Tokyo Olympics 2020: లవ్లీనా లవ్లీ పంచ్‌తో... భారత్‌కు రెండో పతకం.. బాక్సింగ్‌లో తొలి పతకం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం ఖాయమైంది. మహిళల బాక్సింగ్‌లో 69 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ లవ్లీనా విజయం సాధించింది.
హమ్మయ్య... ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం ఖాయమైంది. భారత్ మరో పతకం ఎప్పుడు సాధిస్తుందా అని యావత్త దేశం ఆశగా ఎదురుచూస్తోన్న వేళ...దాదాపు వారం రోజుల తర్వాత భారత్ తన ఖాతాలో రెండో పతకం ఖాయం చేసుకుంది. దీంతో క్రీడాభిమానులకు కాస్త ఊరట పొందారు. టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్ ఈవెంట్లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణి లవ్లీనా. పతకం ఖాయం చేసుకోవడంతో లవ్లీనాకు ప్రముఖులు శుభకాంక్షలు తెలుపుతున్నారు.
పోటీల్లో భాగంగా మహిళల బాక్సింగ్‌లో 69 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ లవ్లీనా విజయం సాధించింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి చెన్ పై విజయంతో కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. 4-1 తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించి పతకం ఖాయం చేసుకుంది 23ఏళ్ల లవ్లీనా. ఒకవేళ లవ్లీనా సెమీఫైనల్లో గెలిస్తే స్వర్ణం లేదా రజతం కోసం పోటీ పడాల్సి ఉంటుంది. సెమీఫైనల్లో ఓడిన ఇద్దరు ఆటగాళ్లకు కాంస్య పతకం అందజేస్తారు.
India is confirmed of 2nd Olympics medal🇮🇳
— Kiren Rijiju (@KirenRijiju) July 30, 2021
What a lovely Boxing from Lovlina🥊@LovlinaBorgohai has reached semi-finals and looking for Gold medal in #Tokyo2020 Olympics!#Cheer4India pic.twitter.com/Rc3IU93svF
అంతకుముందు మంగళవారం నిర్వహించిన 69 కేజీల బాక్సింగ్ విభాగంలో లవ్లీనా 3-2 తేడాతో జర్మనీ క్రీడాకారిణి నదైన్ అపెట్జ్ పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. అంతకుముందు ఆమెకు తొలి రౌండ్లో బై లభించడంతో నేరుగా రౌండ్ ఆఫ్ 16లో తన తొలి బౌట్ ఆడింది.
లవ్లీనా.. అని పేరులో లవ్ ఉందికానీ... రింగ్‌లోకి దిగి ప్రత్యర్థులపై పంచ్ విసిరితే మాత్రం అదిరిపోద్ది. భారత బాక్సింగ్‌లో వేగంగా ఎదిగిన యంగ్ ప్లేయర్ లవ్లీనా బోర్గాయిన్. అసోంలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చినా.. అనతి కాలంలోనే భారత మహిళా బాక్సర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో సెమీస్ చేరి టోక్యో బెర్తును దక్కించుకుంది. పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది.
గురువారం మేరీ కోమ్ కూడా పతకం ఖాయం చేస్తుందేమో అని అందరూ ఊహించారు. కానీ, అనూహ్యంగా ఆమె ఓడి... అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ తర్వాత భారత్‌కు పతకం అందించిన క్రీడాకారిణి లవ్లీనా. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే.
లవ్లీనా 2017లో తొలిసారి అంతర్జాతీయ పతకాన్ని అందుకుంది. అస్తానాలో జరిగిన ప్రెసిడెంట్స్ కప్, వియత్నాంలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైంది. 2018,2019 మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు నెగ్గింది. లవ్లీనాలోని ప్రతిభను గుర్తించిన భారత బాక్సింగ్ ఫెడరేషన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం కల్పించింది.