UPW Vs GG Highlights: చితక్కొట్టిన గ్రేస్ హారిస్ - గుజరాత్‌పై యూపీ వారియర్జ్ థ్రిల్లింగ్ విక్టరీ!
మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
UP Warriorz Vs Gujarat Giants, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం యూపీ వారియర్జ్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి విజయం సాధించింది. యూపీ వారియర్జ్ బ్యాటర్లలో గ్రేస్ హారిస్ (59 నాటౌట్: 26 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించింది.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో మొదటి రెండు మ్యాచ్‌లూ ఏకపక్షంగానే ముగిశాయి. కానీ మూడో మ్యాచ్ మాత్రం థ్రిల్లర్‌లా సాగింది. మొదటి మ్యాచ్‌లో 143 పరుగులతో ముంబై ఇండియన్స్, రెండో మ్యాచ్‌లో 60 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించాయి. కానీ ఈ మ్యాచ్ మాత్రం చివరి బంతి వరకు సాగింది. ఆఖరి 30 బంతుల్లో 75 పరుగులను యూపీ వారియర్జ్ సాధించడం విశేషం.
బ్యాటింగ్‌లో క్లాసిక్ ‘గ్రేస్’
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్‌కు ప్రారంభంలోనే ఆరంభంలోనే కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ అలిస్సా హీలీ (7: 8 బంతుల్లో, ఒక ఫోర్), శ్వేతా సెహ్రావత్ (5: 6 బంతుల్లో, ఒక ఫోర్), టహ్లియా మెక్‌గ్రాత్ (0: 1 బంతి) ముగ్గురూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. దీంతో యూపీ వారియర్జ్ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
అయితే ఆ తర్వాత కిరణ్ నవ్‌గిరే (53: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), దీప్తి శర్మ (11: 16 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దీప్తి శర్మ క్రీజులో ఉన్నంత వరకు ఇబ్బంది పడుతూనే ఉంది. మరో ఎండ్‌లో కిరణ్ నవ్‌గిరే చాలా వేగంగా ఆడింది. అర్థ సెంచరీ చేసిన అనంతరం దీప్తి, కిరణ్ ఇద్దరూ రెండు పరుగుల వ్యవధిలోనే అవుటయ్యారు.
ఆ తర్వాత వచ్చిన సిమ్రాన్ షేక్ (0: 1 బంతి), దేవిక వైద్య (4: 7 బంతుల్లో) కూడా విఫలం కావడంతో యూపీ 105 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. చివరి మూడు ఓవర్లో 52 పరుగులు చేయాల్సిన దశలో గ్రేస్ హారిస్ (59 నాటౌట్: 26 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగి పోయింది. తనకి సోఫీ ఎకిల్ స్టోన్ (22 నాటౌట్: 12 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) నుంచి చక్కటి సహకారం లభించింది. దీంతో 18వ ఓవర్లో 20, 19 ఓవర్లో 14 పరుగులు వచ్చాయి.చివరి ఓవర్లో విజయానికి 19 పరుగులు అవసరం కాగా, కేవలం ఐదు బంతుల్లోనే 25 పరుగులు రాబట్టిన గ్రేస్ హారిస్ యూపీకి విజయాన్ని అందించింది.
ఆఖర్లో అదరగొట్టిన గుజరాత్
ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా బెత్ మూనీ ఈ మ్యాచ్‌కు దూరం అయింది. దీంతో భారత బౌలర్ స్నేహ్ రాణా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (24: 15 బంతుల్లో, ఐదు ఫోర్లు), సోఫీ డంక్లే (13: 11 బంతుల్లో, రెండు ఫోర్లు) బ్యాటింగ్‌కు దిగారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 3.5 ఓవర్లలో 34 పరుగులు సాధించారు.
అయితే ఆ తర్వాత ఇన్నింగ్స్ కొంచెం నిదానించింది. అన్నాబెల్ సదర్లాండ్ (8: 10 బంతుల్లో, ఒక ఫోర్), సుష్మ వర్మ (9: 13 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. కానీ ఒక ఎండ్‌లో హర్లీన్ డియోల్ (46: 32 బంతుల్లో, ఏడు ఫోర్లు) నిలబడి ఆడింది. అయితే తనకు యాష్లే గార్డ్‌నర్ (25: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) తోడయింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 29 బంతుల్లోనే 44 పరుగులు జోడించారు. కానీ వీరిద్దరూ రెండు ఓవర్ల వ్యవధిలోనే అవుట్ అయ్యారు.
కానీ చివర్లో దయాళన్ హేమలత (21: 13 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడింది. దీంతో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ 50 పరుగులకు పైగా సాధించింది. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అంజలి శర్వాణి, టహ్లియా మెక్‌గ్రాత్ తలో వికెట్ దక్కించుకున్నారు.