ODI World Cup 2023: పాక్‌కు తిప్పలు తప్పవా.. ! అహ్మదాబాద్‌లో స్పిన్ పిచ్
ODI World Cup 2023: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల చూపంతా ఇప్పుడు భారత్-పాక్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ మహా సంగ్రామానికి ఇరు జట్లు అస్తశస్త్రాలతో.. వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్దమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల చూపంతా ఇప్పుడు భారత్-పాక్ మ్యాచ్‌పైనే ఉంది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచుల్లోనూ రెండు విజయాలు సాధించి ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. పాక్ బౌలింగ్ దళానికి.. భారత బ్యాటింగ్ వీరులకు మధ్య ఈ పోరు జరగనుందని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇటు అభిమానులు దాయాదుల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారా అని లెక్కలు వేస్తున్నారు. కోహ్లీ, రోహిత్, రాహుల్‌లతో భీకరంగా ఉన్న భారత బ్యాటింగ్ లైనప్ పాక్‌కు చుక్కలు చూపించడం ఖాయమని భారత క్రికెట్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ పాక్ బౌలర్లు తేలిపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ దాయాది బౌలర్లకు తిప్పలు తప్పవని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మహా సంగ్రామానికి ఇరు జట్లు అస్తశస్త్రాలతో.. వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని భారత్-పాక్ పట్టుదలతో ఉన్నాయి.
అయితే ఇక్కడే ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. భారత్-పాక్ మ్యాచ్ జరిగే గుజరాత్‌లోని అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకే అనుకూలంగా ఉంటే పాకిస్తాన్ బ్యాటర్లకు తిప్పలు తప్పకపోవచ్చు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని పిచ్‌ల కంటే అహ్మదాబాద్ పిచ్ ఎక్కువగా స్పిన్‌కు అనుకూలిస్తుందని మాజీలు అంచనా వేస్తున్నారు.
మొతేరా, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు కొంచెం అనుకూలించాయి. దీనిపై సీమర్లు కొంచెం స్వింగ్ రాబట్టగలిగారు. కానీ అహ్మదాబాద్ పిచ్ పూర్తిగా స్పిన్‌కు అనుకూలమైన పిచ్ అని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడం భారత్‌కు అంత తేలిక కాదు. టీమ్ ఇండియాలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎదుర్కోవడం పాక్ బ్యాటర్లకు తలకుమించిన భారం కానుంది.
ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశారు. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌కు కుల్దీప్, జడేజాల నుంచి పెను ముప్పు ముంచి ఉన్నట్లే. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకే అనుకూలిస్తే పాక్ జట్టు కొత్త వ్యూహంతో బరిలోకి దిగే అవకాశం ఉంది. షాహీన్ షా అఫ్రిది, హసన్ అలీపై పాక్ ఆధారపడితే మాత్రం దాయాది జట్టుకు సమస్యలు తప్పకపోవచ్చు. భారత్ తరఫున ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా జస్ప్రీత్ బుమ్రా తొలి స్థానంలో ఉన్నాడు. బుమ్రా 2 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. హసన్ అలీ పాకిస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టాడు. హసన్ 2 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు. హరీస్ రవూఫ్ 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు.
వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై వరుసగా ఎనిమిదో విజయం సాధించి రికార్డును మరింత పెంచాలని పట్టుదలతో ఉంది.