Smriti Mandhana: టోర్నీలోనే ఖరీదైన ప్లేయర్ - పెర్ఫార్మెన్స్ మాత్రం అతి దారుణంగా!
మహిళల ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధాన ఘోరంగా విఫలం అయింది.
Smriti Mandhana: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ సవాల్ ఎదురుకానుంది. లీగ్ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో కొనసాగుతోంది. దీంతో బెత్ మూనీ జట్టు నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.
పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉండగా, యూపీ వారియర్స్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యూపీ వారియర్స్‌ను ఓడించి ఫైనల్స్‌కు టికెట్‌ను ఖరారు చేసుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 12 పాయింట్లతో ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా బెత్ మూనీ జట్టు అగ్రస్థానంలో నిలిచింది.
అభిమానులను నిరాశ పరిచిన ఆర్సీబీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోరంగా నిరాశపరిచింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.
ఈ సీజన్‌లో RCB జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. కానీ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఆరు 6 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని తర్వాత, స్మృతి మంధాన, జట్టులోని ఇతర ఆటగాళ్లపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానపై కాసుల వర్షం కురిసింది. కానీ మైదానంలో మాత్రం రాణించలేకపోయింది.
రూ. 3.4 కోట్లకు స్మృతి మంధానను కొన్న ఆర్సీబీ
మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13వ తేదీన జరిగింది. వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధానను రికార్డు స్థాయిలో రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ ప్లేయర్ తన ఆటతో చాలా నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన స్మృతి మంధాన 18.62 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఈ కారణంగా ఆ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది.
స్మృతి మంధాన తర్వాతి స్థానంలో రూ.3.2 కోట్లతో యాష్లే గార్డ్‌నర్ నిలిచింది. యాష్లే గార్డ్‌నర్‌ను గుజరాత్ దక్కించుకుంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను రూ.1.8 కోట్లతో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీని రూ.1.7 కోట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. న్యూజిలాండా్ ప్లేయర్ సోఫీ డివీన్‌ను కూడా రూ.50 లక్షలకు బెంగళూరు దక్కించుకుంది.
భారత యువ కెరటం, టాప్ ఆర్డర్లో కీలకమైన జెమీమా రోడ్రిగ్స్ జాక్‌పాట్ కొట్టేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను ఏకంగా రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఓపెనింగ్, వన్‌డౌన్, సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఆమె సొంతం. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆమె బ్యాటింగ్‌లో గేర్లు మార్చగలదు. ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ బ్యాటర్, విధ్వంసక క్రికెటర్ బెత్‌మూనీకి అనుకున్నట్టే మంచి ధర లభించింది. గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది.