(Source: ECI/ABP News/ABP Majha)
MSD Joins Team India: కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమే.. మెంటార్‌గా మహేంద్రుడి ఎంట్రీ!
మహేంద్రసింగ్ ధోని మెంటార్‌గా టీమిండియాతో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్ అయిపోయి రెండు రోజులు కూడా కాకముందే ధోని కొత్త పాత్ర ఎత్తాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మెంటార్‌గా జట్టుతో చేరిపోయాడు. ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా ట్వీటర్ ద్వారా తెలిపింది. ’కింగ్‌కు స్వాగతం.. ఎంఎస్ ధోని కొత్త రోల్‌తో టీమిండియాలోకి వచ్చేశాడు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు రెండు ఫొటోలు కూడా షేర్ చేసింది.
Extending a very warm welcome to the KING 👑@msdhoni is back with #TeamIndia and in a new role!💪 pic.twitter.com/Ew5PylMdRy
— BCCI (@BCCI) October 17, 2021
కింద కామెంట్లలో ధోని ఫ్యాన్స్ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జట్టుకు ఆడకపోయినా.. చాలా రోజుల తర్వాత ధోని బ్లూ జెర్సీలో కనిపించడం వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కెప్టెన్‌గా తన మొదటి టీ20 వరల్డ్‌కప్‌ను ధోని గెలిచాడని, ఇప్పుడు మెంటార్‌గా కూడా గెలవనున్నాడని అంటున్నారు.
అయితే ఐపీఎల్ అయిపోయి రెండు రోజులు కూడా కాకముందే ఏమాత్రం విశ్రాంతి కూడా తీసుకోకుండా ధోని టీమిండియాతో చేరడం కచ్చితంగా తన మీద ఉన్న గౌరవాన్ని పెంచే అంశం. 38 ఏళ్ల వయసులో నెలరోజుల పాటు నిర్విరామంగా క్రికెట్ ఆడి.. ఇప్పుడు మరో నెలరోజులు జట్టును సన్నద్ధం చేయడం అంటే నిజంగా అది మామూలు విషయం కాదు.
ఎందుకంటే క్రిస్ గేల్ ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ కోసం ఐపీఎల్ మధ్యలోనే బయో బబుల్‌ను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఎంతో మంది ఇంగ్లండ్ క్రికెటర్లు అయితే అసలు ఏకంగా టోర్నీ నుంచే తప్పుకున్నారు. వార్మప్ మ్యాచ్‌ల సమయానికి లేదా పాకిస్తాన్‌తో జరగనున్న మొదటి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ధోని జట్టుతో చేరినా ఎవరూ అడిగేవారు కాదు. కానీ ముందే జట్టుతో చేరడంతో ధోని కూడా ఈ టీ20 వరల్డ్ కప్‌ను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో తెలుస్తుంది.
కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఈ వరల్డ్ కప్ ప్రతిష్టాత్మకమే. ఎందుకంటే ఈ టోర్నీ తర్వాత కోహ్లీ కెప్టెన్సీకి బై బై చెప్పనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. కాబట్టి ఈ టోర్నీ గెలిస్తే ఒక్క ఐసీసీ టోర్నీ కూడా లేదనే అపవాదు కూడా పోతుంది. కాబట్టి కోహ్లీ కూడా ఈ టోర్నీ గెలవడానికి తన సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తాడు.
Also Read: ఐపీఎల్ ఫైనల్ ముందు ధోనీ నేర్పిన వ్యాపార పాఠమిది! ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా
Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?