Neeraj Chopra Biography: ఎవరీ నీరజ్ చోప్రా.. అతని కథేంటీ? 12 ఏళ్ల వయస్సులో 90 కిలోలు ఉండేవాడు... పూర్తి బద్ధకస్తుడు... పతకం కోసం ఎలా కష్టపడ్డాడు?
అసలు నీరజ్ చోప్రా ఎవరు? ఏ రాష్ట్రానికి చెందిన వాడు? అతని బయోడేటా ఎంటా అని తెగ వెతికేస్తున్నారు.
విశ్వ క్రీడలు టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో భారత్‌కు చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. అర్హత పోటీలు అందరికంటే ఎక్కువ దూరం ఈటె విసిరి ఫైనల్‌కి అర్హత సాధించే వరకు నీరజ్ చోప్రా గురించి తెలిసిన వాళ్లు చాలా చాలా తక్కువ. అలాంటిది యావత్తు దేశం దృష్టిని ఆకర్షించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటి భారతదేశానికి స్వర్ణ పతకం అందించాడు. దీంతో అందరూ అసలు నీరజ్ చోప్రా ఎవరు? ఏ రాష్ట్రానికి చెందిన వాడు? అతని బయోడేటా ఎంటా అని తెగ వెతికేస్తున్నారు.
హర్యానాలోని పానిపట్ జిల్లా, ఖాంద్రా గ్రామం నీరజ్ చోప్రాది. అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. అతడి కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవించేది. చిన్నప్పుడు నీరజ్‌కు క్రికెట్ అంటే ఇష్టం. చాలా బద్ధకస్తుడు. 12 ఏళ్ల వయస్సుకే అతడు 90కిలోల బరువుండేవాడు. కుటుంబసభ్యులు బరువు తగ్గమని ఎంత చెప్పినా వినేవాడు కాదు. వ్యాయామం, జాగింగ్ చేయమంటే అసలు పట్టించుకునే వాడు కాదు.
అలా కుటుంబసభ్యుల బలవంతం మేరకు నీరజ్ ఓసారి స్థానిక శివాజీ స్టేడియంలో జాగింగ్‌కు వెళ్లాడు. ఆ స్టేడియంలో పలువరు క్రీడాకారులు జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్లు. వారిని బాగా గమనిస్తూ ఉండేవాడు నీరజ్. ఓ సారి స్టేడియంలో జై ఛౌధరీ అనే ఆటగాడు నీరజ్‌కి జావెలిన్ త్రో ఇచ్చి విసరమన్నాడు. 90 కిలోల బరువున్న నీరజ్ సునాయాసంగా 35-40మీటర్లు విసిరేశాడు. దీంతో జై ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి నీరజ్‌కి జావెలిన్ త్రో మీద మనసు పడింది. ఈ క్రీడలో శిక్షణ పొందాలని అనుకున్నాడు.
అప్పుడు సహచర క్రీడాకారులు ఈ ఆటలో రాణించాలంటే ముందు బరువు తగ్గాలి, ఫిట్ నెస్ సాధించాలి అని చెప్పారు. అప్పటి వరకు వ్యాయామం, జాగింగ్ అంటేనే నచ్చని నీరజ్ జావెలిన్ త్రో కోసం అవన్నీ చేయసాగాడు. క్రమంగా బరువు తగ్గాడు. ఆటపై తనకి ఉన్న నిబద్ధతను చూసిన కుటుంబసభ్యులు నీరజ్‌ని ఆ దిశగా ప్రోత్సహించడం ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులున్నా... అతడి శిక్షణకు కావల్సిన సదుపాయాలను ఏర్పాటు చేశారు.
— Neeraj Chopra (@Neeraj_chopra1) May 14, 2021
అలాజజ పంచ్‌కులలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉండి జావెలిన్‌లో శిక్షణ తీసుకున్నాడు నీరజ్. ఒకవైపు చదువుకుంటూనే 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శతో ఆకట్టుకున్నాడు. 2016 నుంచి నీరజ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. పతకాలు, రికార్డులతో కెరీర్లో దూసుకొచ్చాడు. ఆ ఏడాదిలో జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజత గెలిచాడు. వరల్డ్ అండర్ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించాడు. 2018లో గోల్డ్ కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది.
2019 చేదు జ్ఞాపకం
2019వ సంవత్సరం నీరజ్ కెరీర్లో చేదు అనుభవం. భుజానికి గాయం, ఆపరేషన్ కారణంగా ఆ ఏడాది పోటీల్లోనే పాల్గొనలేదు. గాయం నుంచి కోలుకోగానే టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించాలన్న దిశగా అడుగులు వేశాడు. ఇందుకోసం పలు పోటీల్లో పాల్గొన్నాడు. ఫలితంగా విశ్వ క్రీడలకి అర్హత సాధించాడు. గాయం నుంచి కోలుకుని ఒలింపిక్స్‌కి అర్హత సాధించడం ఒక ఎత్తైతే పతకం సాధించేందుకు ఏం చేయాలా అని ఆలోచించాడు. ఈ క్రమంలో JSW స్పోర్ట్స్ ఎక్సలెన్సీ ప్రోగ్రామ్‌లో చోటు దక్కించుకున్న నీరజ్ ఆస్ట్రేలియా కోచ్ గారీ కాల్వర్ట్ దగ్గర శిక్షణ పొందాడు. 23 ఏళ్ల నీరజ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే... యావత్తు దేశం గర్వించేలా స్వర్ణ పతాకం అందుకుని జాతీయ జెండా రెపరెపలాడేలా చేశాడు.
నీరజ్ తల్లి సరోజ్ దేవి గృహిణి. నీరజ్‌కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నీరజ్ చోప్రా.. 24 డిసెంబర్, 1997 లో జన్మించాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు.