Watch Video: పొట్టి ప్రపంచ కప్ విజయాన్ని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసిన ఆసీస్.. షూలో బీర్ పోసుకుని తాగుతూ!
తమకు 14 ఏళ్లు అందని ద్రాక్షగా మారిన పొట్టి ప్రపంచ కప్ ను సగర్వంగా ముద్దాడింది ఆసీస్ జట్టు. మాథ్యు వేడ్, స్టోయినిస్‌లు షూస్ (బూట్ల)లో మద్యం పోసుకుని తాగుతూ ఎంజాయ్ చేశారు.
గత కొన్నేళ్లుగా మెగా టోర్నీలలో చతికిల పడుతున్న ఆస్ట్రేలియా జట్టు మరోసారి సత్తా చాటింది. తమకు 14 ఏళ్లు అందని ద్రాక్షగా మారిన పొట్టి ప్రపంచ కప్ ను సగర్వంగా ముద్దాడింది ఆసీస్ జట్టు. 2007లో మొదటి టీ20 వరల్డ్ కప్ జరగగా.. ఒక్క ట్రోఫీ కోసం వారు చేసిన ప్రయత్నం ఆదివారం ఫలించింది. దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటిసారి ఫైనల్‌కు చేరుకున్న న్యూజిలాండ్‌కు నిరాశే ఎదురైంది.
తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలవడంతో ఆసీస్ ఆటగాళ్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ దేశానికి తొలిసారి పొట్టి ప్రపంచ కప్ అందించడంతో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది ఆసీస్ జట్టు. వారి ఆనందం మరీ పిక్స్‌కు వెళ్లింది. ఏకంగా ఇద్దరు క్రికెటర్లు కాళ్లకు వేసుకునే షూ(బూట్ల)లో మద్యం పోసుకుని తాగారంటే వారు కివీస్‌పై ఫైనల్ విజయాన్ని ఎంతలా ఆస్వాదించారో చెప్పడానికి ఇది నిదర్శనం. మిగతా ఆటగాళ్లు నార్మల్‌గానే డ్రింక్స్ తాగుతూ తమ తొలి పొట్టి ప్రపంచ కప్ విజయాన్ని ఆస్వాదించారు.
Also Read: కివీ రెక్కలు విరిచిన కంగారూలు.. మొదటిసారి కప్పు కొట్టిన ఆసీస్
How's your Monday going? 😅#T20WorldCup pic.twitter.com/Fdaf0rxUiV
— ICC (@ICC) November 15, 2021
మొదట మాథ్యూ వేడ్ తన కాలి షూ తీసి అందులో బీర్ పోసుకుని తాగాడు. ఆ వెంటనే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆసీస్ కీలక ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ సైతం అదే షూస్‌లో బీర్ పోసుకుని తాగుతూ పొట్టి ప్రపంచ కప్ విజయాన్ని చెప్పలేనంతగా ఎంజాయ్ చేశాడు. కివీస్‌పై 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సెలబ్రేట్ చేసుకున్న వీడియోను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. మాథ్యూ వేడ్, స్టోయినిస్ బీరు వినూత్నంగా తాగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించి తొలిసారిగా పొట్టి ప్రపంచ కప్ విజేతగా అవతరించింది. తమ జట్టుకు తొలిసారి టీ20 వరల్డ్ కప్ అందించాలనుకున్న కేన్ విలియమ్సన్ కల మరోసారి కలగానే మిగిలిపోయింది. కివీస్ జట్టు 2015, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. తాజాగా కేన్ విలియమ్సన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. కివీస్ బౌలర్లు తేలిపోవడంతో ఓటమి తప్పలేదు.
Also Read: AUS Vs NZ: దుబాయ్ స్టేడియంలో సెంటిమెంట్ ఇదే.. 17 మ్యాచ్‌ల్లో 16 సార్లు.. కేవలం చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే!
Also Read: T20 World Cup 2021: మీమ్ క్రియేటర్లకు షాక్..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!