Team India Main Problem: టీమిండియాకు లెఫ్ట్ సమస్య - ఆ నలుగురే ఆప్షన్!
Team India: టీ20 ప్రపంచకప్ కు ఇంకా 40 రోజుల సమయం మాత్రమే ఉంది. అప్పటికల్లా టీమిండియా తమ అత్యుత్తమ జట్టును తయారుచేసుకునే పనిలో ఉంది. కప్ ను అందుకోవాలంటే మంచి జట్టును తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంకో 40 రోజుల్లో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్ కు అన్ని దేశాలు తమ అత్యుత్తమ జట్టును పంపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అందులో పాల్గొనే దేశాలన్నీ తుదిజట్టులో ఉండేందుకు స్థిరమైన 11 మంది ఆటగాళ్లను తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అలానే టీమిండియా కూడా తన ఉత్తమ జట్టును ఎంపిక చేయాలనుకుంటోంది. అందుకే వీలైనంత ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చి చూస్తోంది. కొత్త కుర్రాళ్లను సానబెడుతోంది. మ్యాచులను మలుపుతిప్పే గేమ్ ఛేంజర్లను తయారు చేసుకుంటోంది. వికెట్లు తీసే బౌలర్లను వెతికి పట్టుకుంటోంది. జట్టుకు సమతూకాన్నిచ్చే ఆల్ రౌండర్లను తీర్చిదిద్దుకుంటోంది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ... లెఫ్ట్ హ్యాండర్ విషయంలో మాత్రం టీమిండియాకు సమస్య ఎదురవుతోంది. ఎందుకంటే..
ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి కారణాలేవంటే చాలా వినిపిస్తాయి. మొదట బ్యాటింగ్ లో అనుకున్నంత స్కోరు చేయకపోవడం, ప్రధాన బౌలర్ల వైఫల్యం, ఫీల్డర్ల తప్పిదాలు వెరసి ఇలా ఎన్నో కారణాలు. అయితే సరిగ్గా గమనిస్తే ప్రధాన కారణంగా ఒకటి కనిపిస్తోంది. అదే మిడిల్ ఓవర్లలో సరైన భాగస్వామ్యాలు నిర్మించకపోవడం. దానికి కారణం సరైన లెఫ్ట్ హ్యాండర్ లేకపోవడమే.
లెఫ్ట్-రైట్ ఎప్పుడూ సక్సెస్సే...
క్రీజులో కుడి, ఎడమ బ్యాటర్లు ఉంటే బౌలింగ్ జట్టుకు కష్టమే. ఎందుకంటే బంతి బంతికీ ఫీల్డ్ మార్చడంతో పాటు వ్యూహాలను కూడా మార్చాలి. ఈ క్రమంలో పొరపాట్లు జరుగుతాయి. వాటిని అనుకూలంగా మార్చుకుంటే పరుగుల వరద పారించడం కష్టమేమీ కాదు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మనకు మైనస్ అయింది, వాళ్లకి ప్లస్ అయింది అదే. పంత్ మినహా మనదగ్గర మరో లెఫ్ట్ హ్యాండర్ లేడు. దీంతో బ్యాటింగ్‌లో వైవిధ్యం లేక, ఉన్న రైట్ హ్యాండర్లు సరిగ్గా ఆడక 200 దాటుతుందనుకున్న స్కోరు 180 దగ్గరే ఆగిపోయింది. అదే పాక్ ను తీసుకుంటే ఆరంభం సాధారణంగా ఉన్నా.. మధ్య ఓవర్లలో ఓవర్ కు దాదాపు 10కి పైనే పరుగులు రాబట్టింది. రిజ్వాన్, నవాజ్ కుడి, ఎడమల బ్యాటింగ్ శైలి వారికి కలిసొచ్చింది. దాంతో వారి పని తేలికైంది. విజయం సాధించింది. నిజానికి భారత్ కు, వారికి మధ్య ఉన్న తేడా ఆ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ల భాగస్వామ్యమే. అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచ్ లో టీమిండియా తరఫున పాండ్య, జడేజాలు అలాంటి భాగస్వామ్యమే నిర్మించారు. ఆదివారం రోజు భారత జట్టులో అదే లోపించింది.
