Betting App Scam News: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్.. మాజీ క్రికెటర్ రైనాకు ఈడీ సమన్లు.. విచారణకు రంగం సిద్దం..
బెట్టింగ్ యాప్ దందా ఎన్నో జీవితాలను అల్లకల్లోలం చేసింది. బెట్టింగ్ పై నిషేధం ఉన్నప్పటికీ, వివిధ రూపాల్లో బెట్టింగ్ ను యాప్ ల ద్వారా నిర్వహిస్తున్నారు. దీనికి సెలబ్రిటీలు కూడా ప్రచారం చేశారు.

Suresh Raina Latest News: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు షాక్ తగిలింది. బెట్టింగ్ ప్రమోషన్లకు సంబంధించి ఈడీ నుంచి అతనికి సమన్లు అందాయి. బుధవారం ఆఫీస్ కు హాజరు కావాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది నుంచి వేల కోట్ల రూపాయలను దోచుకుని, మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై ఆరోపణలు ఉన్నాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్ లను ఎప్పటి నుంచో నిషేధించింది. అయితే పలు మార్గాల ద్వారా ఈ యాప్ లు వినియోగ దారులకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ కల్పించిన విషయమై ఇప్పటికే రానా దగ్గుబాటికి తాజాగా ప్రశ్నించారు. అంతకుముందు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవర కొండ, లక్ష్మీ మంచు తదితరులకు సమన్లు పంపినట్లు తెలుస్తోంది. సరోగేట్ యాడ్ల ద్వారా ఈ బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Suresh Raina has been reportedly asked by ED to depose before the agency on August 13 for questioning in an illegal betting case linked to an app named 1xBet.#SureshRaina #CricketTwitter pic.twitter.com/EN3L181uB2
— InsideSport (@InsideSportIND) August 12, 2025
వేల కోట్ల మార్కెట్..
బెట్టింగ్ దందా దేశవ్యాప్తంగా వేళ్లునూకోవడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెలలలోనే ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్ సైట్లలో 1.6 బిలియన్ విసిట్లు నమోదు కావడం విశేషం. ఇండియాలో ఆన్ లైన్ బెట్టింగ్ మార్కెట్ విలువ వంద మిలియన్ డాలర్లకు పైబడి ఉంటుందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రతి ఏటా పన్నుల ఎగవేసి, 27వేల కోట్లకుపైగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు పేర్కొంటున్నారు. బెట్టింగ్ యాప్ దందాపై మంగళవారం దేశంలోని 15 చోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, మధురై, సూరత్ తదితర ప్రదేశాల్లో ఈ దాడులు జరిగాయి. పరి మ్యాచ్ అనే బెట్టింగ్ యాప్ దందాకు సంబంధించి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రివేన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈ విచారణ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కోట్లాది మంది..
ఈ బెట్టింగ్ దందాలో కోట్లాది మంది భారతీయులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పరోక్షంగా 22 కోట్ల మందికిపైగా ఈ బెట్టింగ్ రాకెట్ ప్రభావానికి గురయ్యారని, 11 కోట్ల మంది రెగ్యులర్ గా బెట్టింగ్ యాప్ లో విసిట్స్ చేస్తున్నట్లు పలు విధాలుగా సేకరించిన సర్వేల్లో నమోదైనట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ, బెట్టింగ్ దందా వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు చైతన్య పరిచేందుకు సోషల్ మీడియాలో వివిధ రకాల క్యాంపెయిన్ల కూడా నడుస్తున్నాయి. ఇక బెట్టింగ్ దందా ద్వారా సంపాదించిన సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు వెళుతున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల వివిద అకౌంట్లకు తరలించి, నగదు రూపంలో ఉప సంహరణ జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.





















