Ravindra Jadeja Surgery: జడ్డూ సర్జరీ సక్సెస్! అతి త్వరలో వచ్చేస్తా అంటున్న టీమ్‌ఇండియా చిరుత
Ravindra Jadeja Surgery: టీమ్‌ఇండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి శస్త్ర చికిత్స విజయవంతమైంది. పదేపదే అతడు మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
Ravindra Jadeja Surgery: టీమ్‌ఇండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి శస్త్ర చికిత్స విజయవంతమైంది. పదేపదే అతడు మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే బీసీసీఐ అతడికి శస్తచికిత్స చేయించింది. తాను అతి త్వరలోనే తిరిగొస్తానంటూ జడ్డూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేశాడు.
ఆసియా కప్ 2022 సూపర్ 4 దశకు ముందు జడ్డూ టోర్నీకి దూరమయ్యాడు. గాయం కారణంగా అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకుంటున్నామని జట్టు యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు గాయపడిన మోకాలే మళ్లీ గాయపడిందని తెలిపింది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా బీసీసీఐ అతడిని తప్పించింది. వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది. వారి సూచన మేరకు బీసీసీఐ శస్త్ర చికిత్స చేయించింది.
'శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఇందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వారు ఎంతోమందున్నారు. బీసీసీఐ, సహచరులు, సహాయ సిబ్బంది, ఫిజియోలు, వైద్యులు, అభిమానులు ధన్యవాదాలు. నేను అతి త్వరలోనే రిహబిలిటేషన్‌కు వెళ్తాను. సాధ్యమైనంత వేగంగా తిరిగొస్తాను. మీ విషెస్‌కు కృతజ్ఞతలు' అని జడ్డూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. రెండు చిత్రాలు అటాచ్ చేశాడు.
టీమ్‌ఇండియాలో అత్యంత చురుకైన, ఫిట్‌నెస్ ఉన్న ఆటగాడు ఎవరంటే తొలుత గుర్తొచ్చే పేరు రవీంద్ర జడేజా! అలాంటిది ఈ మధ్య కాలంలో ఎక్కువగా గాయపడుతున్నాడు. మైదానంలో చిరుత వేగంతో పరుగెత్తడం, బంతిని అందుకొని వేగంగా వికెట్లకు గురిపెట్టడం అతడి స్పెషాలిటీ. అందుకే అతడి వైపు బంతి వెళ్తే బ్యాటర్లు పరుగు తీసేందుకు జంకుతుంటారు. ఇంక గాల్లో బంతి ఉంటే ఎంత రిస్క్ చేసేందుకైనా వెనుకాడడు. పరుగెత్తుకు వెళ్లి క్యాచ్ అందుకుంటాడు.
అలాంటి జడ్డూ ఐపీఎల్ 15వ సీజన్‌కు ముందు గాయంతో సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. చెన్నైకి ఆడుతుండగానే గాయంతో మధ్యలోనే వెళ్లిపోయాడు. మోకాలి గాయంతోనే జులైలో వెస్టిండీస్ సిరీసుకు దూరమయ్యాడు. మళ్లీ ఫిట్‌నెస్ నిరూపించుకొని ఆసియాకప్‌కు ఎంపికయ్యాడు. పాకిస్థాన్, హాంకాంగ్ మ్యాచులో మెరుగైన ప్రదర్శనే చేశాడు. దాయాదితో పోరులో 148 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో స్థానంలో వచ్చిన అతడు 29 బంతుల్లో 35 పరుగులు చేశాడు. చకచకా బౌలింగ్ చేశాడు. ఇక హాంకాంగ్ పోరులో బాబర్ హయత్‌ను ఔట్ చేసి 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చాడు.
శస్త్ర చికిత్స జరగడంతో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు జడ్డూ అందుబాటులో ఉండటంపై సందిగ్ధం నెలకొంది. అతడు పూర్తిగా కోలుకుంటేనే జట్టులోకి వస్తాడు. సాధారణంగా మోకాలి శస్త్ర చికిత్స నుంచి కోలుకోవాడానికి 6-8 వారాలు పడుతుంది. ప్రపంచకప్ సైతం 8 వారాల్లోనే వస్తుండటం గమనార్హం. ఈ నెల్లోనే జట్టు వివరాలను ఐసీసీకి సమర్పించాలి.
View this post on Instagram