Tokyo Olympics 2020: అట్టహాసంగా విశ్వ క్రీడా సంబరం ప్రారంభం... పతాకధారులుగా మేరీ కోమ్, మన్‌ప్రీత్ సింగ్
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, జాతీయ పురుషుల హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్ సింగ్ నడిపించారు.
క్రీడాభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విశ్వ క్రీడా సంబరం టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. ప్రపంచ క్రీడాకారులంతా ఒక చోటికి చేరే వేదిక ఇది. 200కు పైగా దేశాలు.. 11 వేల మందికి పైగా అథ్లెట్లు.. 60 వేలకు పైగా నిర్వాహక సిబ్బంది ఈ సారి క్రీడలను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ ఒలింపిక్స్ గత ఏడాది జరగాల్సిందే. కరోనా కారణంగా... సవాళ్లు ఎదుర్కొంటూ... క్రీడా సంబరాన్ని విజయవంతం చేయడానికి ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టారు.
పతాకధారులుగా మేరీ కోమ్, మన్‌ప్రీత్
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, జాతీయ పురుషుల హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్ సింగ్ నడిపించారు. భారత ఒలింపిక్ కమిటీ (ఐఓఏ) వీళ్లిద్దరినీ పతాకధారులుగా ప్రకటించింది. రెజ్లర్ బజ్‌రంగ్ పునియా ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరిస్తాడు. గత ఒలింపిక్స్ వరకు ఆరంభ వేడుకల్లో ఒక అథ్లెట్‌కే ఈ అవకాశం దక్కింది. అయితే ఈసారి నుంచి పురుషుల్లో ఒకరు, మహిళల్లో ఒకరు పతాకధారిగా ఉండేలా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనలు మార్చింది. సాధారణంగా కిందటిసారి జరిగిన ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన అథ్లెట్‌కు ఈ అవకాశం దక్కుతుంటుంది. రియోలో రజతం గెలిచిన సింధును పతాకధారిగా ఎంపిక చేస్తారని వార్తలొచ్చాయి. అయితే అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడమే కాక.. మూడోసారి ఒలింపిక్స్ బరిలో నిలుస్తున్న మేరీకే ఐఓఏ అవకాశం కల్పించింది.
కరోనా పరిస్థితులు కారణంగా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే భారత ఆటగాళ్లు అందరూ ప్రారంభవేడుకకు హాజరుకాలేదు. 20 మంది సభ్యులు, ఆరుగురు అధికారులతో భారత జట్టు ప్రారంభ వేడుకల్లో పాల్గొంది. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యోకి వెళ్లారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి.
జపాన్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. 1964లో ఆసియాలోనే తొలిసారిగా టోక్యోలో విశ్వ క్రీడలు జరిగాయి. ఆధునిక శకంలో జరుగనున్న 32 ఒలింపిక్స్ ఇవి. 1896లో ఏథెన్స్‌లో తొలిసారి విశ్వ క్రీడలను నిర్వహించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా 1916, 1940, 1944 ఒలింపిక్స్ రద్దయ్యాయి. చరిత్రలో క్రీడలు వాయిదా పడడం మాత్రం ఇదే తొలిసారి.
శనివారం నుంచి పతక పోటీలు ప్రారంభంకానున్నాయి. ఏ దేశం తొలి పతకం సాధిస్తుందో? భారత్ తరఫున ఎవరు పతకం గెలుస్తారో చూద్దాం. ఆర్చరీలో భారత్ తొలి పతకం సాధించి బోణీ కొడుతుందా? తొలి రోజు నిర్వహించిన ఆర్చరీ భాగాల్లో భారత క్రీడాకారులు నిరాశ పరిచారు.