Shane Warne Death: ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మృతి - గుండెపోటే కారణమా?
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ శుక్రవారం మరణించారు. మృతికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.
ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ (52) శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందాడు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మృతికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. థాయ్‌ల్యాండ్‌లో ఆయన మరణించారు.
థాయ్‌ల్యాండ్‌లోని కోహ్ సముయ్ ప్రాంతంలోని ఒక విల్లాలో ఆయన ఉన్నారు. దీనిపై వార్న్ మేనేజర్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ‘తన విల్లాలో వార్న్ అచేతన స్థితి ఉన్నారు. వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు.’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
‘ఈ సమయంలో ఆయన కుటుంబం తమకు ప్రైవసీని ఇవ్వాల్సిందిగా కోరింది. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తాం.’ అని తెలిపారు. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ రాడ్ మార్ష్ (74) చనిపోయిన 24 గంటల్లోపే షేన్ వార్న్ కూడా మృతి చెందడం ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదాన్ని నింపింది.
ప్రపంచ బౌలర్లలో షేన్ వార్న్ ఒక లెజెండ్. మొత్తంగా 145 టెస్టు మ్యాచ్‌ల్లో 708 వికెట్లను ఆయన పడగొట్టారు. ఇది ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో రెండో అత్యధికం. 800 వికెట్లతో ముత్తయ్య మురళీధరన్ మొదటి స్థానంలో నిలవగా... జేమ్స్ అండర్సన్ (640), అనిల్ కుంబ్లే (619), గ్లెన్ మెక్‌గ్రాత్ (563) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
ఇక వన్డేల్లో షేన్ వార్న్ 194 మ్యాచ్‌ల్లో 293 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో కూడా ముత్తయ్య మురళీధరనే మొదటి స్థానంలో ఉన్నాడు. 350 మ్యాచ్‌ల్లో 534 వికెట్లను ముత్తయ్య మురళీధరన్ దక్కించుకున్నాడు. వార్న్ ఎక్కువ వన్డేలు ఆడకపోవడంతో ఈ ఫార్మాట్లో తనకు ఎక్కువ వికెట్లు దక్కలేదు.
View this post on Instagram