సంస్థను నెలకొలిపితే మరింత మందికి ఉపాధి లభించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఈ విషయంపై గూగుల్ నుంచి అధికారిక ప్రకటన రావల్సి ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?