WPL 2023 captains: WPLలో ధోనీ, రోహిత్, కోహ్లీ లాంటి కెప్టెన్లు ఏ జట్లకున్నారో తెలుసా?
WPL 2023 captains: మహిళల ప్రీమియర్ లీగుకు మరో రెండు రోజులే ఉంది. అన్ని ఫ్రాంచైజీలు శిబిరాలను ఏర్పాటు చేసేశాయి. మరి ఏ జట్టు కెప్టెన్ ఎవరు? వారి స్పెషాలిటీ ఏంటో మీకోసం!
![WPL 2023 captains: WPLలో ధోనీ, రోహిత్, కోహ్లీ లాంటి కెప్టెన్లు ఏ జట్లకున్నారో తెలుసా? WPL 2023 captains of women premier league five teams their specialty, know in details WPL 2023 captains: WPLలో ధోనీ, రోహిత్, కోహ్లీ లాంటి కెప్టెన్లు ఏ జట్లకున్నారో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/a41778375b49db98f3eae52b49306b3a1677740476744251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
WPL 2023 captains:
మహిళల ప్రీమియర్ లీగుకు (WPL 2023) మరో రెండు రోజులే ఉంది. అన్ని ఫ్రాంచైజీలు శిబిరాలను ఏర్పాటు చేసేశాయి. అరంగేట్రం సీజన్లో అదరగొట్టేందుకు అమ్మాయిలకు తర్ఫీదునిస్తున్నాయి. సుశిక్షితులైన కోచింగ్ స్టాఫ్‌ను నియమించాయి. మెరుపులు మెరిపించే, మంచి ఫాలోయింగ్ ఉన్న సారథులను రంగంలోకి దింపుతున్నాయి. ఏ జట్టు కెప్టెన్ ఎవరు? వారి స్పెషాలిటీ ఏంటో మీకోసం!
అటు కోహ్లీ ఇటు స్మృతి
విమెన్ ప్రీమియర్ లీగులో అందరినీ ఆకర్షిస్తున్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)! స్టార్ స్టేటస్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్వదేశీ, విదేశీ క్రికెటర్లు వీరి సొంతం. టీమ్‌ఇండియా ఓపెనర్ స్మృతి మంధానాను (Smriti Mandhana) అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. అనుకున్నట్టే పగ్గాలూ అప్పగించేసింది. ఎడమచేతి వాటం బ్యాటింగ్, సొగసైన షాట్లతో ఆమె అభిమానుల హృదయాలను కొల్లగొట్టగలదు. ప్రత్యర్థులను భయపెట్టగలదు. టీ20 క్రికెట్లో ఆమెకు తిరుగులేదు. బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, ట్రయల్ బ్లేజర్స్, వెస్ట్రన్ స్ట్రోమ్, సథరన్ బ్రేవ్ వంటి టీ20 లీగు జట్లకు ఆడింది. 116 టీ20ల్లో 27.74 సగటు, 123 స్ట్రైక్‌రేట్‌తో 2802 పరుగులు చేసింది.
అక్కడ రోహిత్ ఇక్కడ హర్మన్
ఇండియన్ ప్రీమియర్ లీగులో ముంబయి ఇండియన్స్ (MI) ఛాంపియన్స్ జట్టు! మహిళల ప్రీమియర్ లీగులోనూ విజేతగా నిలవాలని అనుకుంటోంది. అందుకు తగ్గట్టే మంచి జట్టును ఎంపిక చేసుకుంది. సపోర్ట్ స్టాఫ్‌కు తిరుగులేదు. పురుషుల్లాగే ఇక్కడా టీమ్‌ఇండియా కెప్టెన్‌నే సారథిగా ఎంచుకుంది. ప్రత్యర్థుల మతి పోగొట్టే షాట్లు ఆడగల హర్మన్ ప్రీత్ కౌర్‌ను (Harmanpreet Kaur) నాయకురాలిగా నియమించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆమెకు ఎదురు లేదు. చకచకా వ్యూహాలు రచించగలదు. లాంకాషైర్ థండర్, మంచెస్టర్ ఒరిజినల్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్స్, సూపర్‌నోవా జట్లకు ఆడింది. 151 టీ20ల్లో 28 సగటుతో 3058 పరుగులు చేసింది. 32 వికెట్లు పడగొట్టింది.
జెయింట్స్‌కు మూనీ
మహిళల లీగులో మంచి సపోర్ట్ స్టాఫ్ ఉన్న జట్టేదైనా ఉందంటే అది గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants)! మిథాలీ రాజ్, రేచెల్ హెయిన్స్‌ను తీసుకుంది. వీరిద్దరూ రైల్వేస్, ఆసీస్ క్రికెటర్లను ఎక్కువగా తీసుకున్నారు. చక్కని ఆల్‌రౌండర్లనూ ఎంపిక చేశారు. అయితే రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన యాష్లే గార్డ్‌నర్‌ను కాకుండా రూ.2 కోట్లకు తీసుకున్న బెత్ మూనీకి (Beth Mooney) సారథ్యం అప్పగించారు. ఆసీస్ క్రికెట్లో ఆమె ఓ సంచలనం. నిలబడిందంటే సెంచరీ చేయడం పక్కా! ఏ మాత్రం కనికరించకుండా సిక్సర్లు, బౌండరీలు బాదేస్తుంది. బ్రిస్బేన్ హీట్, లండన్ స్పిరిట్, పెర్త్ స్కార్చర్స్, క్వీన్స్‌ల్యాండ్, యార్క్‌షైర్‌కు ఆడింది. 83 టీ20ల్లో 40.51 సగటుతో 2350 పరుగులు చేసింది. 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు కొట్టింది.
వారియర్స్‌కు క్రేజీ హీలీ!
డబ్ల్యూపీఎల్‌లో సమతూకంగా కనిపిస్తున్న జట్టు యూపీ వారియర్స్! సీనియర్లు, జూనియర్లు, స్వదేశీ, విదేశీ క్రికెటర్లను పక్కా ప్లాన్‌తో ఎంచుకున్నారు. మొదటి నుంచీ పద్ధతిగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఆరు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన అలీసా హీలిని (Alyssa Healy) సారథిగా ఎంపిక చేశారు. నార్తన్ సూపర్ ఛార్జర్స్, సిడ్నీ సిక్సర్‌కు ఆడింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడటం, గెలిపించడం ఆమెకు హాబీ! కెప్టెన్సీ అనుభవమూ ఉంది. 141 టీ20ల్లో 24.40 సగటు, 126 స్ట్రైక్‌రేట్‌తో 2489 పరుగులు చేసింది. అలవోకగా సిక్సర్లు, బౌండరీలు బాదేస్తుంది.
డీసీకి లానింగ్ లేదా జెమీమా!
ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ రెండింట్లోనూ దిల్లీ క్యాపిటల్స్ ఒకే ఫార్ములాను అనుసరిస్తోంది. యువతకే పెద్దపీట వేస్తోంది. తక్కువ ధరకే ఎమర్జింగ్ క్రికెటర్లను కొనుగోలు చేయడం సుదీర్ఘ కాలం వారిని తీర్చిదిద్దడం అలవాటుగా చేసుకుంది. యంగ్ అండ్ డైనమిక్ షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, జైసా అక్తర్‌ను తీసుకుంది. అయితే ఇప్పటి వరకు సారథిని ప్రకటించలేదు. బహుశా ఆసీస్ ప్రపంచకప్‌ల కెప్టెన్ మెగ్ లానింగ్, జెమీమాల్లో ఒకరికి అప్పగించే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)