U19 Womens T20 World Cup: న్యూజిలాండ్‌ను సెమీస్‌లో ఓడించిన టీమిండియా - పెద్దల వల్ల కానిది!
అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది.
India Women U19 vs New Zealand Women U19: భారత క్రికెట్ జట్టు అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టు భారత్‌కు 108 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ తరఫున శ్వేతా సెహ్రావత్ తుఫాను బ్యాటింగ్ చేసింది. 45 బంతుల్లోనే 10 ఫోర్ల సాయంతో అజేయంగా 61 పరుగులను శ్వేత సాధించింది. భారత పురుషుల జట్టుకు ఐసీసీ ట్రోఫీల్లో న్యూజిలాండ్ కొరకరాని కొయ్యగా మారగా, అండర్-19 మహిళల జట్టు మాత్రం అలవోకగా విజయం సాధించడం విశేషం.
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గ్రూప్-డిలో ఉంది. టీం ఇండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడింది. సెమీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా జనవరి 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ భారత జట్టు ఎదుర్కోనున్న ప్రత్యర్థిని నిర్ణయించనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున జార్జియా ప్లిమ్మర్ అత్యధికంగా 35 పరుగులు చేసింది. 32 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో ఈ స్కోరు సాధించింది. భారత బౌలర్ పార్శ్వి చోప్రా మూడు వికెట్లు పడగొట్టింది. ఆమె నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఒక మెయిడిన్ ఓవర్ కూడా వేసింది. కెప్టెన్ షెఫాలీ వర్మ ప్రమాదకరంగా బౌలింగ్ చేసింది. ఆమె నాలుగు ఓవర్లలో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది.
న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు 14.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలీ వర్మ, శ్వేత సెహ్రావత్ టీమ్ ఇండియాకు ఓపెనర్‌గా వచ్చింది. షెఫాలీ 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యింది. అయితే శ్వేత మాత్రం వేగంగా బ్యాటింగ్ చేస్తూ అజేయంగా అర్ధ సెంచరీ సాధించింది. 45 బంతులు ఎదుర్కొని 10 ఫోర్ల సాయంతో 61 పరుగులు చేసింది. సౌమ్య తివారీ 26 బంతులు ఎదుర్కొని 22 పరుగులు చేసింది. ఆమె మూడు ఫోర్లు కొట్టింది. గొంగడి త్రిష ఐదు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రయాణం ఇప్పటివరకు అద్భుతంగా ఉంది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో యూఏఈపై కూడా 122 పరుగుల తేడాతో భారీ విజయం పొందింది. అనంతరం స్కాట్లాండ్‌పై టీమిండియా 83 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియాపై ఏడు వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. శ్రీలంక, న్యూజిలాండ్‌పై కూడా భారత్ అద్భుతమైన విజయాలను నమోదు చేసింది.