Budget 2023: స్మార్ట్ ఫోన్లు, కెమెరా లెన్స్‌లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ - మరింత చవకగా!
మనదేశంలో మొబైల్స్, కెమెరా లెన్స్‌ల ధరలు మరింత తగ్గనున్నాయి.
Union Budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పయనిస్తోందన్నారు. రూ.ఏడు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఈ బడ్జెట్ ద్వారా ప్రకటించారు. దీంతో పాటు భారతదేశంలో మొబైల్ ఫోన్స్, కెమెరా లెన్స్‌ల ధరలు కూడా తగ్గనుందని తెలుస్తోంది
కెమెరాలు, స్మార్ట్ ఫోన్లు మరింత చవక
కొత్త స్మార్ట్ ఫోన్లు, కెమెరా లెన్స్‌ల ధరలు మరింత తగ్గనున్నాయి. డీఎస్ఎల్ఆర్ కెమెరాలు కొనేటప్పుడు లెన్స్ కూడా అత్యంత ముఖ్యమైనవి. కాబట్టి వాటి ధర తగ్గడం కెమెరాలు కొనాలనుకునేవారికి ఉపశమనమే. ఇక మనదేశంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ కూడా పెరుగుతోంది. కాబట్టి కొత్త ఫోనాలనుకునేవారికి ఇది శుభవార్త.
దీంతోపాటు బొమ్మలు, సైకిళ్లు, ఆటోమొబైల్స్ చవకగా లభిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వీటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గనున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ కారు కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయనవసరం లేదన్న మాట.
2014-15లో భారతదేశంలో మొబైల్ ఫోన్‌ల మార్కెట్ రూ.18,900 కోట్లుగా ఉంది. అప్పట్లో 5.8 కోట్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఈ మార్కెట్ రూ.2,75,000 కోట్లకు పెరిగింది. ప్రతి సంవత్సరం 31 కోట్ల యూనిట్లు అమ్ముడుపోతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
లిథియం బ్యాటరీలు మరింత చవక కానున్నాయి. దీనితో పాటు ల్యాబ్‌లో రూపొందించిన వజ్రాల తయారీలో ఉపయోగించే విత్తనాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం తగ్గించారు. టీవీ ప్యానెళ్ల ఓపెన్ సెల్‌ల భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఇంకా తగ్గింది.
వీటి ధరలు పెరగనున్నాయి
2023 బడ్జెట్‌లో కొన్ని వస్తువుల ధరలు తగ్గాయి. కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి. విదేశాల నుంచి వచ్చే వెండి వస్తువులు మరింత ప్రియం కానున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో పాటు సిగరెట్ల ధర కూడా పెరగనుంది.
డిజిటల్ లైబ్రరీ కూడా
డిజిటల్ ఇండియా విద్యను కూడా డిజిటల్‌గా మార్చింది. లాక్‌డౌన్ ద్వారా ఆన్‌లైన్ క్లాసుల వాడకం పెరిగింది. దీనికి సంబంధించిన విషయాన్ని కూడా బడ్జెట్ 2023లో జోడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పిల్లల కోసం డిజిటల్ లైబ్రరీని ప్రకటించారు. ఈ డిజిటల్ లైబ్రరీని ఇంటర్నెట్ ద్వారా ఏ డివైస్ నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. దీంతో పిల్లలు ఆన్‌లైన్‌లో చదువుకునే సౌలభ్యాన్ని పొందుతారు.
బడ్జెట్‌లో మరికొన్ని కీలక అంశాలు
1.రూ.ఏడు లక్షల వరకూ పన్ను మినహాయింపును పెంచారు. ఒకవేళ ఆదాయం రూ.7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.15 లక్షలు దాటితేనే 30% ట్యాక్స్ పడనుంది.
2 .రూ.ఏడు లక్షల ఆదాయం దాటితే, రూ.మూడు నుంచి ఆరు లక్షల వరకూ ఐదు శాతం పన్ను, రూ.ఆరు నుంచి తొమ్మిది లక్షల వరకూ ఏడు శాతం పన్ను, రూ.తొమ్మిది నుంచి 12 లక్షల వరకూ 12 శాతం పన్ను విధించనున్నారు
3. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పొదుపు మొత్తం పరిమితిని రూ.15 లక్షల నుంచి ఏకంగా రూ.30 లక్షల వరకూ పెంచారు.
4. Monthly Income Account Scheme కింద ప్రస్తుతం ఉన్న రూ.4.5 లక్షల పరిమితిని కూడా ఒకేసారి రూ.9 లక్షలకు పెంచారు.
5. ఇక మహిళలకు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇందులో రెండేళ్ల వరకూ రూ.2 లక్షల మొత్తం పొదుపు చేసుకోవచ్చు.
6. ఇకపై కామన్ ఐడెంటిటీగా పాన్ కార్డ్‌నే పరిగణించనున్నారు. కేంద్రం విద్యుత్ రంగంలో రూ.35 వేల కోట్లు కేటాయించనుంది.
7. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 లో భాగంగా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లను కూడాత ఏర్పాటు చేయనున్నారు.