Team India 'RRR' Glimpse: టీమ్‌ఇండియా క్రికెట్ చరిత్రలో సరికొత్తగా 'RRR' శకం..! ఎవరీళ్లు? ఏం చేస్తారు?
ఐసీసీ టీ20 ప్రపంచకప్పుల్లో చరిత్ర సృష్టించేందుకు టీమ్‌ఇండియా ట్రిపుల్ ఆర్ సిద్ధమైంది. స్థిత ప్రజ్ఞుడిగా ఒకరు, స్థిరమైన నాయకుడిగా మరొకరు, భవిష్యత్తు సారథిగా ఇంకొకరు అదరగొట్టేందుకు తహతహలాడుతున్నారు.
భారత క్రికెట్ మరోసారి సంధి దశకు చేరుకుంది. విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి శకం ముగిసింది. ద్వైపాక్షిక సిరీసుల్లో అద్భుతాలు చేసిన ఈ ద్వయం ఐసీసీ టోర్నీల్లో మాత్రం అంచనాలు అందుకోలేదు. ఆ కరవు తీర్చేందుకు.. అభిమానుల ఆశలను నిలబెట్టేందుకు.. అందరినీ అలరించేందుకు మన ముందుకు రాబోతోంది 'RRR' త్రయం!
ఎవరీ RRR?
క్రికెట్ బృంద క్రీడ. కొన్నిసార్లు ఒక్కరు బాగా ఆడినా జట్టు గెలుస్తుంది. కొన్నిసార్లు అందరూ కష్టపడ్డా ఓటమి ఎదురవుతుంది. అందుకే క్రికెట్‌ను క్రుయల్ గేమ్ అనీ అంటుంటారు. ఇందులో అద్భుతాలు చేయాలంటే చిన్న చిన్న మూమెంట్స్‌ను గెలవాలి. అప్పుడే భారీ విజయం దరిచేరుతుంది. కోరుకున్న ట్రోఫీలు ముద్దాడే అవకాశం దొరుకుతుంది. కానీ ఆ సందర్భాలను సృష్టించాల్సిందీ, ఆనక ఒడిసిపట్టాల్సిందీ, చివరికి గెలుపు అందించి తీరాల్సిందీ కోచ్, కెప్టెన్, వైస్ కెప్టెన్ అనే ముగ్గురు. వారే రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్!
ఫస్ట్ R రాహుల్ ద్రవిడ్
టీమ్‌ఇండియాకు కొన్నేళ్ల తర్వాత స్థితప్రజ్ఞుడైన కోచ్ దొరికాడు! అతడే రాహుల్ ద్రవిడ్. మిస్టర్ డిపెండబుల్‌గా జట్టుకు అపూర్వమైన విజయాలను అందించి ఘోర ఓటములను తప్పించాడు. క్రికెట్ మైదానంలో ప్రతి అడుగుతో ఆయనకు పరిచయం ఉంది. క్రికెట్ పుస్తకంలోని ప్రతి షాటు ఆయన అమ్ముల పొదిలోని అస్త్రమే. మ్యాచ్ పరిస్థితులను ఆయన కన్నా అద్భుతంగా అధ్యయనం చేసే మరొకరు లేరు! ఈ తరం టీ20 ఫార్మాట్‌పైనా అపార అనుభవం ఉంది. ఆటగాడిగా, కెప్టెన్‌గా జట్టుకు విజయాలు అందించిన ద్రవిడ్ కోచ్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అండర్ 19, భారత్ ఏ, ఐపీఎల్ జట్లకు కోచింగ్ ఇచ్చాడు. షాడో టూర్లు ప్రవేశపెట్టి యువకులను తీర్చిదిద్దాడు. ఇప్పటి జట్టులో చాలామందికి ఆయనతో పరిచయం, చనువు ఉన్నాయి. అందుకే ద్రవిడ్ ఇప్పుడు అత్యంత కీలకం.
సెకండ్ R రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ రేసులో ముందున్న ఆటగాడు రోహిత్ శర్మ. పొట్టి క్రికెట్లో సారథిగా అతడికి అద్భుతమైన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఐదుసార్లు ట్రోఫీ అందించిన మొనగాడు అతడు. నాయకత్వంలో ఎంఎస్ ధోనీని తలపిస్తాడు. జట్టులోని ఆటగాళ్లను తనకన్నా ఎక్కువగా విశ్వసిస్తాడు. ప్రదర్శన బాగాలేనప్పుడు వెన్నుతట్టుతాడు. కుర్రాళ్లను సరదాగా బయటకు తీసుకెళ్లి డిన్నర్లు చేస్తుంటాడు. మ్యాచ్ పరిస్థితులను సరిగ్గా అధ్యయనం చేస్తూ అవసరమైనప్పుడు బౌలింగ్‌లో మార్పులు చేస్తాడు. బుమ్రాస్త్రాన్ని అతడికన్నా బాగా సంధించేవారు లేరు. అటు సీనియర్లు ఇటు జూనియర్ల మేళవింపుతో విజయాలు సాధించగల నేర్పు అతడి సొంతం. విరాట్ కోహ్లీ పదేపదే జట్లను మారిస్తే రోహిత్ నిలకడగా అవకాశాలిచ్చి నమ్మకం నింపుతాడు. అందుకే కెప్టెన్‌గా అతడు 2021 టీ20 ప్రపంచకప్, 2023లో వన్డే ప్రపంచకప్ అందించగలడు!
థర్డ్ R రాహుల్
డ్రస్సింగ్ రూమ్‌లో రచించిన వ్యూహాలను మైదానంలో పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత వైస్ కెప్టెన్‌పై ఎక్కువగా ఉంటుంది. కెప్టెన్‌కు అతడు అన్ని విధాలా సహాయకారిగా ఉండాలి. ఆటగాళ్లకు, నాయకుడికి మధ్య వారధిగా ఉండాలి. బహుశా ఆ బాధ్యతలను దాదాపుగా కేఎల్ రాహులకే అప్పగిస్తారని సమాచారం. మరికొన్ని రోజుల్లో జరిగే న్యూజిలాండ్ సిరీసుకు అతడే సారథ్యం వహిస్తాడనీ అంటున్నారు. ఒకవేళ రోహిత్‌కు అవకాశం లేకపోతే రాహులే నాయకుడని టాక్. ఓపెనర్‌గా విధ్వంసాలు సృష్టించే రాహుల్ తనను తాను మలుచుకున్న తీరు అద్భుతం. ఒకే బంతికి రెండు షాట్లు ఆడే ప్రయత్నంలో మానసికంగా ఇబ్బందులు పడి.. ఆ వేదన నుంచి ఫీనిక్స్‌లా ఎగిశాడు. ఇప్పుడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. అతడిలోని నాయకత్వ లక్షణాలను చాలామందికి నచ్చాయి. ట్రిపుల్ ఆర్‌లో ముఖ్యమైన రాహుల్ భవిష్యత్తు నాయకుడు అనడంలో సందేహం లేదు!
Also Read: T20 World Cup 2021: ఘోరవైఫల్యానికి ఐదు కారణాలు.. ఓటమి నేర్పిన పాఠాలు ఇవే!
Also Read: Ravi Shastri: కొత్త ఐపీఎల్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి.. ఏ జట్టుకంటే?
Also Read: NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్ ఔట్.. సెమీస్‌కు కివీస్