Kohli Vs Rohit: ఒకళ్లుంటే మరొకళ్లు ఆడరా... ఇలా అయితే టీమిండియాకు కష్టమే!
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు అస్సలు పడటం లేదా? ఒకరి కెప్టెన్సీల్లో మరొకరు ఆడరా?
భారత క్రికెట్లో మరో ముసలం మొదలైందా? టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి, వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్‌కు అస్సలు పడటం లేదా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే చిన్న పిల్లాడు కూడా ఏం జరుగుతుందో ఊహించగలడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రోహిత్ ఆడటానికి ఇష్టపడటం లేదు. రోహిత్ కెప్టెన్సీలో ఆడటానికి విరాట్ సుముఖత చూపడం లేదు. గాయం కారణంగా రోహిత్ టెస్టులకు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. వ్యక్తిగత కారణాల రీత్యా వన్డేల్లో ఆడలేనని కోహ్లీ బీసీసీఐని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంతకుముందు తరంలో ధోనికి, సీనియర్లకు ఎలా పొసగలేదో.. ఇప్పుడు రోహిత్, కోహ్లీ గొడవ కూడా అంతే వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో సయోధ్య కుదరాలంటే బీసీసీఐ పెద్దలే ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటివి డ్రెస్సింగూ రూం వాతావరణాన్ని దెబ్బతీసి జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతాయి.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. టాలెంట్ విషయంలో ఎవ్వరినీ తక్కువ చేయలేం. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఒకరు ప్రకృతి అయితే.. మరొకరు ప్రళయంలా ఆడేవారు. నిలకడగా ఆడటంలో విరాట్‌ని మించినోళ్లు లేరు. భారీ ఇన్నింగ్స్ ఆడటంలో రోహిత్ దిట్ట.
సాధారణంగా ఏ క్రికెటర్ అయినా అర్థ సెంచరీ చేశాక.. తన ఫ్యాన్స్ కానీ, క్రికెట్ అభిమానులు కానీ సెంచరీ గురించి ఆలోచిస్తారు. కానీ రోహిత్ అర్థ సెంచరీ చేస్తే మాత్రం అందరూ 200 గురించే ఆలోచిస్తారు. తను సంపాదించుకున్న నమ్మకం అలాంటిది. వన్డే క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని విధంగా మూడు డబుల్ సెంచరీలను రోహిత్ సాధించాడు.
ఇక కోహ్లీ అంటేనే నిలకడకు మారు పేరు. బ్యాట్ పట్టి బరిలోకి దిగితే శతకం ఖాయం అని అభిమానుల నమ్మకం. 24 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ స్పాన్‌లో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు సాధిస్తే.. కేవలం 11 సంవత్సరాల్లోనే కోహ్లీ సెంచరీల సంఖ్య 70కి చేరింది. గత రెండేళ్లుగా ఫాంలో లేక ఇబ్బంది పడుతున్నాడు కానీ ఒక సారి బ్యాటు పట్టి గ్లౌజు విదిలిస్తే.. గ్రౌండ్‌లో పరుగుల వరద పారించడం ఖాయం.
రోహిత్ శర్మ టీమిండియా తరఫున 2007లోనే అరంగేట్రం చేయగా.. విరాట్‌కు 2008లో ఆ అవకాశం దక్కింది. దశాబ్ద కాలంలోనే వీరిద్దరూ భారత క్రికెట్‌లో బలమైన శక్తులుగా ఎదిగారు. వీరిద్దరూ కూడా ఎన్నో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కలిసి 4,878 పరుగులు జోడించారు. భారత క్రికెట్‌లో ఇది రెండో అత్యధికం. 8,227 పరుగులతో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు.
గొడవ ఎక్కడ మొదలైంది?
విరాట్, రోహిత్‌ల కెప్టెన్సీ వివాదం ఐపీఎల్ నుంచే ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ఐపీఎల్‌లో రోహిత్ ఎంతో విజయవంతమైన కెప్టెన్. తొమ్మిది సీజన్లలో ఐదు ట్రోఫీలు సాధించాడు. మరోవైపు కోహ్లీకి మాత్రం అదృష్టం కలిసిరాలేదు. ఒక్కటంటే ఒక్కసారి కూడా విరాట్ కప్ గెలవలేదు. తను ఎంత బాగా ఆడినప్పటికీ.. జట్టు సహకారం లేకపోవడం, కీలక సమయాల్లో విఫలం కావడంతో కప్ కోహ్లీని చేరలేకపోయింది.
దీనికి తోడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ రికార్డు ఓవరాల్‌గా బాగానే ఉన్నప్పటికీ.. ఐసీసీ ట్రోఫీల్లో విరాట్‌కు అస్సలు లక్ కలిసిరాలేదు. 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టెస్టు చాంపియన్ షిప్, టీ20 వరల్డ్‌కప్‌ల్లో జట్టు ఓటమి పాలు కావడం విరాట్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి.
టెస్టులు, వన్డేలపై దృష్టి పెట్టడం కోసం విరాట్ తనంతట తనే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో టెస్టులకు ఒక కెప్టెన్, వన్డే, టీ20లకు ఒక కెప్టెన్ మోడల్‌లో బీసీసీఐ పరిమిత ఓవర్ల పగ్గాలను రోహిత్‌కు అప్పగించింది. అయితే వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించడం ఇక్కడ వివాదాస్పదం అయింది.
భవిష్యత్తులో ఏం జరుగుతుంది?
జట్టులో ఇద్దరు ప్రపంచస్థాయి ప్లేయర్లు ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఆడబోమని పట్టుబట్టి కూర్చోవడం నష్టమే కాదు ప్రమాదకరం కూడా. దీని వల్ల డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉంటుంది. వీరిద్దరూ జట్టుకు విలువైన ఆటగాళ్లు కాబట్టి జట్టులో లేని లోటు కూడా పూడ్చలేనిది. కాబట్టి బీసీసీఐ, క్రికెట్ పెద్దలు ఇద్దరినీ ఒక చోట కూర్చోబెట్టి సయోధ్య కుదర్చాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే ఐసీసీ ట్రోఫీల్లో జట్టు విజయావకాశాలు తగ్గిపోతాయి.
Also Read: Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్..! వచ్చే ఐపీఎల్‌ను...?
Also Read: Rohit Sharma Update: బయటి మాటల్ని పట్టించుకోం.. బలమైన బంధమే ముఖ్యమన్న రోహిత్
Also Read: India's Tour Of South Africa: ఈ నలుగురూ ఆడితే దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్‌కు తిరుగులేదు.. ఎవరంటే?
Also Read: Pushpa Event: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి