KL Rahul Record: చిన్నస్వామిలో లోకల్ బాయ్ హవా - ప్రపంచకప్‌లో భారత్ తరఫున రికార్డు!
ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు.
KL Rahul Fastest Century: ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. ఈ విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను రాహుల్ దాటేశాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై రాహుల్ 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 64 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో కేఎల్ రాహుల్ 102 పరుగులు చేశాడు. అంతకుముందు టోర్నీలో రోహిత్ శర్మ 63 బంతుల్లో సెంచరీ సాధించి ఈ ఘనత సాధించాడు. బెంగళూరులోని చిన్నస్వామిలో జరిగిన ఈ మ్యాచ్‌లో లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ ఈ రికార్డు సాధించడం విశేషం.
ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 131 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు ఈ రికార్డులో కేఎల్ రాహుల్ తన పేరును లిఖించుకున్నాడు.
ఈ జాబితాలో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌లను పరిశీలిస్తే వీరేంద్ర సెహ్వాగ్ (82 బంతుల్లో) మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ (83 బంతుల్లో) నాలుగో స్థానంలో నిలిచారు. 2007 ప్రపంచకప్‌లో సెహ్వాగ్ 82 బంతుల్లో సెంచరీ సాధించగా, 2011 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 83 బంతుల్లో సెంచరీ సాధించాడు.
KL Rahul nailed the ball around the park to bring up India's fastest @cricketworldcup century 👊@mastercardindia Milestones 🏏#CWC23 | #INDvNED pic.twitter.com/yncw2ZojAK
— ICC (@ICC) November 12, 2023
నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. జట్టులో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలు సాధించారు. శ్రేయస్ అయ్యర్ 128 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా కేఎల్ రాహుల్ 102 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 208 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
ప్రపంచకప్‌లో నాలుగో వికెట్ లేదా అంతకంటే కింద వికెట్ల విషయానికి వస్తే... భారత్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. భారత జట్టుకు చెందిన మొదటి ఐదుగురు బ్యాట్స్‌మెన్ 50 పరుగుల మార్కును దాటారు. ఇది భారత వన్డే చరిత్రలో మొదటిసారి.
మరోవైపు వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లీగ్ దశలోని తొమ్మిది మ్యాచ్‌లను గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డచ్ జట్టు 47.5 ఓవర్లలో250 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 160 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకపక్షంగా గెలిచినా నెదర్లాండ్స్ పోరాటం అందరినీ ఆకట్టుకుంది.