Paris Paralympics 2024: తెలుగు పతక దీప్తి, అలుపెరగని పరుగుకు దక్కిన కాంస్య కీర్తి
Deepthi Jeevanji: పారాలింపిక్స్‌లో వరంగల్ క్రీడాకారిణి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా నిలిచింది.
Telangana Athlete Deepthi Jeevanji Wins Bronze Medal in Paralympics : పారిస్ ఒలింపిక్స్(Paris Paralympics 2024) లో తెలుగమ్మాయి సత్తా చాటింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలుగు ఖ్యాతిని ఘనంగా చాటిచెప్పింది. వరల్డ్ రికార్డు సృష్టించి మరీ పతక మోత మోగించింది. పారాలింపిక్స్ మహిళల 400మీటర్ల టీ20 విభాగంలో 20 ఏళ్ల తెలుగు అథ్లెట్ దీప్తి జీవాంజి(Deepthi Jeevanji) 55.82 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని(Bronze Medal) కైవసం చేసుకుంది. గతంలో 55.07 సెకన్లతో ప్రపంచ రికార్డు సృష్టించిన దీప్తి... స్వర్ణ పతకం సాధిస్తుందనే అంచనాలతో పారిస్ పారాలింపిక్స్‌లో బరిలోకి దిగింది. ఈ అంచనాలను నిజం చేస్తూ హీట్స్‌లో 55.45 సెకన్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే స్వర్ణ పతకం సాధిస్తుందన్న అంచనాలు నెలకొన్నా దీప్తికి ఆశించిన ఫలితం అయితే రాలేదు. కానీ కాంస్య పతకంతో మెరిసినా దీప్తి పోరాటం మాత్రం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
Read Also: Indian Cricket: ఈ తండ్రి-కొడుకుల అరుదైన రికార్డులు మీకు తెలుసా
ఆరంభం అదిరినా..
దీప్తి జీవాంజి ఫైనల్లో పోరాటాన్ని కాస్త నెమ్మదిగా ప్రారంభించింది. ఏడో లేన్ నుంచి రేస్ ప్రారంభించిన దీప్తి... ఆరంభంలో కాస్త నెమ్మదిగా కదిలింది. కానీ మధ్యలో వేగం పెంచి లక్ష్యం దిశగా దూసుకుపోయింది. చివర్లో ఉత్కంఠ మరింత పెరిగింది. అనూహ్యంగా వెనకపడిన దీప్తి అసలు పతకమైనా గెలుస్తుందా అన్న ఉత్కంఠ అందరిలో కలిగింది. కానీ మరింత ఊపందుకున్న దీప్తి... అమెరికా రన్నర్ బ్రియానా క్లార్క్‌ను వెనక్కి నెడుతూ మూడో స్థానంలో నిలిచింది. దీప్తి 55.82 సెకన్లతో రేస్‌ను ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన యులియా షులియర్ 55.16సెకన్లతో గోల్డ్ మెడల్‌ను ఎగరేసుకుపోగా.. తుర్కియేకు చెందిన ఏసెల్ ఒన్‌డర్ 55.23సెకన్లతో రజతం సాధించింది. టోక్యోలో జరిగిన గత పారాలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు ఒక్క పతకం కూడా రాలేదు. కానీ ఈ సారి మాత్రం భారత్‌కు ఈ విభాగంలో ఇప్పటికే మూడు పతకాలు దక్కాయి. ప్రీతిపాల్ ఇప్పటికే రెండు పతకాలు సాధించి సత్తా చాటింది.
Read Also: Pakistan Cricket: ఓ విండీస్! ఓ శ్రీలంక! ఓ పాకిస్థాన్, పతనం దిశగా దాయాది జట్టు
అవమానాలను దిగమింగి....
దీప్తి జీవాంజి పోరాటం ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచింది. అవమానాలను.. అనుమానాలను పటాపంచలు చేస్తూ దీప్తి అంతర్జాతీయ క్రీడా వేదికపై.. అదీ ప్రతిష్టాత్మకమైన పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్ని అందించింది. దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా, కల్లెడ గ్రామం. దీప్తి మానసిక వైకల్యంతో జన్మించడంతో చాలామంది ఆమెను వదిలేయమని తండ్రి యాదగరి.. తల్లి ధనలక్ష్మికి సలహాలు ఇచ్చారు. వ్యవసాయ కూలీలైన ఈ ఇద్దరు పేదరికాన్ని దిగమింగి.. ఎన్నో కష్టాలను ఓర్చుకుని దీప్తిని పెంచి పెద్ద చేశారు. ఆమెను పాఠశాలలో చేర్చినప్పుడు పీఈటీ వెంకటేశ్వర్లు ఆమెలోని అథ్లెట్‌ను గుర్తించి శిక్షణ ఇచ్చాడు. ఆ శిక్షణే ఆమెను ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లింది. 2019లో కోచ్ నాగపురి రమేష్ శిక్షణలో దీప్తి మరింత రాటుదేలింది. దీప్తి ఎంత శ్రమించే తత్వాన్ని గుర్తించిన వెంకటేశ్వర్లు ఆమెను అత్యుత్తమ రన్నర్‌గా తీర్చి దిద్డాడు. ఇప్పుడు పారాలింపిక్స్‌లో పతకం సాధించి అవమానాలు పడ్డ చోటే దీప్తి ప్రశంసలు అందుకుంటోంది.