Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్
త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది.
Sakshi Malik: ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో హాంగ్జౌ (చైనా) వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా క్రీడలలో పాల్గొనేందుకు గాను భాతర స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ఎలాంటి ట్రయల్స్ లేకుండానే నేరుగా పంపాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) అడ్ హక్ ప్యానెల్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. దీనిపై పలువురు ఔత్సాహిక, యువ రెజ్లర్లు, వారి తల్లిదండ్రులతో కలిసి భారత ఒలింపిక్ సంఘం ఎదుట ధర్నాకు దిగారు. తాజాగా ఈ వివాదంపై మరో స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ స్పందించింది.
తాజాగా ఆమె ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం రెజ్లర్ల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికే ఇలా చేస్తోందని, తనను కూడా ట్రయల్స్ లేకుండా పంపుతామని చెప్పినా తాను మాత్రం అందుకు ఒప్పుకోలేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు ట్విటర్‌లో ఓ ట్వీట్‌తో పాటు వీడియో కూడా విడుదల చేస్తూ.. ‘కేంద్ర ప్రభుత్వం రెజ్లర్ల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికే ఇలా (ట్రయల్స్ లేకుండా నేరుగా పంపించడం) చేస్తోంది. నేనైతే ట్రయల్స్ లేకుండా ఎప్పుడూ బరిలోకి దిగను. ఈ విధానాన్ని నేను అస్సలు సపోర్ట్ చేయను. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరిపై నేను చాలా ఆవేదన చెందా. ట్రయల్స్ తేదీలను పొడిగించాలని మేం ఇదివరకే కోరాం..’ అని తెలిపింది.
అంతేగాక..‘ఆగస్టు 10 వరకూ ట్రయల్స్‌ను పొడిగించాలని మేం కోరిన దానికి అంగీకరించింది. అందుకే మేం విదేశాలలో ఉన్న మా సన్నాహక శిబిరాలకు వచ్చాం. కానీ రెండు వెయిట్ కేటగిరీలలో ఇద్దరు రెజ్లర్లను నేరుగా ఆసియా క్రీడలకు పంపించాలని నిర్ణయించింది. నన్ను కూడా ఎలాంటి ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడలకు పంపుతామని ఆఫర్ చేశారు. కానీ నేను మాత్రం దానికి అంగీకరించలేదు. నాకు ట్రయల్స్‌లో సెలెక్ట్ కాకుండా నేరుగా ఆడాలని లేదు...’అని వీడియోలో చెప్పుకొచ్చింది.
కాగా రెండు నెలల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద.. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ చేసిన పోరాటంలో వినేశ్, భజరంగ్, సాక్షి మాలిక్‌లు ముందున్న విషయం తెలిసిందే. వీరిలో వినేశ్, భజరంగ్‌లకు ట్రయల్స్ లేకుండా నేరుగా ఆసియా క్రీడలకు పంపడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా సాక్షి వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉండటం చర్చనీయాంశమైంది.
— Sakshee Malikkh (@SakshiMalik) July 20, 2023
ఇదిలాఉండగా వినేశ్, భజరంగ్‌లను నేరుగా ఆసియా క్రీడలకు పంపిస్తుండటం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అడ్ హక్ ప్యానెల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు రెజ్లర్లు, వాళ్ల కుటుంబాలు కలిసి ఐవోఏ ముందు ఆందోళనకు దిగాయి. ఇక అండర్ - 23 ఆసియా ఛాంపియన్ సుజీత్ కల్కల్, అండర్ - 20 వరల్డ్ ఛాంపియన్ అంతిమ్ పంఘల్ న్యాయ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. వినేశ్, భజరంగ్‌ల ఎంపికపై ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాధితుల తరఫున వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించాలని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన ఈ ఇద్దరినీ నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేశారో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial