IND vs ENG: లార్డ్స్ మైదానంలో కోహ్లీ సెంచరీ చేస్తాడా? లేక సచిన్, గావస్కర్ సరసన నిలుస్తాడా?
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ కూడా ఇప్పటి వరకు లార్డ్స్‌లో టెస్టుల్లో శతకం సాధించలేదు. కానీ, ఇప్పుడు కోహ్లీకి ఒక ఛాన్స్ వచ్చింది.
ఏ క్రికెటర్‌కి అయినా తన జీవితకాలంలో ఒక కోరిక ఉంటుంది. అదేంటంటే ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో సెంచరీ సాధించాలని. భారత తరఫున ఇప్పటి వరకు తొమ్మిది మంది క్రికెటర్లు మాత్రమే లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో శతకం సాధించారు. కానీ, ఇక్కడ విచిత్రం ఏమిటో తెలుసా? ఈ లిస్టులో భారత మేటి ఆటగాళ్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, సునీల్ గావస్కర్ లేకపోవడం. అవును, వీరిద్దరూ లార్డ్స్ వేదికలో టెస్టుల్లో శతకం సాధించలేదు.
మరోపక్క భారత పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ కూడా ఇప్పటి వరకు లార్డ్స్‌లో టెస్టుల్లో శతకం సాధించలేదు. కానీ, ఇప్పుడు కోహ్లీకి ఒక ఛాన్స్ వచ్చింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్... ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. నాటింహోమ్ వేదికగా జరిగిన తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. సిరీస్ లో భాగంగా రెండో టెస్టు గురువారం(12న) ప్రారంభంకానుంది. లార్డ్స్ వేదికగా ఈ టెస్టు జరగనుంది.
తొలి టెస్టులో కోహ్లీ గెల్డెన్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రెండో టెస్టులో తిరిగి ఫామ్ అందుకుంటాడా? లార్డ్స్ టెస్టులో శతకం సాధిస్తాడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేదంటే శతకం సాధించకుండా సచిన్, గావస్కర్‌తో పాటు లార్డ్స్‌లో శతకం సాధించని ఆటగాళ్ల లిస్టులో చేరతాడా అన్నది చూడాలి. 2019 నవంబరు నుంచి విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఏ ఫార్మాట్‌లోనూ శతకం సాధించలేదు. దీంతో కోహ్లీ ఎప్పుడు శతకం సాధిస్తాడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో శతకాలు సాధించిన భారత ఆటగాళ్లు
వినోద్ మన్కద్, దిలీప్ వెంగ్‌సర్కార్... వీరిద్దరూ మూడేసి చొప్పున సెంచరీలు చేశారు. గుండప్ప విశ్వనాథ్, రవిశాస్త్రి, మహమ్మద్ అజారుద్దీన్, సౌరభ్ గంగూలీ, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్, అజింక్య రహానె. 2014లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించిన సమయంలో రహానె లార్డ్స్ మైదానంలో సెంచరీ చేశాడు.
గత 9 టెస్టుల్లోని 15 ఇన్నింగ్సుల్లో విరాట్ కోహ్లీ ఒక్కసారి కూడా సెంచరీ చేయలేదు. 2019 నవంబరు నుంచి ఇప్పటి వరకు కోహ్లీ 15 ఇన్నింగ్సుల్లో యావరేజ్ 23 చొప్పున 345 పరుగులు మాత్రమే చేశాడు. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. అందుకోసం ఇప్పటికే లండన్ చేరుకున్న కోహ్లీ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.