Rohit Sharma Update: లక్కంటే హిట్‌మ్యాన్‌దే! టీమ్‌ఇండియా 1000 వన్డేకు సారథ్యం! ఈ Stats చూస్తే ఆశ్చర్యమే!
రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకోబోతున్నాడు. భారత్ ఆడే 1000వ వన్డేకు నాయకత్వం వహించబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఇన్ని మ్యాచులు ఆడిన జట్టు మరొకటి లేదు.
కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకోబోతున్నాడు. భారత జట్టు ఆడే 1000వ వన్డేకు నాయకత్వం వహించబోతున్నాడు. అన్నీ సవ్యంగా జరిగితే టీమ్‌ఇండియా స్వర్ణయుగపు క్రికెట్‌కు అతడు అంకురార్పరణ చేయనున్నాడు.
టీమ్‌ఇండియా ఇప్పటి వరకు 999 వన్డేలు ఆడింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఇన్ని మ్యాచులు ఆడిన జట్టు మరొకటి లేదు. వెయ్యో మ్యాచ్ ఆడబోతున్న తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోనుంది. 1974లో అజిత్ వాడేకర్ నాయకత్వంలో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా తొలి వన్డే ఆడింది. అక్కడి నుంచి మనం వెనుదిరిగి చూసిందే లేదు. రెండు ప్రపంచకప్‌లు సాధించాం. అత్యు్త్తమ జట్టుగా ఎదిగాం. విలువైన క్రికెటర్లను ప్రపంచానికి అందించాం. క్రికెట్‌కు ఈ భూమ్మీదే అతిపెద్ద మార్కెట్‌ను సృష్టించాం.
భారత వందో వన్డేకు కపిల్‌దేవ్ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాపై జరిగింది. 200 వన్డేకు మహ్మద్ అజహరుద్దీన్, 300 మ్యాచుకు సచిన్ తెందూల్కర్, 400 వన్డేకు మహ్మద్ అజహరుద్దీన్ నాయకత్వం వహించారు. కీలకమైన 500వ వన్డేకు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చేశాడు. ఈ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్‌పైనే జరిగింది. ఇక 700, 800, 900 వన్డేలకు 'మిస్టర్ కూల్' ఎంఎస్ ధోనీ నేతృత్వం వహించాడు. ముచ్చటగా 1000 వన్డేలో రోహిత్ శర్మ టీమ్‌ఇండియాను ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతేరాలో నడిపించనున్నాడు.
టీమ్‌ఇండియా అరుదైన గణాంకాలు
- ఆడిన వన్డేలు : 999
- గెలిచిన మ్యాచులు : 518 (51.85%)
- ఓడిన మ్యాచులు : 431 (43.14%)
- టై అయిన మ్యాచులు : 9
- ఫలితం తేలని మ్యాచులు : 41
- ఆడిన క్రికెటర్లు : 242
- అత్యధిక వ్యక్తిగత స్కోరు : 264 (రోహిత్ శర్మ)
- అత్యధిక పరుగుల క్రికెటర్ : 18,426 (సచిన్ తెందూల్కర్)
- అత్యుత్తమ బ్యాటింగ్ సగటు : 58.78 (విరాట్ కోహ్లీ)
- అత్యు్త్తమ బౌలింగ్ : 6/4 (స్టువర్ట్ బిన్నీ)
- అత్యధిక వికెట్లు : 334 (అనిల్ కుంబ్లే)
- ఎక్కువ డిస్మిసల్స్ : 438 (ఎంఎస్ ధోనీ, స్టంపులు, క్యాచులు కలిసి)
- అత్యధిక జట్టు స్కోరు : 418-5 (వెస్టిండీస్‌పై)
- అత్యల్ప జట్టు స్కోరు : 54 (శ్రీలంక చేతిలో)
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్ ఫిబ్రవరి 2న అహ్మదాబాద్ చేరుకుంటుంది. 6, 9, 11న మొతెరా వేదికగా మూడు వన్డేలు జరుగుతాయి. 16, 18, 20న కోల్‌కతా వేదికగా టీ20లు నిర్వహిస్తారు. ఇందుకోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. మూడు రోజుల క్వారంటైన్ తర్వాత సన్నాహక శిబిరం ఉంటుంది. ఆ తర్వాత మ్యాచులు మొదలవుతాయి.
Also Read: David Warner Daughter: డేవిడ్ వార్నరే కాదు తన కూతురు కూడా.. ‘తగ్గేదే లే’!