IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?
యూఏఈలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తర్వాతి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్లు దాదాపు అస్సాం ట్రైన్ ఎక్కేసినట్లే..
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆదివారం(అక్టోబర్ 31వ తేదీ) జరగనున్న సూపర్ 12 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కానీ ఓడిపోతే భారత్ దాదాపు ఇంటి బాట పట్టినట్లే.. సెమీస్ అవకాశాలు 99 శాతం గల్లంతయినట్లే..
భారత్ ఉన్న సూపర్ 12 గ్రూప్-2లో టీమిండియాతో పాటు పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా ఉన్నాయి. వీటిలో ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలను తీసేస్తే బలమైన జట్లు భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ మాత్రమే. ఈ జట్లలో పాకిస్తాన్ ఇప్పటికే భారత్, న్యూజిలాండ్‌లపై విజయం సాధించేసింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలతో పాక్ తలపడనుంది. వీటిలో ఆఫ్ఘనిస్తాన్ తప్ప మిగతా జట్ల నుంచి సంచలనాలు ఆశించలేం. దీంతో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు లేదా ఐదు విజయాలతో పాకిస్తాన్ సెమీస్‌కు చేరిపోయే అవకాశం ఉంది.
ఇక మిగిలిన బలమైన జట్లు భారత్, న్యూజిలాండ్. ఈ రెండు జట్లూ ఇప్పటికే పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాయి. అక్టోబర్ 31వ తేదీన ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ విజేతకు మాత్రమే రెండో సెమీస్ బెర్త్ లభించే అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాతి మూడు మ్యాచ్‌లూ చిన్న జట్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఓడిపోయిన జట్టుకు అవకాశం లభించాలంటే కేవలం పక్క జట్ల ఫలితాల మీదనే కాదు.. సంచలనాల మీద ఆధారపడాల్సిన దుస్థితి ఎదురవుతుంది.
కాబట్టి భారత్‌కు ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ గెలవాల్సిందే. ఆ తర్వాత సంచలనాలు నమోదు కాకుండా చూసుకుంటే చాలు.. సెమీస్‌కు చేరడం నల్లేరు మీద నడకే. అయితే గత కొద్దికాలంగా న్యూజిలాండ్ మీద మన రికార్డు అంత బాగా లేదు. ఐసీసీ ఈవెంట్లలో 2003 తర్వాత మనం న్యూజిలాండ్‌ను ఓడించిందే లేదు.
2007 టీ20 వరల్డ్ కప్, 2016 టీ20 వరల్డ్ కప్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్‌లో భారత జట్టుపై న్యూజిలాండ్ విజయాలు సాధించింది. అయితే ఈ టీ20 వరల్డ్‌కప్‌లో అలాంటి సెంటిమెంట్లు బ్రేక్ అవుతున్నాయి. వెస్టిండీస్‌పై గెలిచి ఇంగ్లండ్, భారత్‌పై గెలిచి పాకిస్తాన్.. ఈ తరహా సెంటిమెంట్‌లను బ్రేక్ చేశాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి.. సెమీస్ వైపు అడుగేసేందుకు అవకాశం ఉంది.
భారత జట్టు పేపర్‌పై చాలా బలంగా ఉంది. రోహిత్, రాహుల్, విరాట్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా భువీ, షమీ, బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్లతో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజాలు ఉండనే ఉన్నారు. అయితే భువీ గత కొంతకాలంగా ఫాంలో లేక ఇబ్బంది పడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ప్రస్తుతం బౌలింగ్ వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. దీంతో వీరిద్దరిలో ఒకరి స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. శార్దూల్ ఐపీఎల్‌లో విశేషంగా రాణించాడు. దీంతోపాటు అతనికి కాస్తో కూస్తో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది.
ఇక న్యూజిలాండ్ కూడా బలంగానే ఉంది. మార్టిన్ గుప్టిల్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే వంటి టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్ టీంలో ఉన్నారు. డారిల్ మైకేల్, జిమ్మీ నీషం, గ్లెన్ ఫిలిప్స్, టిం సీఫెర్ట్‌లు కూడా మంచి బ్యాట్స్‌మెన్లే. టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్డ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా న్యూజిలాండ్ జట్టులో ఉన్నారు. కాబట్టి ఈ పోరు కచ్చితంగా ఆసక్తికరంగా ఉండనుంది.
Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?
Also Read: IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?
Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?