Ravi Shastri: కొత్త ఐపీఎల్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి.. ఏ జట్టుకంటే?
వచ్చే సంవత్సరం ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనున్న అహ్మదాబాద్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని నియమించనున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్‌లో వచ్చే సంవత్సరం రెండు కొత్త జట్లు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి రవిశాస్త్రి కోచ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు భారత జట్టుకు పనిచేసిన ప్రధాన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ కూడా అహ్మదాబాద్‌కు పని చేయనున్నట్లు తెలుస్తోంది.
కొత్త ఐపీఎల్ జట్ల యజమానులు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న కోచ్‌లను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే రవిశాస్త్రి ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టారు. కప్ అయిపోయాక తన నిర్ణయం చెబుతామని ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. రవిశాస్త్రి ఐపీఎల్ టీంకు కోచ్‌గా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రవిశాస్త్రికి కామెంటేటర్‌గా మంచి పేరుంది. కోచ్ పదవిలోకి రాకముందు 20 సంవత్సరాల పాటు అతను క్రికెట్ కామెంటేటర్‌గా విధులు నిర్వర్తించారు.
ఐపీఎల్ జట్టుకు కోచ్‌గా ఉంటే రవిశాస్త్రికి కామెంటరీ చెప్పే అవకాశం ఉండదు. ప్రస్తుతం బీసీసీఐ కాన్‌ఫ్లిక్ ఆఫ్ ఇంట్రస్ట్ నియమాల ప్రకారం.. ఒక జట్టుకు కోచ్‌గా ఉంటూ మరో బ్రాడ్‌కాస్టర్‌తో ఒప్పందం కుదుర్చుకోకూడదు. అయితే గతంలో వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా ఉంటూనే.. కామెంటరీ కూడా చెప్పారు. ప్రస్తుతం రవిశాస్త్రికి స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ వంటి పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు ఉన్నాయి.
అయితే అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రమోటర్లు అయిన సీవీసీ క్యాపిటల్స్ టీమ్ కల్చర్‌ను మొదటి నుంచి ఏర్పాటు చేయాలనుకుంటున్నాయి. రిటెన్షన్ నిబంధనలు కూడా ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రొఫెషనల్స్ ఉండాలని జట్టు అనుకుంటోంది. దీంతోపాటు ఫ్రాంచైజీకి సీఈవో, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌ను కూడా తీసుకోవాలని సీవీసీ క్యాపిటల్స్ అనుకుంటోంది.
రవిశాస్త్రి 2014లో భారత జట్టుకి కోచ్‌గా వచ్చాడు. ఈ ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి, అరుణ్, శ్రీధర్ కూడా జట్టును వీడాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ హెడ్ కోచ్‌గా నియమించింది.