ఒకే ఒక్క లెఫ్ట్ హ్యాండర్
ప్రస్తుతమున్న భారత జట్టును తీసుకుంటే వికెట్ కీపర్ పంత్ రూపంలో ఒకే ఒక్క లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉన్నాడు. అయితే తను కూడా నిలకడ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనపై ఎంత ఆధారపడగలమో చెప్పలేం. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో కూడా అనవసరమైన రివర్స్ స్వీప్ షాట్ ఆడి అవుటయ్యాడు. తను అవుటైన తీరు కూడా ఇప్పుడు విమర్శల పాలవుతుంది. లెఫ్ట్ హ్యాండర్ కావాలని జట్టులోకి తీసుకుంటే రైట్ హ్యాండర్‌గా మారి అవుట్ అయ్యాడని ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి రిషబ్ పంత్‌పై ఆధారపడలేం. లెఫ్ట్ హ్యాండ్ ఆల్ రౌండర్ జడేజా గాయంతో ఆసియా కప్ తో పాటు, టీ20 ప్రపంచకప్ కు దూరమయ్యాడు. ఒకవేళ పంత్ కు బదులు దినేశ్ కార్తీక్ ను తీసుకుంటే టీమిండియాలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ లేనట్లే. ఇలానే ప్రపంచకప్ కు వెళితే భారత్ తీవ్రంగా నష్టపోతుందనడంలో సందేహం లేదు.
ఆ నలుగురికి అవకాశమిస్తారా!
ఇంతకుముందులా భారత్ కు ఇప్పుడు ఎక్కువమంది లెఫ్ట్ హ్యాండర్లు అందుబాటులో లేరు. అయితే ఇప్పుడున్న వారిలోనే ఒకరిద్దరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. శిఖర్ ధావన్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్. ఇషాన్ కిషన్ లాంటి వారు టీ20 క్రికెట్ ఆడగలిగిన వారే. శిఖర్ ధావన్ ను టీ20లకు ఎందుకు తీసుకోవడంలేదో తెలియదు. జడేజా స్థానంలో ప్రస్తుతం అక్షర్ పటేల్ ఎంపికైనా.. పాక్ తో మ్యాచ్ లో అతడిని ఆడించలేదు. అలానే వెంకటేశ్ అయ్యర్ ను సానబెడితే ఓపెనర్ గా ఉపయోగపడతాడు. అలానే ఇషాన్ కిషన్ ను సమయానికి తగ్గట్లు వాడుకోవాలి.
లెఫ్ట్ హ్యాండర్ల కొరత
అసలే భారత్ కు లెఫ్ట్ హ్యాండర్ల కొరత ఉంది. ఇప్పుడు పరిమితంగా ఉన్నఎడమచేతి వాటం ఆటగాళ్లను సరిగ్గా ఉపయోగించుకోకపోతే వచ్చే టీ20 ప్రపంచకప్ లో భారత్ విజయావకాశాలు దెబ్బతింటాయనడం అతిశయోక్తి కాదు. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో భారత్ మ్యాచ్ లు ఆడనుంది. ఎంతమందిని పరీక్షించినా ఆ 6 మ్యాచ్ లే భారత్ కు ఉన్నాయి. కాబట్టి ప్రపంచకప్ సమయానికి బెస్ట్ ఎలెవన్ ను ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి చూద్దాం బీసీసీఐ ఏం చేస్తుందో..
That's that from another close game against Pakistan.
— BCCI (@BCCI) September 4, 2022
Pakistan win by 5 wickets.
Up next, #TeamIndia play Sri Lanka on Tuesday.
Scorecard - https://t.co/xhki2AW6ro #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/Ou1n4rJxHu