Fake Aadhaar- PAN: ఓరి మీ దుంప తెగ, ఛాట్‌జీపీటీని ఇలా కూడా వాడుతున్నారా?
ChatGPT: ఛాట్‌జీపీటీలో జిబ్లీ స్టైల్ ఫిల్టర్‌ను ప్రజలకు పిచ్చపిచ్చగా వాడేస్తున్నారు. గత వారం, AI ఇమేజ్ జనరేటర్‌ను ఉపయోగించి 700 మిలియన్ జిబ్లీ స్టైల్ చిత్రాలను సృష్టించారు.

Fake Aadhaar- PAN Cards Being Made Using Chatgpt: కృత్రిమ మేధ ఫ్లాట్‌ఫామ్ ChatGPTలో జీబ్లీ స్టైల్ చిత్రాలను సృష్టించే ట్రెండ్ సోషల్ మీడియాలో కొనసాగుతోంది, నెటిజన్లు వేలంవెర్రిగా కొత్త ఇమేజ్‌లు జనరేట్ చేస్తున్నారు. కొంతమంది తమ ఫొటోలను స్టుడియో జీబ్లీ స్టైల్ (Studio Ghibli style)లోకి మార్చుకుని మురిసిపోతుంటే, మరికొందరు సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు. జీబ్లీ ఫిల్టర్ గురించి పక్కనబెడితే, కొందరు ఛాట్‌జీపీటీ సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు, నకిలీ ఆధార్ కార్డ్‌లు & నకిలీ పాన్ కార్డ్‌లను సృష్టిస్తున్నారు. ChatGPTలో రూపొందించిన నకిలీ ఆధార్ కార్డ్, నకిలీ పాన్ కార్డులు ఇప్పుడు టెక్ ప్రపంచంలో వైరల్ అవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నకిలీ పాన్ కార్డ్, నకిలీ ఆధార్ కార్డులు దాదాపుగా ఒరిజినల్ కార్డ్‌ల్లా కనిపిస్తున్నాయి.
విదేశీ ప్రముఖులకు భారతదేశ ఆధార్ కార్డ్‌లు
కొందరు వ్యక్తులు, ChatGPT సాయంతో ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman) టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) కోసం నకిలీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ చిత్రాలను రూపొందించారు, అవి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, దాదాపు 1500 ఏళ్ల క్రితం జీవించిన భారతదేశపు గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభటను కూడా క్రియేటివ్ రాయుళ్లు వదిలిపెట్టలేదు. వాళ్ళు, ఆర్యభట పేరుతో పాన్ కార్ & ఆధార్ కార్డ్ తయారు చేశారు. వినడానికి ఈ విషయం కాస్త కామెడీగా అనిపించినా, ఇది ముమ్మాటికీ కృత్రిమ మేధస్సును దుర్వినియోగం చేయడమే. ట్రెండ్‌ను ఫాలో అవుతూ, క్రియేటివిటీకి పదును పెడుతూ దీనిని సరదాగా చేస్తున్నప్పటికీ, ఇది ఆందోళన కలిగించే విషయం.
నిజమైన కార్డుల్లా కనిపిస్తున్న చిత్రాలు
ChatGPT సాయంతో క్రియేట్ చేసిన ఆధార్ కార్డులకు - నిజమైన కార్డులకు చాలా వరకు పోలికలు ఉన్నాయి. అయితే, కార్డులోని టెక్స్ట్, నంబర్లలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇలా నకిలీ కార్డులను సృష్టించగల AI సామర్థ్యం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. సమాచార భద్రత & AI నియంత్రణపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ఈ అనుభవాలు చెబుతున్నాయి.
నకిలీ కార్డులను ఎలా గుర్తించాలి?
ఆధార్ కార్డు అనేది దేశంలోని ప్రతి పౌరుడికి భారత ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు. ఇది ఒక ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది. ఈ కార్డ్‌లో వ్యక్తిగత వివరాలు, వేలిముద్రలు, ఐరిస్ డేటా నిక్షిప్తమైన ఉంటుంది. అదే విధంగా, పాన్ కార్డులో కూడా 10 అంకెలు & ఆంగ్ల అక్షరాల (Alphanumeric) కోడ్ ఉంటుంది, ఇది ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. QR కోడ్ సాయంతో ఆధార్ కార్డ్, పాన్ కార్డును వెరిఫై చేయవచ్చు. ఇది ఎన్‌క్రిప్ట్ చేసిన డేటా కాబట్టి, ధృవీకృత స్కానర్‌లు మాత్రమే ఈ QR కోడ్‌ను స్కాన్ చేయగలవు. నకిలీ ఆధార్, నకిలీ పాన్ కార్డ్ మీదున్న QR కోడ్ స్కాన్ కాదు. అందువల్ల, ప్రామాణిక సంస్థలు మాత్రమే ఆధార్, పాన్‌ను వెరిఫై చేయగలవు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

