Top 10 Medal hopefuls for India in Olympics 2024: ఒలింపిక్స్(Olympics)కు మరో రెండు రోజుల సమయమే ఉంది. కోట్లాది మంది క్రీడాభిమానుల ఆశలు మోస్తూ... పతక ఆశలు నెరవేర్చుకోవాలనే తలంపుతో 117మందితో కూడిన భారత బృందం... పారిస్‌లో అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధమైంది. గత విశ్వ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా నుంచి ప్రతీ ఆటగాడిపై ఈ ఒలింపిక్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. గత రికార్డులను కాలగర్భంలో కలిపేస్తూ భారత ఆటగాళ్లు పతకాల పంట పండిస్తారని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన PV సింధు(PV Sindhu ), నీరజ్ చోప్రా(Neeraj Chopra), సాత్విక్-చిరాగ్ శెట్టి(Satwiksairaj Rankireddy and Chirag Shetty), నిఖత్ జరీన్, పురుషుల హాకీ జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఒలింపిక్స్‌లో పతక అవకాశాలు భారీగా ఉన్న 10 ఈవెంట్లపై ఓ కన్నేద్దాం పదండీ...
నీరజ్ చోప్రా
పురుషుల జావెలిన్ త్రో పారిస్ ఒలింపిక్స్ 2024లో స్వర్ణ పతక ఆశలు ఎక్కువగా ఉన్న అథ్లెట్ నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన నీరజ్ మరోసారి పతకాన్ని సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే జర్మనీ, టర్కీలో శిక్షణ పూర్తి చేశాడు. ఈ ఏడాది పావో నుర్మి గేమ్స్‌లో స్వర్ణం సాధించి చోప్రా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. దోహా డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్ 90 మీటర్ల మార్కును అందుకుంటే భారత్ ఖాతాలో స్వర్ణం చేరినట్లే.
పీవీ సింధు
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన పీవీ సింధుపై ఈసారి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ బ్యాడ్మింటన్ స్టార్ మూడో పతకం గెలిస్తే అది చరిత్ర అవుతుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు... ఈ ఒలింపిక్స్‌లో చైనా గోడను ఎలా దాటుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఏడాది సింధు మంచి ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మీరాబాయి చాను
టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కిలోల విభాగంలో రజతం గెలిచిన మీరాబాయి చానుపై ఈ ఒలింపిక్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఒలింపిక్స్ కోసం చాను ఫ్రాన్స్‌లో కఠోర శిక్షణ తీసుకుంది.
మను భాకర్
ప్రముఖ మహిళా షూటింగ్ స్టార్ మను భాకర్ ఈ ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలపై కన్నేసింది. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సహా మూడు వేర్వేరు ఈవెంట్లలో మను భాకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇందులో ఏదో ఒక విభాగంలో భారత్‌కు పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది.
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ పతకంపై ఆశలు రేపుతున్నారు. ఆసియా, కామన్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌తో సహా అనేక టైటిళ్లను గెలుచుకుని ఇప్పటికే సత్తా చాటారు. పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను కూడా సాధించారు. వీరు మరోసారి కోర్టులో గర్జిస్తే భారత్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో పతకం ఖాయమైనట్లే.
వినేష్ ఫోగట్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడికి వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసనలో పాల్గొన్న తర్వాత తన కెరీర్‌ను ఉన్నతంగా ముగించాలని వినేష్ ఫోగట్ లక్ష్యంగా పెట్టుకుంది. గత రెండు ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్ దశలోనే వెనుదిరిగిన ఫోగట్.. ఈసారి మాత్రం పతకం సాధించాలని పట్టుదలతో ఉంది. మహిళల 50-కేజీల విభాగంలో ఆమె పతకం సాధించడం ఖాయంగానే కనిపిస్తోంది.
లవ్లీనా బోర్గోహైన్
బాక్సింగ్ టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన లవ్లీనా పారిస్ ఒలింపిక్స్‌లోనూ ఆశలు రేపుతోంది. 75 కేజీల విభాగంలో పోటీ పడుతున్న లవ్లీనా ఈసారి మరో పతకంపై కన్నేసింది. బోర్గోహైన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచి ఊపు మీద ఉంది. బోర్గోహైన్ ఈ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అమన్ సెహ్రావత్
20 ఏళ్ల అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక పురుష రెజ్లర్. 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్యం, 2023 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. సెహ్రావత్‌పైన పతక ఆశలు భారీగా ఉన్నాయి.
భారత పురుషుల హాకీ జట్టు
పెనాల్టీ-కార్నర్ స్పెషలిస్ట్ హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ మార్గనిర్దేశంలో ఇండియన్ మెన్స్ హాకీ టీం ఒలింపిక్స్‌లో మరో పతకంపై కన్నేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత్.. పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించే అవకాశం ఉంది. కాంస్య పతకాన్ని గెలుచుకున్న జట్టులోని చాలా మంది ఆటగాళ్ళు ప్రస్తుత జట్టులో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బెల్జియం, న్యూజిలాండ్ వంటి బలమైన జట్ల పూల్‌లో భారత్ ఉంది. ఇందులో మెరుగ్గా రాణిస్తే పతకం ఖాయమైనట్లే.