Neeraj Chopra: వరల్డ్ ఛాంపియన్ అయ్యాక నీరజ్ చోప్రా రియాక్షన్ ఇదే!
ఇన్నాళ్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా ఉన్న నీరజ్ చోప్రా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. స్వర్ణం గెలిచిన తర్వాత చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Neeraj Chopra: బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా ఆదివారం ముగిసిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ - 2023లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. తుదిపోరులో తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసినా.. రెండోసారి 88.17 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. పసిడి పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఇవే పోటీలలో రజతంతో సరిపెట్టుకుని ఈ ఏడాది ఏకంగా స్వర్ణం నెగ్గిన నీరజ్.. పోటీలు ముగిశాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన విజయాన్ని భారత ప్రజలకు అంకితమిచ్చాడు.
పతకం గెలుచుకున్న తర్వాత నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. ‘నా ఆట చూడటం కోసం రాత్రంతా నిద్ర పోకుండా మేలుకుని ఉన్న భారతీయులందరికీ ధన్యవాదాలు. ఈ పతకం మొత్తం దేశానికి చెందుతుంది. నేను గతంలో ఒలింపిక్ ఛాంపియన్ అయ్యాను. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ కూడా అయ్యాను. మనం ఏదైనా సాధించగలం. అయితే అందుకు కఠోర సాధన చేయాలి. మీరు ఎంచుకునే రంగంపై గౌరవం ఉంచి కష్టపడితే ప్రపంచంలో మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు’ అంటూ వ్యాఖ్యానించాడు.
కాగా స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశ ప్రధాని నరంద్ర మోడీతో పాటు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ఎక్స్ (ట్విటర్) వేదికగా అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నీరజ్ దేశానికి గర్వకారణమని కొనియాడుతున్నారు.
Neeraj Chopra- I want to thank the people of India for staying up late. This medal is for all of India. I'm Olympic champion now I'm world champion. Keep working hard in different fields. We have to make a name in the world. pic.twitter.com/JsymGj3Kwd
— jonathan selvaraj (@jon_selvaraj) August 27, 2023
అర్షద్‌ను పిలిచిన నీరజ్..
జావెలిన్ త్రో ఫైనల్ ముగిసిన తర్వాత నీరజ్.. కాంస్యం నెగ్గిన వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్)తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సందర్భంగా అతడు చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. ఇవే పోటీలలో 87.82 మీటర్ల దూరం విసిరి రజతం నెగ్గిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను కూడా ఫోటో దిగేందుకు పిలిచాడు. అక్కడే ఉన్న నదీమ్.. తన దేశ జెండా కూడా పట్టుకోకుండానే నీరజ్ పక్కన నిలబడ్డాడు. వెనుకాల మువ్వన్నెల జెండాను పట్టుకుని నదీమ్‌ను ఆప్యాయంగా పిలిచినందుకు గాను నెటిజన్లు నీరజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Watch Neeraj Chopra inviting Silver medalist Arshad Nadeem (likely without flag) under Bharat's 🇮🇳 #AkhandBharat pic.twitter.com/Hy9OlgKpTE
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 28, 2023
ఇక నిన్నటి ఫైనల్ ఈవెంట్‌లో నీరజ్.. తొలి త్రోలోనే ఫౌల్ చేశాడు. రెండో ప్రయత్నంలో 88.17 మీటర్లు విసిరి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. మూడోసారి 86.32 మీటర్లు విసిరాడు. ఆ తర్వాతి మూడు ప్రయత్నాల్లోనూ 88 మీటర్ల మార్క్ దాటలేకపోయాడు. కానీ అతడి ప్రత్యర్థులెవరూ 88 మీటర్ల మార్కు కూడా రాలేకపోయారు. దీంతో అతడికి స్వర్ణం సలాం కొట్టింది. చోప్రాతో పాటు ఇవే ఫైనల్స్‌లో మరో ఇద్దరు అథ్లెట్లు కిషోర్ జెన (84.77 మీటర్లు), డీపీ మను (84.14 మీటర్లు).. ఐదు, ఆరు స్థానాలలో నిలిచారు.
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం నెగ్గడంతో.. ఒలింపిక్స్‌తో పాటు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నీరజ్.. అభినవ్ బింద్రా సరసన నిలిచాడు. బింద్రా 2006 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పాటు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial