Irfan Pathan: ఫాఫ్ డుఫ్లెసిస్ స్థానంలో అతనే బెస్ట్ - చెన్నై ఓపెనింగ్‌పై ఇర్ఫాన్ పఠాన్ జోస్యం!
ఫాఫ్ డుఫ్లెసిస్ స్థానంలో చెన్నై ఓపెనర్‌గా డెవాన్ కాన్వేకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముందున్న అతి పెద్ద సవాల్ తుదిజట్టును కూర్పు చేసుకోవడమే. దీంతోపాటు రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ గాయంతో బాధపడుతున్నాడు. గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుఫ్లెసిస్ ఓపెనింగ్‌లో అదరగొట్టారు. ఈ సీజన్‌లో ఫాఫ్ డుఫ్లెసిస్‌ను వదులుకోవడంతో ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇప్పుడు చెన్నైకి ఒక సలహా ఇచ్చారు. ఫాఫ్ డుఫ్లెసిస్ స్థానంలో ఒక విదేశీ ఆటగాడి పేరును పఠాన్ సూచించాడు. న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్ డెవాన్ కాన్వేను ఓపెనర్‌గా ఉపయోగించుకోవచ్చని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.
డెవాన్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్ రూ.కోటికి దక్కించుకుంది. ఈ ఐపీఎల్‌లో ఇది బెస్ట్ డీల్స్‌లో ఒకటి. స్టార్ స్పోర్ట్స్ షో ‘గేమ్ ప్లాన్’లో మాట్లాడుతూ ఇర్ఫాన్ పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ప్లేయింగ్ కండీషన్స్ డెవాన్ కాన్వే ఆటతీరుకు సరిగ్గా సూట్ అవుతాయని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ కాన్వేకు అవకాశం ఇవ్వకపోతే తన స్థానంలో రాబిన్ ఊతప్పకు అవకాశం ఇవ్వవచ్చు అని పేర్కొన్నాడు.
‘వారికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఉన్నాడు. అది జట్టుకు కాస్త సౌకర్యమైన అంశం. మహారాష్ట్ర, వాంఖడే, సీసీఐలోని పిచ్‌లు కాన్వే ఆటతీరుకు సరిగ్గా సరిపోతాయి. ఒకవేళ కాన్వేను ఆడించకపోతే రాబిన్ ఊతప్ప కూడా మంచి ఆప్షన్. అతను కూడా అద్భుతమైన ఓపెనర్.’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.
‘ఒకవేళ కాన్వే బదులు ఊతప్పను ఓపెనింగ్ పంపిస్తే... శ్రీలంక ఆటగాడు మహీష్ తీక్షణకు కూడా తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే తుదిజట్టులో నలుగురు ఫారినర్స్‌కు మాత్రమే చోటు దక్కనుంది. బ్రేవో, మొయిన్ అలీలకు తుదిజట్టులో చోటు దక్కడం ఖాయం. మహారాష్ట్ర పిచ్‌లపై ఎక్స్‌ట్రా పేస్ ఉంటుంది కాబట్టి ఆడమ్ మిల్నే జట్టులో ఉండాల్సిందే. మహీష్ తీక్షణ రూపంలో మిస్టరీ స్పిన్నర్ అందుబాటులో ఉండాలనుకుంటే ఊతప్ప ఓపెనింగ్ చేస్తాడు. లేకపోతే డెవాన్ కాన్వేకు ఓపెనర్‌గా అవకాశం దక్కనుంది.’ అని ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించాడు.
View this post on Instagram